టీఎస్ పిఎస్పీ బోర్డు చైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్
అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత ఐదు గ్యారంటీల అమలుకు ముందడుగు వేసింది.
ప్రజాపాలన - అభయహస్తం పేరుతో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిం చింది. ఇప్పుడు తాజాగా తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అధికా రంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది.
ఫిబ్రవరిలోనే ఉద్యోగాల నియామకాలు మొదలు పెడుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం లక్షలాది విద్యార్థులు ఎదురుచూస్తున్న పరిస్థితి. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామా ఆమోదంతో ఉద్యోగాల నియామకాలకు అడ్డంకులు తొలగిపోయాయి.
అతి త్వరలో టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్, సభ్యులను సర్కార్ నియమించనుంది. చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఆఫీసర్‌ను నియమించే అవకాశం ఉంది.
ఇటీవలే యూపీఎస్సీ ఛైర్మన్‌ను సీఎం రేవంత్ కలిసిన విషయం తెలిసిందే. పారదర్శకంగా బోర్డు ఉండేలా కసరత్తు చేపట్టారు. ప్రతీ సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో చైర్మన్‌తో పాటు 10 మంది సభ్యులు ఉండనున్నారు.
బోర్డులో ఉండాల్సిన నిపుణుల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. సీఏం విదేశీ పర్యటన తర్వాత కొత్త బోర్డు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది
Jan 11 2024, 14:55