నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం

నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సమావేశం కానుంది.

రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌ జిల్లాల కలెక్టర్లతో సిసిఎల్‌ఎలో ధరణి కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించ నున్నారు.

అనంతరం జిల్లాల వారీగా క్షేత్రస్థాయి భూ సమస్యలపై ఈ కమిటీ ఆరా తీయ నుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ ధరణి కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు...

నకిలీ పత్రాలతో పాస్ పోర్ట్ జారీ కేసులో దర్యాప్తు ముమ్మరం

నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్ జారీ కేసులో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే 12 మంది నిందితులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

6 జిల్లాల్లో పాస్‌పోర్ట్ బ్రోకర్‌ని సీఐడీ అరెస్ట్ చేసింది. కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎక్కువగా పాస్‌పోర్ట్ పొందినట్లు సీఐడీ గుర్తించింది. కొందరు విదేశీయులకు సైతం నకిలీ పాస్‌పోర్ట్ ఇప్పించినట్లు అధికారులు గుర్తించారు.

నకిలీ పాస్‌పోర్ట్‌లతో కొంత మందికి వీసాలను జారీ చేశారు.వీసాల్లో కెనెడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై సీఐడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. నకిలీ పాస్‌పోర్ట్‌లు ఇప్పించడంలో కొంతమంది పోలీస్ అధికారుల హస్తమున్నట్టు విచారణలో వెల్లడైంది.

పోలీస్ అధికారుల ప్రమేయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. పలువురు పాస్‌పోర్ట్ సిబ్బంది పాత్రపై దర్యాప్తు చేపట్టారు.

తైక్వాండో ప్రీమియర్ లీగ్ క్రీడలకు ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెడతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

మంగళవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో తైక్వాండో ప్రీమియర్ లీగ్ పోటీల బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.

తైక్వాండో దుస్తులు ధరించి.. క్రీడాకారులతో సరదాగా పోటీపడి వారిలో ప్రోత్సాహాన్ని నింపారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన క్రీడా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని మంత్రి కోమటిరెడ్డివెంకట్ రెడ్డి తెలిపారు...

మిజోరాం లో సైనిక విమానానికి ప్రమాదం: 8 మంది గాయాలు

మిజోరం రాజ‌ధాని ఐజ్వాల్‌లోని లెంగ్‌పుయ్ ఎయిర్‌పోర్టులో మంగ‌ళ‌వారం ఉద‌యం 10:19 గంట‌ల‌కు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

మ‌య‌న్మార్ నుంచి వ‌చ్చిన సైనిక విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో అదుపుత‌ప్పి, ర‌న్‌వేపై స్కిడ్ అయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది మ‌య‌న్మార్ సిబ్బంది గాయ‌ప‌డ్డారు.

బాధితుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. కొన్నాళ్ల క్రితం స‌రిహ‌ద్దులు దాటి భార‌త్‌లోకి చొర‌బ‌డి త‌మ దేశ సైనికులను వెన‌క్కి తీసుకెళ్లేందుకు ఈ విమానం వ‌చ్చింది.

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు విమానంలో 13 మంది సిబ్బంది ఉన్న‌ట్లు స‌మాచారం.భారత్‌లోకి చొరబడిన మయన్మార్‌ సైనికులను కేంద్ర ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపిస్తున్న విష‌యం తెలిసిందే.

గత కొంత కాలంగా మయన్మార్‌లో సైనిక పాలకులు, తిరుగుబాటు దళాలకు మధ్య అంతర్యుద్ధం జరగుతున్నది. దీంతో ఆ దేశానికి చెందిన వందలాది మంది సైనికులు పారిపోయి సరిహద్దు రాష్ట్రమైన మిజోరానికి వస్తున్నారు.

ఇలా గతవారం దేశంలోకి చొరబడిన 276 మంది సైనికుల్లో 184 మందిని తిరిగి మయన్మార్‌కు పంపినట్లు అస్సామ్‌ రైఫిల్స్‌ కు చెందిన అధికారులు వెల్లడించారు.

మిగిలిన 92 మందిని నేడు పంపనున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 635 మంది మయన్మార్‌ సైనికులు భారత్‌లోకి చొరబడ్డారు...

పొరుగింటి వారు తిట్టారని యువతి ఆత్మహత్య

మనస్థాపంతో యువతి పురుగుల‌ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని మద్దుల గూడెం గ్రామంలో ఈరోజు ఉదయం చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆ గ్రామానికి చెందిన పర్శిక శైలజ (19) నర్సింగ్ చదువుతుంది.శైలజను తమ ఇంటి పొరుగు వారైన‌ మహిళలు తిట్టారనే నెపంతో మనస్థాపానికి గురై అవమానం తట్టుకోలేక ఇవాళ‌ ఉదయం ఇంట్లో‌ ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి మృతిచెందింది.

ఈ ఘటనపై మృతురాలి తల్లి ఏడూళ్ళ బయ్యారం పోలీసు స్టేషను లో పిర్యాదు చేసినట్లు సమాచారం..

తెలంగాణలో నేడు, రేపు వర్షాలు

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

కర్ణాటక నుంచి తెలంగాణ, విదర్భ మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగు తోందని తెలిపింది.

దీంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

చైతన్యపురి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు బదిలీ వేటు

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని చైతన్యపురి ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటుపడింది. వివాదాలకు కేరఫ్‌ అడ్రస్‌లా పీఎస్‌ మారడం, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తుండంతో సీఐ నాగార్జునను రాచకొండ సీపీ సుధీర్‌ బాబు సస్పెండ్‌ చేశారు.

ఆయనను మల్టీజోన్‌-2కు అటాచ్‌చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.చైతన్యపురి ఠాణాలో కోర్టు వారెంట్లు అమలు చేసే బృందంలోని హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్‌బాబు, కానిస్టేబుల్ బీ. మల్లేశం, కోర్టు కానిస్టేబుల్ ఎం.నరేందర్‌లు ఐదు రోజుల క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు.

ఓ కేసులో నిందితుడి నుంచి రూ.3 లక్షలు లంచం వసూలు చేశారు.ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ ముగ్గురు కాని స్టేబుళ్లను అరెస్టు చేసి రిమాండుకు తరలించింది.

ఈ తతంగం కొన్నాళ్లుగా నడుస్తున్నా ఇన్‌స్పెక్టర్ పసిగట్టక పోవడం, స్టేషన్‌లో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైల మధ్య మాటామాటా పెరిగి దూషించుకున్నట్లు తెలిసింది.

ఇలాంటి ఘటనలతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం తదితర కారణాలతో ఇన్‌స్పెక్టర్‌పై బదిలీ వేటు వేసినట్లు సమాచారం. డీఐ నాగరాజ్ గౌడ్‌కు ఇన్‌స్పె పెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు..

YS Sharmila: ఆర్టీసీ బస్‌లో షర్మిల ప్రయాణం

వైవీసుబ్బారెడ్డికి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. ఏపీలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ సుబ్బారెడ్డికి షర్మిల సవాల్ చేశారు..

డేట్.. టైం.. వాళ్లు చెప్పినా... సరే.. నన్ను చెప్పమన్నా... సరే.. వస్తా.. అంటూ సవాల్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని షర్మిల డిమాండ్ చేశారు..

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న షర్మిల కంచిలి దగ్గర ఆర్టీసీ బస్ ఎక్కారు. బస్‌లో ప్రయాణికులతో ముచ్చటించారు. అమ్మఒడి అందుతుందా లేదా అని ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. పలువురు మహిళలను ఇళ్ల స్థలాలు అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు..

నేడు అయోధ్య లో పోటెత్తిన భక్తులు

రాంల‌ల్లా ప్రాణ‌ప్ర‌తిష్ట వేడుక‌ల‌ను దేశ‌మంతా సంబురంగా జ‌రుపుకున్నారు. ప్ర‌ధాని ఇచ్చిన పిలుపుతో దీపాల‌ను వెలిగించి పూజ‌లు నిర్వ‌హించారు.

ప్రాణ‌ప్ర‌తిష్ట అనంత‌రం మంగ‌ళ‌వారం నుంచి భ‌క్తుల‌కు రాంల‌ల్లా ద‌ర్శ‌నం క‌ల్పించారు. తొలిరోజు బాల‌రామున్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు బారులు తీరారు.

దీంతో అయోధ్య రామాల‌యమంతా జ‌న‌సంద్రోహంగా మారింది. జైశ్రీ‌రామ్ నినాదాల‌తో ఆల‌య ప్రాంగ‌ణం హోరెత్తింది.

కొంతమంది రామభక్తులు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు.

తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు.

మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచు తారని తెలిపారు. ఆలయంలో రెండుసార్లు హారతిని దర్శించుకోవచ్చ‌ని, ఉదయం 6.30 గంటలకు, రాత్రి 7.30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు.

ఇక భక్తులు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో దర్శనం, హారతి పాస్‌లను పొందవచ్చు..

టీఎస్ పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి❓️

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ టీఎస్‌పీఎస్సీ, ఛైర్మన్‌ నియామకంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే రిటైర్డ్ ఐపీఎస్‌ అధికారి ఈ పదవిలో నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ పదవికి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరి పేర్లను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలిం చినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డికే ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.

ప్రభుత్వం ఇప్పటికే ఛైర్మన్‌, సభ్యుల నియామకాలకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఛైర్మన్‌ పదవి కోసం 50 మంది, సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్‌, కార్యదర్శి నిర్మలతో కూడిన స్క్రీనింగ్‌ కమిటీ సోమవారం సాయంత్రం సచివాలయంలో సమావేశమై దరఖాస్తులను పరిశీలించింది.

ఛైర్మన్‌ పదవి కోసం మహేందర్‌రెడ్డితో పాటు ఓ రిటైర్డ్ అధికారి, రెండు నెలల్లో పదవీ విరమణ చేయనున్న మరో ఐపీఎస్‌ అధికారి పేర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. వీరిలో మహేందర్‌రెడ్డి ఒక్కరే తెలంగాణకు చెందినవారు కావడంతో ఆయన నియామకానికే ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ నియామకానికి సంబంధించిన దస్త్రాన్ని గవర్నర్‌ తమిళిసై ఆమోదం కోసం ప్రభుత్వం పంపించి నట్లు సమాచారం.