TS: నేడు 3 నియోజకవర్గాలలో కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలు

తెలంగాణ లో నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగియ‌నుంది. సీఎం కేసీఆర్ ఈ రోజు మూడు నియోజకవర్గాలలో ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల్లో పాల్గొన‌నున్నారు.

ముందుగా వ‌రంగ‌ల్ ఈస్ట్, వ‌రంగ‌ల్‌ వెస్ట్ ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌చారం చేస్తారు. అనంత‌రం త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గమైన గ‌జ్వేల్‌లో సాయంత్రం ప్ర‌చారంలో పాల్గొన‌నున్నారు.

ఎన్నికల ప్ర‌చారం చివ‌రి రోజు కావ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ ప్ర‌సంగం ఎలా ఉంటుందోన‌ని ఉత్సాహాంతో ఎదురు చూస్తున్నారు. అలాగే స‌భ‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను ఇప్ప‌టికే బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి చేశారు. అటు పోలీసులు కూడా భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు.

సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం

మునుగోడు నియోజకవర్గ సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ దోనూరి నర్సిరెడ్డిని గెలిపించాలని మార్రిగూడ మండలంలోని శివన్న గూడెం గ్రామంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సిఐటియు కార్మికులను కలిసి నర్సిరెడ్డి ని గెలిపించాలని కోరారు. 

కార్మికుల పక్షాన, పేదల పక్షాన నిరంతరం ప్రజాసేవకే అంకితమై 35 సంవత్సరాలుగా తన రాజకీయ జీవితాన్ని కార్మికులకు అందించిన ఘనత కామ్రేడ్ నర్సిరెడ్డి దని, మునుగోడు నియోజకవర్గం నుండి గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. మండల కమిటీ సభ్యులు మైల సత్తయ్య, గడగోటి వెంకటేష్, పిట్టల రమేష్, అప్పనగోని యాదయ్య, పల్లి నరసింహ, జనిగల సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన నిరుపేద విద్యార్థి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసిన YRP ఫౌండేషన్

అనుముల మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద ఇంజనీరింగ్ విద్యార్థి గార్లపాటి భరత్ కు వై ఆర్ పి ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవి ప్రసాద్ ఇంజనీరింగ్ 2వ సంవత్సరం ఫీజు మొత్తం 35 వేల రూపాయల నగదును చెక్ రూపంలో ఈరోజు నల్గొండ పట్టణంలోని YRP ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం నందు పంపిణీ చేయడం జరిగింది.

అనుముల మండలం అన్నారం గ్రామానికి చెందిన నిరుపేద దళిత విద్యార్థి గార్లపాటి భరత్ నల్గొండ పట్టణంలోని మాధవ్ నగర్ ప్రభుత్వ JBS హైస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి, చదువుల్లో రాణిస్తూ, హైదరాబాద్ మహావీర్ కాలేజీలో పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తీర్ణుడై, ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం అదే కాలేజీలో స్థానం సంపాదించాడు.

ఈ సందర్భంగా గార్లపాటి భరత్ తల్లిదండ్రులు గార్లపాటి ఊశయ్య- అంజమ్మలు నిరుపేద వ్యవసాయ కూలీలు కావడం వారికి కుమారుడి ఇంజనీరింగ్ చదువు ఫీజు కట్టే స్తోమత లేకపోవడం వల్ల JBS హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు బొమ్మపాల గిరిబాబు సహకారంతో వైఆర్పి ఫౌండేషన్ వారిని సంప్రదించగా వారు విద్యార్థి స్థితిగతులను, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకుని భరత్ కు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుకై అవసరమైన 35వేల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

ఎలిశాల రవి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాల దశనుండే క్రమశిక్షణ, మంచి నడవడికతో, ప్రణాళికాబద్ధంగా చదువుల యందు శ్రద్ధను చూపెడితే యుక్త వయసులోనే మంచి భవిష్యత్తును పొందవచ్చునని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా గార్లపాటి భరత్ ఉన్నత చదువులకు మా YRP ఫౌండేషన్ ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందిస్తుందని తెలియజేశారు. 

అనంతరం చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎలిశాల రవి ప్రసాద్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి శమీమ్అక్తర్, ఎలిశాల శరత్ చంద్ర, యామా దయాకర్, ఎలిశాల వెంకటేశ్వర్లు,పారేపల్లి భరత్, బొమ్మపాల గిరిబాబు, మద్ది కర్ణాకర్, మారేపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మెగా రక్త దాన శిబిరం

NCC డే సందర్భంగా ఈ రోజు నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాల లో NCC మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నాగార్జున కళాశాల NCC ఆఫీసర్ చిలుముల సుధాకర్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. NCC క్యాడెట్లు దేశ నిర్మాణం పట్ల,దేశ రక్షణ పట్ల, కళాశాల స్థాయి నుంచి నిబద్ధత కలిగినటువంటి దేశ పౌరునిగా తయారు అయ్యేటందుకు NCC దోహదపడుతుందని, ఇది విద్యార్థులలో యువతలో క్రమశిక్షణ, నాయకత్వం మరియు సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని, సమాజానికి సానుకూలంగా సహకరించేలా వారిని సిద్ధం చేస్తుంది.

NCC క్యాడెట్లు దేశ రక్షణతో పాటుగా ఒక పౌరుని ఆపద సమయంలో రక్తం దానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో NCC సుబేదార్ చంకోర్ సింగ్, కళాశాల లైబ్రేరియన్ డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర సభ్యులు మందడి నర్సిరెడ్డి మరియు క్యాడెట్లు వంశీ, జయంత్, సాయి మాధవ్, సంపత్ ఆదిత్య, సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

TS: కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలకు సర్వం సిద్ధం.. ఈవీఎంల పరిశీలన పూర్తి

రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. సరిగ్గా మరో 3 రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగబోతోంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి గందరగోళం కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ సమస్యపై పలు చోట్ల ఉద్యోగులు ఆందోళనకు కూడా దిగారు.

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ దాదాపు 3 లక్షల మంది ఎలక్షన్ డ్యూటీలో ఉండగా, లక్షా 60 వేల మందికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్‌‌ ద్వారా ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అందులో 56 వేల మంది ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవంబర్ 29 లోపు మరో లక్ష మంది ఎలక్షన్ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ట్రైనింగ్‌లో చెప్పింది ఒకటైతే, గ్రౌండ్ లెవల్‌​లో పోస్టల్ ​బ్యాలెట్ ప్రక్రియ మరోలా జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలావుంటే, ఈ సారి అంగన్​వాడీలకు కూడా ఈసీ ఎన్నికల విధులు అప్పగించింది. వారికి సొంత పోలింగ్ స్టేషన్ల పరిధిలో కాకుండా ఇతర పోలింగ్​ కేంద్రాల్లో విధులు కేటాయించారు. దాంతో ఈ ఎన్నికల్లో దాదాపు 30 వేలకు పైగా అంగన్​వాడీలు, ఇతర సిబ్బంది తమ పోస్టల్​ బ్యాలెట్‌ వినియోగించుకోలేక పోతున్నారనే ప్రచారం జరుగుతోంది.

పోలింగ్‌ విధుల్లో ఎక్కువగా టీచర్లు, పలు శాఖల ఉద్యోగులు పాల్గొంటారు. అయితే వారికి సరిపడా పోస్టల్‌ బ్యాలెట్‌ పత్రాలు లేకపోవడంతో పోలింగ్‌ సిబ్బందిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల గందరగోళం వ్యవహారం.. ఎన్నికల ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

పరిస్థితులను బట్టి కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని టిఎస్ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. అందులో భాగంగా ప్రత్యేక పరిశీలకుల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని స్పష్టం చేశారు. పోలింగ్ ఏర్పాట్లు సహా ఎన్నికల సంబంధిత అంశాలపై సీఈవో వికాస్ రాజ్ వివరించారు. ఇప్పటికే హోం ఓటింగ్ పూర్తి అయిందని ఆయన తెలిపారు. ఫెసిలిటేషన్ సెంటర్లలో ఒక లక్ష 31 వేల ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు, వెయ్యికి పైగా నాన్ గవర్నమెంటు ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సీఈవో వెల్లడించారు. మొత్తం లక్ష 65వేల పోస్టల్ బ్యాలెట్ ఆమోదం తెలిపామన్న ఆయన, ఇప్పటి వరకు 95వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు. అలాగే హోం ఓటింగ్ ద్వారా 26వేల మంది ఓటింగ్ పూర్తి చేసుకున్నారన్నారు.

అలాగే రాష్ట్రంలో ఎన్నికల ఉల్లంఘన కింద భారీ ఎత్తున నగదు దొరుకుతోందని అన్నారు. ఆదివారం మధ్యాహ్నం వరకు రూ. 709 కోట్ల సీజ్ చేశామన్నారు. అందులో రూ. 290కోట్ల వరకు నగదు ఉందన్నారు. రాష్ట్రంలో మొదటిసారి మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉందన్న సీఈవో ఓటర్ల నిష్పత్తి 1000:1002 గా ఉన్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఇందుకోసం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నట్లు వికాస్ రాజ్ తెలిపారు. EVM లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి, 54 లక్షల 13వేల EPIC ప్రింటింగ్ పూర్తి అయిందన్నారు. ఓటరు ఐడెంటీ కార్డులు బూత్ లెవ్ అధికారుల ద్వారా ఇంటింటికి పంపిణి జరుగుతుందని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఈవో వికాస్ రాజ్, మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారని తెలిపారు. ఇందులో 221 మహిళా అభ్యర్థులు ఉన్నారన్నారు. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ బూతులు ఏర్పాటు చేశామని సీఈవో తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, హైదరాబాద్ జిల్లాలో 14, ఒక్కో జిల్లాలో ఒక్కొకటి చొప్పున ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్న ఆయన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో CCTV, వెబ్ కాస్టింగ్ ఉంటుందన్నారు. లా అండ్ ఆర్డర్ ను పకడ్బందీ గా ఉండేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ నిర్వహించేందుకు 45వేల తెలంగాణ పోలీసు విధుల్లో ఉన్నారని, 196 కేంద్ర బలగాలు వచ్చాయి, ఇతర రాష్ట్రాల నుంచి 24వేల హోం గార్డ్స్‌లను కూడా విధుల్లోకి తీసుకున్నామన్నారు.

దివ్యాంగులు, వృద్దులు ఓటే వేసేందుక అన్ని చర్యలు తీసుకున్నామన్న సీఈవో.. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వీల్ చైర్, ఒక సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. ఇప్పటికే 80వేల వీల్ చైర్లను అయా జిల్లాలకు పంపామని తెలిపారు. పోలింగ్ సమాయానికి 48 గంటల నుంచే తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీఈవో తెలిపారు. 48 గంటల ముందే స్థానికేతరులు అయా ప్రాంతాలను విడిచి బయటకు వెళ్లిపోవాలన్నారు. సైలెంట్ పీరియడ్ లో టీవీ, సోషల్ మీడియా ప్రకటనలకు అనుమతి లేదన్నారు.

NLG: ఛాయా సోమేశ్వర ఆలయంలో వైభవంగా జ్వాల తోరణం

నల్గొండ పట్టణంలోని పానగల్ లో గల ఛాయా సోమేశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం జ్వాలా తోరణం వైభవంగా నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ మరియు రుద్రసేన ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి నిరంతరాయంగా అభిషేకాలు నిర్వహించారు.

కలెక్టర్ కర్ణన్ , నల్గొండ జిల్లా మెజిస్ట్రేట్ నాగరాజు.. జ్వాలా తోరణాన్ని వెలిగించి ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంత రెడ్డి మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణాన్ని నిర్వహిస్తారని, జ్వాల తోరణం దర్శించుకోవడం వలన మానవులకు పునర్జన్మ ఉండదని మరియు సకల పాపాలు నశిస్తాయని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోనేటి దగ్గర దీపాలు వెలిగించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ కర్ణన్, జిల్లా జడ్జ్ నాగరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ఆలయ మేనేజర్ చింతల సత్యనారాయణ, శ్రీనివాస్ శర్మ, గుండగోని శ్రీదేవి సోమశేఖర్, చింత బిక్షపతి, శిరస్సు నగేష్, బిష్టు రవి, కాసర్ల శేఖర్ రెడ్డి, ధారా వెంకట్, హరిబాబు, చింతల వెంకటరెడ్డి, గట్ల భరత్ రెడ్డి, ఆలయ అర్చకులు జంగం ఉదయ్ కుమార్, జంగం అజయ్ కుమార్ మరియు పురాతన దేవాలయాల సేవ ట్రస్టు సభ్యులు, వేద పాఠశాల విద్యార్థులు, రుద్రసేన సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

NLG: మునుగోడు గడ్డ కమ్యూనిస్టుల అడ్డ: జెర్రిపోతుల ధనంజయ గౌడ్

నల్లగొండ జిల్లా చండూరు మండలం: 

మునుగోడు గడ్డ అంటేనే కమ్యూనిస్టుల అడ్డగా మళ్లీ చరిత్రను పునరావతం చేసే విధంగా ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కమ్యూనిస్టు అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్ అన్నారు.. ఆదివారం మండలంలోని నేర్మట గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు కంచుకోటగా పేరుగాంచిన మునుగోడును ఎర్రగొండ గా చెప్పుకునే విధంగా మహనీయులు చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని, వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టుల బలం నిరూపించుకునే సమయం ఆసన్నమైందని అన్నారు. 

కమ్యూనిస్టుల మనోభావాలను దెబ్బ తినే విధంగా ప్రసంగాలు ఇస్తున్న పార్టీలకు బుద్ధి చెప్పేందుకు కమ్యూనిస్టులు నడుం బిగించి పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. గత పది సంవత్సరాల నుండి కేంద్ర రాష్ట్రాలను పాలిస్తున్న బిజెపి బిఆర్ఎస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలను మభ్య పెట్టేందుకు కొత్త కొత్త హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజలకు చెందాల్సిన పకృతి సంపదను, పెట్టుబడుదారులకు చౌక ధరల్లో కట్టబెట్టడంతో పెట్టుబడుదారులు ధరలు అధికంగా పెంచి ప్రజల నడ్డి విరిగే విధంగా ప్రభుత్వాలు 300కు ఉన్న గ్యాస్ సిలిండర్ 12 వందల కు పెంచడంతో పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగుల సమస్యలను తీర్చేందుకు రెండు కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలలో 20 కోట్ల నిరుద్యోగుల భర్తీ ఎక్కడ చేశావో చూపించాలని కేంద్ర ప్రభుత్వానికి సవాలు విసిరారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారతాయని ఆశించిన పేద ప్రజలకు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ వంటి పథకాలను ఆశ చూపి పేద ప్రజలను నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. గత పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించకుండా దళిత బందు పథకం ఆశ చూపి మరోసారి పేద ప్రజలను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కుట్ర కు తెరలేపిందని విమర్శించారు. రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పరికరాలను , విత్తనాలను అందించకుండా రైతుబంధు పథకాన్ని అడ్డం పెట్టుకొని రైతులను మోసం చేస్తున్నదని ఆరోపణ చేశారు. 

ప్రజా సమస్యలను విస్మరించి పాలిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు,, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అండగా ఉండే కమ్యూనిస్టు పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. అధికారం కోసం ఆరాటపడుతున్న పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని వారు ఇంటింటికి తిరిగి వివరిస్తూ, ప్రజల కోసం పోరాడే పార్టీ సిపిఎం అని, సిపిఎం పార్టీని ఆదరించాలని వారు ప్రజలను కోరారు. సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి దోనూరి నర్సిరెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించి, సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో గణేష్, స్వామి, లింగమ్మ, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్

నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి:

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ శాఖ, దేవరకొండ నియోజక వర్గం ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి చౌరస్తాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏఐఎస్ఎస్డి జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షలు సురేష్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు గోపాల్ పాల్గొని స్థానిక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా ఏకుల సురేష్, చిట్యాల గోపాల్ మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందన్నారు. 

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు హక్కులను రాజ్యాంగం ప్రకారం అందించాలని అన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజక వర్గం ఉపాధ్యక్షుడు యేకుల అంబేద్కర్, జిల్లా కోశాధికారి అంబికా శ్రీను, సభ్యులు చలిసిమల పర్వతాలు, పెరుమాళ్ళ హరి, రామవత్ సేవా నాయక్,హరినారాయణ, మనికంట, లోకేష్, అధిరాల రాము, వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేవరకొండలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

బాబాసాహెబ్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని, నేడు దేవరకొండ పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏఐఎస్ఎస్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, స్వాతంత్ర్యం నకు పూర్వం దేశ ప్రజలకు.. వలస పాలకుల, రాజరికపు పాలకుల పాలనలో కేవలం వాళ్ళు చెప్పిందే అమలయ్యేదని.. భారత రాజ్యాంగం ఆమోదం ద్వారా దేశంలోని కోట్లాదిమంది ప్రజలకు విద్య, వైద్యం, సదుపాయాలు హక్కుగా పొందే అవకాశంతో పాటు అనేక పరిపాలన, రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కులు కల్పించబడ్డాయని తెలిపారు.

భారత రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర మరువలేనిదని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు విజయకుమార్, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నాయకులు రాములు, రాజేష్, రాజ్ కుమార్, గిరి తదితరులు పాల్గొన్నారు

నేడు రాజ్యాంగ దినోత్సవం

నేడు దేశం మొత్తం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం, గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు అంటే 1949 నవంబర్ 26న, ఈ రోజు న ప్రతీ ఏటా రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం ను ఘనంగా నిర్వహిస్తున్నారు.