2024 ఎన్నికల ట్యాగ్‌లైన్‌ లోగోను విడుదల చేసిన ఈసి

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల నిర్వహణకు రెండు-మూడు నెలలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టింది..

ఎన్నికల నిర్వహణ, తేదీలపై కార్యచరణ జరుగుతోంది. ఏప్రిల్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి లోగో, ట్యాగ్‌లైన్‌ని గురువారం ఆవిష్కరించింది.

ఎన్నికల ట్యాగ్ లైన్ ‘చునావ్ కా పర్వ్, దేశ్ కా గర్వ్'( ఎన్నికల పండగ దేశానికి గర్వకారణం) అని పేర్కొంది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తేదీలను ప్రకటించాల్సి ఉంది.

ఎంసెట్ ను టీఎస్‌ ఈఏపీసెట్‌ గా మార్పు

తెలంగాణ ఎంసెట్‌ పేరును ఉన్నత విద్యా మండలి మార్చింది. టీఎస్‌ ఎంసెట్‌ పేరును టీఎస్‌ ఈఏపీసెట్‌ గా మారుస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.

మే 6న టీఎస్‌ ఈసెట్‌, జూన్‌ 4 , 5 న ఐసెట్‌, జూన్‌ 6 నుంచి 8 వరకు టీఎస్‌ పీజీఈసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఈ తేదీలకు ఆమోద ముద్ర వేయడంతో నేడు అధికారికంగా ఉన్నత విద్యామండలి ప్రకటించింది.

విద్యార్థులందరూ ఈ మేరకు అర్హత పరీక్షలకు రాసేందుకు సిద్ధమవ్వాలని కోరింది...

ఈనెల 27 నుంచి జగన్ ఎన్నికల శంఖారావం

ఈ నెల 27 నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తార‌ని గురువారం వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్ల‌డించారు.

27వ తేదీన భీమిలి వేదిక‌గా క్యాడర్‌తో సీఎం మహాసభ నిర్వహిస్తార‌ని తెలిపారు. రాష్ట్రంలో మ‌రోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామ‌ని పేర్కొన్నారు. త్వ‌ర‌లో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంద‌ని చెప్పారు..

త్వరలోనే పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పార్లమెంట్ అభ్యర్థుల ఎంపికపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు.

అభ్యర్థుల ఎంపికను వచ్చేవారం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణ లో పర్యటిస్తారని తెలిపారు.

హైదరాబాద్ లో పార్లమెంట్ పై బీజేపీ సన్నాహాక సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంట్‌లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పని చేయాలన్నారు.

మరోసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మాజీ సీఎం కేసీఆర్ పై కేసు నమోదు చేయండి: హైకోర్టు

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎక్సెలెన్స్ సెంటర్ ఏర్పాటు కోసం గత ప్రభుత్వం కోకాపేటలో 11 ఎకరాల స్థలం కేటాయింపు విషయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాల్సిందిగా గురువారం హైకోర్టు ఆదేశించింది.

అప్పటి రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్, ప్రధాన కార్యదర్శిపైనా కేసులు నమోదు చేయాలంటూ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మరో పిటిషన్ (నెం. 45/2024)తో అటాచ్ చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ క్లారిటీ ఇచ్చింది.

ఈ భూమి లావాదేవీలతో సంబంధం ఉన్న రెవెన్యూ శాఖ అధికారులను కూడా జవాబుదారీ చేయాలంటూ బెంచ్ నొక్కిచెప్పింది. కోకాపేటలో (సర్వే నెం. 239, 240) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ సెంటర్ కోసం 11 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గతేడాది ఒక మెమో (నెం. 12425) లాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి జారీ అయింది.

ఈ ఉత్తర్వుల మేరకు రంగారెడ్డి జిల్లా అప్పటి కలెక్టర్ ఒక్కో ఎకరానికి రూ. 3.42 కోట్ల చొప్పున మార్కెట్ విలువ ప్రకారం మొత్తం 11 ఎకరాలకు రూ. 37.53 కోట్ల మేర ధరను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ ఈ భూమి ధర మొత్తం రూ. 1100 కోట్ల మేర ఉంటుందని, అతి చౌకకు బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టడాన్ని సవాలు చేస్తూ వెంకట్రామిరెడ్డి దాకలు చేసిన ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వెంకట్రా మిరెడ్డి గతంలో హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ పిటిషన్‌ను గురువారం విచారించి పై ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ పిటిషన్‌పై గతంలో విచారణ జరగ్గా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున హాజరైన న్యాయవాది గతేడాది ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు సీసీఎల్‌ఏకు లేఖ రాశానని మే 16న కోర్టుకు వివరించారు.

సీసీఎల్ఏ సైతం ఈ భూమి విషయంలో తెలంగాణ స్టేట్ లాండ్ మేనేజ్‌మెంట్ అథారిటీకి లేఖ రాసిందని, పరిశీలన అనంతరం సానుకూలంగా సిఫారసు చేసిందని గుర్తుచేశారు. ఈ లావాదేవీలకు కొనసాగిం పుగా హెచ్ఎండీఏ సైతం 11 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.

తాజా విచారణలో చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ పిటిషనర్ తరఫునా, బీఆర్ఎస్ తరఫునా హాజరైన న్యాయవాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధినేత, అప్పటి ప్రధాన కార్యదర్శి, అప్పటి రెవెన్యూ సెక్రటరీ, బాధ్యులైన మరికొద్దిమంది రెవెన్యూ అధికారులపై కేసులు నమోదు చేయాలంటూ ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చింది...

టీఎస్ పిఎస్పీ సభ్యులుగా ఐదుగురి నియామకం

కొద్దిసేపటి క్రితం టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని గవర్నర్ తమిళిసై నియమించారు.

తాజాగా సభ్యుల నియామకానికి కూడా ఆమె ఆమోదం తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీకుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, రామ్మోహన్ రావును సభ్యులుగా నియమించారు...

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదంద‌రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్

గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ లుగా ప్రొఫెస‌ర్ కోదండ రామ్, మీర్ అమీర్ అలీ ఖాన్ లు ఎంపిక‌య్యారు..

ఈ ఇద్దరు ఎమ్మెల్సీల పేర్ల‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ ఖ‌రారు చేస్తూ ఈరోజు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల

రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి "జై భారత్ నేషనల్ పార్టీ" మేనిఫెస్టో ప్ర‌క‌టించింది.

ఆ పార్టీ అధ్య‌క్షుడు జేడీ లక్ష్మీనారాయణ గురువారం మేనిఫెస్టోను విడుద‌ల చేశారు.

రైతులకు ప్రతి నెలా రూ.5వేలు, వడ్డీలేని రుణాలు, రైతు కమిషన్ ఏర్పాటు, ఎకరానికి రూ.15వేల నష్టపరిహారం ప్రతి నియోజకవర్గంలో భారీ పరిశ్రమలు ఏర్పాటు వంటి హామీల‌ను మేనిఫెస్టోలో పేర్కొన్నారు...

ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు రేపే ఆఖరి రోజు

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 119 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రేపటితో గడువు ముగియనుంది.

జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలున్నాయి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారు అర్హులు. ఎంపిక రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.

అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 26, 2024 వరకు AAI అధికారిక వెబ్‌సైట్ https://aai.aero/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..

ఫిబ్రవరి 8న ఫైనల్ ఓటర్ జాబితా విడుదల చేస్తాం: వికాస్ రాజ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.

ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్‌ లిస్ట్‌ ప్రకటించ నున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించు కోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్‌ చేశారు.

ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నేషనల్‌ ఓటర్స్‌ డే సందర్భంగా సెలబ్రేషన్స్‌ జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వికాస్‌రాజ్‌ మాట్లాడుతూ జనరల్‌ ఎలక్షన్స్‌ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్‌ విజయవంతంగా నిర్వహించాం. ఇప్పుడు లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సిద్ద‌మ‌వుత‌న్నాం…

ఇందులో కూడా విజ‌యం సాధిస్తాం.. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అన్నారు.. ఇక తెలంగాణాలో తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు.