గద్వాల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

గద్వాల్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. జిల్లాలోని జమ్మిచేడు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స కోసం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం లో మరణించిన వారిని నరేష్(23), పవన్ కుమార్(28), ఆంజనేయు లు(50)లుగా పోలీసులు గుర్తించారు.

గద్వాలలో పుట్టినరోజు వేడుకలకు హాజరై గద్వాల్ నుంచి వెర్రవెల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 22న సెలవు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

అయోధ్యలో రామ్ మందిర్‌లో విగ్రహం మహా ప్రతిష్ఠాపన జరగనున్న రోజు సోమవారం (22న) సెలవు దినంగా మహారాష్ట్ర శుక్రవారం ప్రకటించింది.

హోమ్ మంత్రిత్వశాఖ కేటాయించిన అధికారాలను వినియోగిస్తూ 22న సెలవు దినంగా ప్రకటించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఒక ఉత్తర్వులో తెలియ జేసింది.

రామ్ మందిర్‌లో ‘ప్రాణ్ ప్రతిష్ట్’ సందర్భంగా దేశం అంతటా తన కార్యాల యాలు, విద్యా సంస్థలు, పారిశ్రామిక సంస్థలకు 22న అర రోజు సెలవు ఉంటుందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.

అదే సందర్భంలో 22న తన కార్యాలయాలు అన్నిటినీ మూసివేయనున్నట్లు చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

కాగా, సోమవారం అర రోజు సెలవును హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.

నేడు గర్భగుడిలోకి రాములోరి విగ్రహం

నేడు ప్రధాన ఆలయ గర్భగుడిలోకి

అయోధ్య రాముడి విగ్రహం ప్రవేశించనుంది.

దాదాపు 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడు తన మందిరా నికి తిరిగి వస్తున్నాడు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉండడంతో నేటి నుంచి బయటి వ్యక్తులను అయో ధ్యలోకి అనుమతించరు.

కాగా అంతకుముందు జనవరి 18న‌ వివేక్ సృష్టి ట్రస్ట్ నుండి రాంలాలా విగ్రహాన్ని ట్రక్కులో రామాల యానికి తీసుకువచ్చారు.

విగ్రహాన్ని ఆలయ ప్రాంగణం లోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. జనవరి 16 ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి.

వేడుక ప్రధాన కార్యక్రమం జనవరి 22 న జరుగుతుంది.

నేడు అయోధ్యకు తిరుపతి లడ్డు

అయోధ్యలో ఈనెల 22న రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లక్ష లడ్డూలను అయోధ్యకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఇవాళ ఆ లక్ష లడ్డూలను టీటీడీ అయోధ్యకు తరలించనుంది.శ్రీరాముడికి నైవేద్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు శ్రీరాముడికి ప్రసాదంగా 25 గ్రాముల లక్ష లడ్డూలను రెడీ చేశారు.

రామ మందిరం ప్రారంభోత్స‌ వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల శ్రీవారి లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు టీటీడీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఒక లక్ష చిన్న లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.

తిరుమ‌లలోని శ్రీ‌వారి సేవాస‌ద‌న్‌-1లో శ్రీ‌వారి సేవ‌కులు ఒక్కో క‌వ‌ర్‌లో రెండు చిన్న‌ ల‌డ్డూలు చొప్పున ప్యాకింగ్ చేశారు. 350 పెట్టెల్లో ప్యాక్ చేసిన లడ్డూ’లను 350 మంది భక్తులు సిద్ధం చేశారు.

ఈ లడ్డూలను ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమం రోజున తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకెళ్తారు. అయోధ్యలోని భక్తులకు ఉచితంగా ఈ లడ్డూలను పంపిణీ చేయనున్నారు.

త్వరలో ఎమ్మెల్సీ అభ్యర్థులతో కేసీఆర్ భేటీ

పార్టీ అధినేత కేసీఆర్‌ త్వరలో ఎమ్మెల్సీలతో సమావేశమవుతారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. ఆ సమావేశంలోనే శాసనమండలిలో పార్టీ నా యకుడి ఎంపిక ఉంటుందని చెప్పారు.

గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీలతో కేటీఆర్‌ సమావేశమ య్యారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎమ్మెల్సీల భాగస్వామ్యం, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి అంశాలపై చర్చించారు. ఎమ్మెల్సీలు పార్టీకి కండ్లు, చెవుల మాదిరి పనిచేయాలని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన 420 హామీల అమలు కోసం శాసనసభలో పార్టీ తరఫున ఒత్తిడి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

త్వరలో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఖాయమని, అప్పుడు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉంటాయని వివరించారు. అన్ని స్థాయిల్లో పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తేవటంలో ఎమ్మెల్సీలు చురుకైన పాత్ర పోషించాలని కోరారు.

పార్టీని గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు పునర్వ్యవస్థీకరించాలనేది పార్టీ అధినేత కేసీఆర్‌ ఆలోచనా విధానమని, అందుకు అనుగుణమైన కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చురుకైన నాయకులు, కార్యకర్తల సేవలను పార్టీ ఉపయోగించుకుంటుందని చెప్పారు.

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష

రేపు నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్స రానికి 6వ తరగతిలో ప్రవేశాలకు రేపు శనివారం పరీక్ష నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.

ఏపీలో 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది పరీక్ష రాయను న్నారు. ఏపీలో 416, తెలంగాణలో 244 సెంటర్లు ఏర్పాటు చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లు

తెలుగు రాష్ట్రాల్లోని అయోధ్య భక్తులకు దక్షిణ మధ్య రైళ్వే శుభవార్త చెప్పింది. అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట అనంతరం అయోధ్యను దర్శంచుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లే అవకాశం ఉండటంతో, తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందిం చింది.

జనవరి 29 తర్వాత తెలంగాణలోని సికింద్రా బాద్‌, కాజీపేట రైల్వేస్టేషన్ల నుంచి అయో ధ్య స్టేషన్‌కు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయ వాడ, గుంటూరు, రాజమ హేంద్రవరం, సామర్లకోట స్టేషన్ల నుంచి అయోధ్యకు స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ నడపనుంది.

సికింద్రాబాద్‌ నుండి అయోధ్య కు ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల మీదుగా రాకపోకలు సాగించ నుండగా,

విజయవాడ నుండి అయోధ్య కు రైళ్లు.. ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, విశాఖపట్నం, విజయ నగరం, శ్రీకాకుళం రోడ్‌ రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైళ్వే శాఖ అధికారి తెలిపారు.

ఇక, టికెట్ల బుకింగ్ విషయంలో ఐఆర్‌సీటీసీ కీలక సూచన చేసింది. అయోధ్యకు డైరెక్ట్ రైళ్ల బుకింగ్స్ ప్రారంభం కాలేదని తెలిపింది. సెపరేట్‌గా తమ టికెట్‌లను బుక్ చేసుకో వాలని ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో రైల్వే శాఖ తెలిపింది.

సికింద్రాబాద్‌ - అయోధ్య ప్రత్యేక రైళ్లు జనవరి 29, 31 ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25 తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరుతాయి.

అయోధ్య నుంచి సికింద్రాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతాయి.

కాజీపేట నుంచి అయోధ్యకు జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 తేదీల్లో సాయంత్రం 6.20 గంటలకు బయల్దేరు తాయి.

ఈ రైళ్లు అయోధ్య నుంచి తిరిగి కాజీపేట వస్తాయి.

విజయవాడ నుంచి ఫిబ్రవరి 4న, గుంటూరు నుంచి జనవరి నుంచి 31న, రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి 7న సామర్లకోట నుంచి ఫిబ్రవరి 11న ప్రత్యేక రైళ్లు అయోధ్యకు పయనమవుతాయి.

అయోధ్య నుంచి తిరిగి ఆయాచోట్లకు ప్రయాణించనున్నాయి.

నేడు బిఆర్ఎస్ ఎమ్మెల్సీల కీలక సమావేశం

బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవు తోంది. ఈ క్రమంలోనే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే, లోక్‌సభ నియోజకవర్గాల ఇన్‌చార్జి బాధ్యతలను వారికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.

నిరాశలో ఉన్న కేడర్‌లో జోష్ నింపాలంటే ఈ ఎన్నికలు కారు పార్టీకి అత్యంత కీలకం కానున్నా యి. గత ఎన్నికల్లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా కేడర్‌ను గాడిలో పెట్టేందుకు పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది.

అందులో భాగంగానే ఎమ్మెల్సీలకు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిం చాలని భావిస్తోంది. వీరి సమర్ధతకు ఈ ఎన్నికలు కొలమానం కానున్నాయి. ఇప్పుడు కష్టపడే వారికి భవిష్యత్తులో పార్టీ పదవులు సైతం కట్టబెట్టాలని యోచి స్తున్నట్లు సమాచారం.

కాగా, గత ఎన్నికల్లో తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన కారు పార్టీ ఈసారి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి సన్నాహాలు చేస్తుంది....

తమ్మినేని ని పరామర్శించిన మంత్రులు బట్టి, పొంగులేటి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను పలువురు మంత్రులు ఈరోజు పరామర్శించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేలా చూడా లన్నారు. ఛాతినొప్పి తో ఆస్పత్రిలో చేరిన తమ్మినేని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ గూటికి సునీత

అమరావతి : ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు.

ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది.

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు.

ఇప్పుడు ఏపీలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగు పెట్టబోతున్నారు. వైఎస్ జగన్ కు అపోజిట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో.. తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు. అంతేకాదు పార్టీ ఆదేశిస్తే కడప ఎంపీ లేదంటే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నారు.