ఖాళీ బాటిళ్లతో ఆదాయం
తాగునీరు, కూల్‌డ్రింక్ ఖాళీ బాటిళ్లతో మీరు ఆదాయం/కానుకలు పొందవచ్చు. ఆ దిశగా జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు మొదలుపెట్టింది. పర్యావరణంపై ప్రభావం..సేకరణ, రవాణా వ్యయం లేకుండా ఖాళీ బాటిళ్లను ప్రాథమిక దశలోనే సేకరించేలా రివర్స్ వెండింగ్ యంత్రాల(ఆర్‌వీఎం)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.
తాగునీరు, కూల్‌డ్రింక్ ఖాళీ బాటిళ్లతో మీరు ఆదాయం/కానుకలు పొందవచ్చు. ఆ దిశగా జీహెచ్‌ఎంసీ(GHMC) కసరత్తు మొదలుపెట్టింది. పర్యావరణంపై ప్రభావం..సేకరణ, రవాణా వ్యయం లేకుండా ఖాళీ బాటిళ్లను ప్రాథమిక దశలోనే సేకరించేలా రివర్స్ వెండింగ్ యంత్రాల(ఆర్‌వీఎం)ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం పలు ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోంది. వ్యాపారులు, తాగునీరు, కూల్‌డ్రింక్ తయారీ సంస్థలనూ సామాజిక బాధ్యతగా ఇందులో భాగస్వాములను చేయాలని భావిస్తున్నారు.
గ్రేటర్‌లో నిత్యం 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వెలువడుతుండగా, ఇందులో వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలు 1500 టన్నుల వరకు ఉంటాయి. వీటిలో ప్లాస్టిక్ బాటిళ్లు 80 నుంచి 100 టన్నులుంటాయని జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. లో గ్రేడ్ ప్లాస్టిక్ కవర్లు 950 టన్నుల వరకు ఉంటాయి. డంపింగ్ యార్డుకు తరలించిన అనంతరం తడి, పొడి చెత్తను వేరు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలను విద్యుదుత్పత్తి కోసం వాడుతున్నారు. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, కార్యాలయాల నుంచి వ్యర్థాలను సేకరించి నగరం నుంచి జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఇందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ వ్యయాన్ని తగ్గించడం.. పర్యావరణహితంగా ఉండేలా బాటిళ్ల సేకరణకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.
మాల్స్, వ్యాపార సముదాయాలున్న చోట పైలట్ ప్రాజెక్టుగా ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. యంత్రాల ఏర్పాటు బాధ్యతలను వ్యాపార సంస్థలకు అప్పగించాలా..? ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించే ఏజెన్సీల ద్వారా యంత్రాలు ఏర్పాటు చేయాలా..? అన్న దానిపై ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.
200 మిల్లీలీటర్ల నుంచి 2 లీటర్ల వరకు ఉండే ఖాళీ బాటిళ్లు డిపాజిట్ చేసేలా మొదటగా ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయనున్నారు. యంత్రాల్లో ఖాళీ సీసాలు వేస్తే.. బాటిళ్ల సామర్థ్యం (ఎంత ఎంఎల్..? లీటర్లు) బట్టి రూపాయి నుంచి రూ.5 వరకు ఇచ్చే అవకాశముంటుంది.
లేనిపక్షంలో రివార్డులు/పిల్లలను ఆకర్షించేలా పెన్నులు, షార్ప్‌నర్, ఎరేజర్ వంటివి ఇచ్చినా ప్రోత్సాహకరంగా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మాల్స్‌కు వచ్చినప్పుడు సరదా కోసమైనా పిల్లలే ఇళ్లలో ఉండే సీసాలను తీసుకొస్తారని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం ఖాళీ సీసాలను చాలా మంది రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో విసిరేస్తుంటారు. ఆర్‌వీఎంలు అందుబాటులోకి వస్తే ఈ పరిస్థితి ఉండదని బల్దియా భావిస్తోంది. దశల వారీగా మార్కెట్లు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలోనూ ఆర్‌వీఎంలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ, నోయిడా, లక్నో తదితర నగరాల్లో ఇప్పటికే ఆర్‌వీఎంలు ఉన్నాయి.
Nov 29 2024, 14:00