భువనగిరి ప్రభుత్వ ఐటిఐ దగ్గర నేషనల్ హైవే పైన అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్
భువనగిరి పట్టణ పరిధిలోని ప్రభుత్వ ఐటిఐ దగ్గర హైదరాబాదు వరంగల్ జాతీయ రహదారి పైన అండర్ పాస్ నిర్మాణం తక్షణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మంగళవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో పోరుబాటలో భాగంగా భువనగిరి పట్టణం నుండి పెంచికలపహాడ్, కృష్ణాపురం గ్రామాలతో పాటు మూడు మండలాలు 24 గ్రామాలకు వెల్లెడానికి ఉన్న రోడ్డు జాతీయ రహదారి దాటడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తక్షణం అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ భువనగిరితో పాటు వలిగొండ, ఆత్మకూరు మండలాలలోని 24 గ్రామాల ప్రజలు అవసరాల కోసం భువనగిరి కి హైదరాబాద్ కు వివిధ గ్రామాలకు వేలాదిమంది రైతులు, విద్యార్థులు, కార్మికులు, వృత్తిదారులు రాకపోకలు ప్రయాణం కొనసాగిస్తున్నారని అన్నారు. భువనగిరి ఐటిఐ దగ్గర రోడ్డు దాటే సందర్భంలో అండర్ పాస్ లేకపోవడం వల్ల ఇప్పటికి 100 మంది పైగా యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు పోగొట్టుకున్నారని, వందలాదిమంది కాళ్లు చేతులు విరిగి శత గాత్రులుగా మారారని ఆవేదన వెలిబుచ్చారు. పాలకులు ఎన్నికలప్పుడు వివిధ సందర్భాలలో ప్రజలను మభ్య పెట్టడం ఓట్లు దండుకోవడం గెలిచిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. రోడ్డు వేసినాడే నేషనల్ హైవే దాటడానికి తమ గ్రామాలకు పోయి రావడానికి ఇక్కడ అండర్ పాస్ ఏర్పాటు చేయవలసిన అవసరం, ఏర్పాటు చేయించే బాధ్యత ఆనాడు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వానికి తెలియదా అని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు బాధ్యత తీసుకొని ఈ నేషనల్ హైవే ప్రభుత్వ ఐటిఐ దగ్గర అండర్ పాస్ నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని లేనిచో సిపిఎం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల ప్రజలను సమీకరించి సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని నర్సింహ ప్రభుత్వాన్ని హెచ్చరించినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, సిపిఎం మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, సిపిఎం నాయకులు వడ్డబోయిన వెంకటేష్, గుండెబోయిన దానయ్య, గ్రామ ప్రజలు సిరికొండ కృష్ణ, సిలువేరు రాజు, భువనగిరి నరసింహ, బసాని కృష్ణా తదితరులు పాల్గొన్నారు.
Jul 04 2024, 18:50