30 లక్షల సైబర్ మోసాన్ని చాకచక్యంగా అడ్డుకున్న ఎస్బీఐ అధికారులు
సైబర్ నేరగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తిని ఎస్బీఐ అధికారులు కాపాడారు. ఆ క్రమంలో రూ. 30 లక్షలు పోగొట్టుకోకుండా కట్టడి చేశారు. అయితే అసలు ఏం జరిగిందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్లు (cyber fraud) ఎప్పటికప్పుడూ సామాన్యులను టార్గెట్ చేసుకుని లూటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం పలురకాల ఆఫర్లు లేదా అరెస్టుల పేరుతో జనాలను మభ్యపెట్టి దోచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సైబర్ కేటుగాళ్లు ఓ వ్యక్తిని బురిడి కొట్టించే ప్రయత్నాన్ని SBI అధికారులు చాకచక్యంగా అడ్డుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లోతుకుంట బ్రాంచ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే ఓ 78 ఏళ్ల సీనియర్ సిటిజన్ ఎస్బీఐ బ్రాంచ్‌ని సందర్శించారు.
ఆ క్రమంలో తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మూసివేయాలని బ్రాంచ్ మేనేజర్‌ను కలిసి అభ్యర్థించారు. దానిలోని రూ. 30 లక్షలను ఓ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయాలని కోరారు. అదే సమయంలో కస్టమర్ మొబైల్‌కు మోసగాళ్ల నుంచి త్వరగా నగదు బదిలీ చేయాలని తరచుగా కాల్స్ రావడాన్ని మేనేజర్ గమనించారు. అయితే మొత్తం డబ్బులు ఎందుకని మేనేజర్ ప్రశ్నించగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తన భార్య చికిత్స కోసం నిధులు అవసరమని కస్టమర్ చెప్పాడు.
ఆ క్రమంలో బ్యాంకు అధికారికి అనుమానం వచ్చి ఆస్పత్రి పేరు, పేషెంట్ వివరాలను అడిగారు. కానీ ఆ వివరాలతో పేషంట్ ఎవరు లేరని తేలింది. దీంతో మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ క్రమంలో కస్టమర్ అసలు విషయం వెల్లడించారు. సీనియర్ సిటిజన్ తనకు మలేషియా నుంచి 16 పాస్‌పోర్ట్‌లు, ATM కార్డులతో కూడిన పార్శిల్ వచ్చాయని తనను తాను ఢిల్లీ కస్టమ్స్ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న వ్యక్తి గురించి తెలిపారు. ఆ వ్యక్తి సీనియర్ సిటిజన్ పేరుతో ఆధార్ కార్డుల ఆధారంగా 30 బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. 88 కోట్ల మనీలాండరింగ్ మోసానికి పాల్పడ్డారని బెదిరించినట్లు చెప్పారు.
ఆ కేసు తొలగిపోవాలంటే తమ ఖాతాకు డబ్బులను బదిలీ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరారని పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతో అది నిజం కాదని కస్టమర్‌కు అధికారులు సర్ది చెప్పి పంపించారు. అంతేకాదు బ్రాంచ్ సిబ్బంది జోక్యం సీనియర్ సిటిజన్ డబ్బును పోగొట్టుకోకుండా కాపాడారని SBI ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతోపాటు డిజిటల్ మోసాలు/అరెస్టుల గురించి ఏదైనా తెలియని కాల్స్ వస్తే 1930 లేదా ప్రభుత్వ పోర్టల్ www.cybercrime.gov.inకి ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సూచించింది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. ఇదే నెలలో ఓ ఉద్యోగికి పలువురు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్ చేసి దాదాపు రూ.13 లక్షలు లూటీ చేశారు. దీనికంటే ముందు ఓ మహిళకు కాల్ చేసి ఏకంగా 37 లక్షలకు బురిడీ కొట్టించారు. ఈ విధంగా సైబర్ నేరగాళ్లు ప్రతి రోజు అనేక మందిని టార్గెట్ చేసుకుని దోచేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు.
Nov 29 2024, 11:47