NLG: కౌలు రైతులకు అండగా కస్తూరి ఫౌండేషన్
దామరచర్ల: దేశానికి వెన్నుముక అయిన రైతులను, కౌలు రైతులను ఆదుకునేందుకు కస్తూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది నుండి నూతనంగా చేయూత కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు కస్తూరి ఫౌండేషన్ సభ్యులు మెండే వెంకట్ అన్నారు. ఆదివారం మండలంలోని వాచ్యాతండ గ్రామంలో ఆర్థికబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్న రెండు కౌలురైతు కుటుంబాలకు అన్నపూర్ణ సేవా సమితి సూచనతో, కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ ఆధ్వర్యంలో చేయూతనిచ్చారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మెండే వెంకట్ మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీ చరణ్ తను కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తున్న సమయంలో, పేద విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన కస్తూరి ఫౌండేషన్ పేరుతో ఒక సేవ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు, పాఠశాలల మరమ్మతుల కోసం చేయూతనిస్తూ వస్తున్నారు.
2017 నుంచి నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం నిరంతర శ్రామికుడిగా పనిచేస్తున్న గొప్ప సేవా తత్పురుషుడు కస్తూరి శ్రీ చరణ్ అని అన్నారు. అందులో భాగంగా దేశానికి వెన్నుముక అయిన రైతులు, నేడు చాలా దీనావస్థలో ఉన్నారని గ్రహించి, వారిని ఆదుకోవడం కోసం తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో, రైతన్నలకు చేయూత అనే నూతన కార్యక్రమానికి ఈ ఏడాది నుండి శ్రీకారం చుట్టారన్నారు.
అందులో భాగంగా మొదటగా దామరచర్ల మండలం వాచ్యా తండ గ్రామంలోని కౌలు రైతులు అయిన రామావతు లచ్చు, ధరావత్ చంద్రులు మృతి చెందిన విషయాన్ని అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు శ్రీకాంత్ కస్తూరి ఫౌండేషన్ కు సమాచారం అందించగా వెంటనే స్పందించిన కస్తూరి శ్రీ చరణ్ వారి ఒక్కొక్క కుటుంబానికి కుటుంబ సభ్యులు అయిన రామావత్ పూరి, ధరావత్ నాగులకు రెండు సంవత్సరాల పాటు ప్రతి నెల 3 వేల రూపాయల చొప్పున అందించేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అన్నారు.
అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి చేయూతనివ్వడం, నిరుపేద కుటుంబాలకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చిన కస్తూరి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కస్తూరి ఫౌండేషన్ సహకారంతో తమ అన్నపూర్ణ సేవా సమితి రానున్న రోజుల్లో విస్తృతమైన సేవా కార్యక్రమాలను చేస్తామన్నారు.
అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం 5000 రూపాయల చెక్కును అందించారు. వాచ్యా తండా ఎంపీటీసీ లావురి లక్కీ సింగ్ మాట్లాడుతూ.. తమ గ్రామంలోని రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కస్తూరి ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు. దీనిని ఆదర్శంగా తీసుకొని గ్రామంలోని యువత గ్రామ అభివృద్ధికి పాటుపడితే రైతు అనేవాడు ధైర్యంగా బతుకుతాడని తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తేజ నాయక్, అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు తిరుమలేష్, కస్తూరి ఫౌండేషన్ మీడియా ప్రతినిధి చెన్నూరి రవికుమార్, వాచ్యా తండా యూత్ సభ్యులు బాలకోటి, బాలాజీ, రవి, రమేష్ తదితరులు ఉన్నారు.
Aug 15 2023, 18:57