TS: ఒక్క పూట ఇఫ్తార్ విందు వద్దు- 12% రిజర్వేషన్ ముద్దు: ముస్లిం మైనారిటీ ఓయూ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: ఒక్క పూట ఇఫ్తార్ విందు వద్దు- 12% రిజర్వేషన్ ముద్దు అని ముస్లిం మైనారిటీ ఓయూ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి, బుల్లెట్ రాణి డాక్టర్ రేష్మ హుస్సేన్ మాట్లాడుతూ.. పండుగ వేళల్లో మాకు ప్రభుత్వం ఇచ్చే ఒక్క పూట ఇఫ్తార్ విందు కన్నా 12% రిజర్వేషన్ ఇచ్చి ముస్లిం మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు అందించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తారని ఆమె ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

NLG: పట్టా భూముల పేరుతో ప్రభుత్వ భూముల ఆక్రమణ అడ్డుకోవాలి: సిపిఐ

నల్గొండ జిల్లా:

మునుగోడు పట్టణంలో పట్టా భూముల పేరుతో ప్రభుత్వ భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోల్గూరి నరసింహ, మండల కార్యదర్శి చాపల శ్రీను లు డిమాండ్ చేశారు. బుధవారం తహసిల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తాహాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. చౌటుప్పల్ రోడ్డులోని 336, 337 సర్వే నెంబర్ల లో పట్టా పేరుతో ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు తెలిపారు.

మునుగోడు పెద్దవాగు ఆనుకొని ఉన్న ఈ సర్వే నెంబర్ల లో వెంచర్లు నెలకొల్పి లక్షల రూపాయలు దండుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. భారీ వరదలు, కుంభ వృష్టి వర్షాలు కురిసినప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా వరదలతో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని.. దీని కారణంగా ప్రజల ప్రాణాలు,ఆస్తి నష్టం పెద్ద ఎత్తున సంభవించే ప్రమాదం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు 336, 337 సర్వే నెంబర్లలలో నాలా కన్వర్షన్ గానీ, డిటిసిపి అనుమతులను ఇవ్వవద్దని కోరారు. పెద్దవాగు హద్దులను గుర్తించి దానికి సంబంధించిన బఫర్ జోన్ కూడా తేల్చాలని కోరారు. ఫిర్యాదు ఇచ్చిన వారిలో మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి.వెంకటేశ్వర్లు, బీసీ సంఘం జిల్లా నాయకులు కైలాస్, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ: భూమిలేని నిరుపేద దళితులకు భూ పంపిణీ చేయాలి: సిపిఎం పార్టీ

నల్గొండ జిల్లా:

మర్రిగూడ: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మర్రిగూడ తహసిల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. మండలంలోని మేటి చందాపురం, ఇందుర్తి, సరంపేట, శివన్నగూడ గ్రామాలకు చెందిన భూమిలేని నిరుపేద దళితులను గుర్తించి.. మేటి చందాపురం లోని 217 సర్వేనెంబర్ గల ప్రభుత్వ భూమిని పంపిణీ చేయాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సిపిఎం మండల సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, తదితరులు పాల్గొన్నారు.

NLG: యూజీసీ నెట్ మరియు మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ సాధించిన పడమటిపల్లి వాసి

నల్లగొండ జిల్లా:

దేవరకొండ మండలం, పడమటిపల్లి గ్రామానికి చెందిన పల్లె లింగయ్య వజ్రమ్మ ల కుమారుడు పల్లె ప్రేమ్ కుమార్, ఇటీవల నిర్వహించిన నేషనల్ ఎలిజబిలిటీ టెస్ట్ NET అర్హత సాధించారు. దీంతో ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత సాధించారు. అంతేకాకుండా సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.ఏ తెలుగు, ఎం.ఫిల్ పూర్తి చేసిన ఆయన, మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ కూడా సాధించారు. ప్రస్తుతం తెలంగాణ యూనివర్సిటీలో పిహెచ్డి చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుండి ఉన్నత విద్యను అభ్యసించి అర్హతలను సాధించడం పట్ల పలువురు గ్రామస్తులు ప్రేమ్ కుమార్ ను అభినందిస్తున్నారు.

NLG: 'ప్రజా పాలన' కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించిన మున్సిపల్ కమిషనర్

నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అధికారులు 'ప్రజా పాలన' నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లగొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ కే. వెంకటేశ్వర్లు మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో వార్డు అధికారులు మరియు పర్యవేక్షణ అధికారులతో 'ప్రజా పాలన' కార్యక్రమం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

TS: ఈ నెల 28 న హైదరాబాద్ కు అమిత్ షా

హైదరాబాద్: పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణపై భారతీయ జనతా పార్టీ ఫోకస్‌ చేసింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలవడంతో పాటు ఓటు షేర్‌ కూడా గణనీయంగా పెరగడంతో పార్టీ వర్గాల్లో జోష్‌ నెలకొంది.

ఇదే దూకుడును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని యోచిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలుచు కున్న బీజేపీ ఈసారి పదికి పైగా స్థానాలపై గురి పెట్టింది.

ఇందులో భాగంగా ముందస్తుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక తో పాటు క్యాడర్‌కు మార్గ నిర్దేశం చేసేందుకు స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రంగంలోకి దిగుతున్నారు.

ఈ నెల 28న అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొంగర్‌ కలాన్‌లో పార్టీ మండల స్థాయి అధ్యక్షులు, ఆపై స్థాయి నేతలతో సమావేశమవుతారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నాయ కత్వంతో చర్చిస్తారు.

జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభో త్సవం రాములోరి విగ్రహ ప్రాణప్రతిష్ఠ తర్వాత తెలంగాణలో బీజేపీకి మరింత సానుకూలత ఏర్పడుతోందని కమలనాథులు అంచనావేస్తున్నారు. రామమందిరం నిర్మాణం వాజ్‌పేయి కల అని, దాన్ని మోదీ సాకారం చేశారని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి తెలిపారు.

TS: ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లపై కసరత్తు చేస్తుంది.

28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు

అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక

2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 

ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు

సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి నిర్మాణం కోసం.. రూ.5లక్షలు ఇవ్వనున్న రేవంత్‌ సర్కారు

సెకండ్ ఫేజ్‌లో సొంత స్థలం లేని వారికి ఇళ్ల పట్టాలు.. ఇంటి నిర్మాణం కోసం నిధుల మంజూరు

ఇళ్ల డిజైన్‌ విషయంలో రాని క్లారిటీ.. 3 డిజైన్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

TS: స్టేట్ ఫుట్బాల్ అసోసియేషన్ (TFA) ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా బొమ్మపాల గిరిబాబు

హైదరాబాద్: నిన్న నిజాం క్లబ్ లో జరిగిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ బాడీ మరియు ఎలక్షన్ లలో  (2023-2027)  4 సంవత్సరాలకు గాను ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా బొమ్మపాల గిరిబాబు ను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. TFA ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) మెంబర్ గా తనను ఎన్నుకొని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడ అభివృద్ధికి బాధ్యతలు అప్పగించినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ.. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ Dr.KTమహి, అధ్యక్షులు మహమ్మద్ రఫత్ అలీ, ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.

NLG: పేదరికంలో కూడా పెద్దమనసు చాటుకున్న చిలక రాజు కోటయ్య

క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాల పంపిణీ

నల్లగొండ జిల్లా, చండూరు మండలం దోనిపాముల గ్రామానికి చెందిన చిలక రాజు కోటయ్య పేదరికంలో ఉండి కూడా పెద్ద మనసు చాటుకున్నాడు. మర్రిగూడెం మండలం లెంకలపల్లి పెట్రోల్ బంకు లో వర్కర్ గా పనిచేస్తున్నాడు.

దోనిపాముల గ్రామంలో సోమవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు దాదాపు 30 మందికి మరియు కొంతమంది వితంతువులకు నూతన వస్త్రాలు అందించి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

క్రిస్మస్ కేక్ కట్ చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివ, అనిల్, నికిత, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు: బెల్టు షాపులను మూసి వేయాలి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్గొండ జిల్లా: 

మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

మొదటగా నియోజకవర్గ వ్యాప్తంగా బెల్ట్ షాపు ల మూసివేత పై కార్యాచరణ ప్రకటించిన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి 

ప్రతి గ్రామానికి గ్రామ అభివృద్ధి కమిటీ లను ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు దిశా నిర్దేశం

గ్రామ అభివృద్ధి కమిటీల పనితీరును పరిశీలించడానికి త్వరలోనే నియోజకవర్గ గ్రామస్తులతో కలిసి పది బస్సుల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో స్టడీ టూర్ కు ప్లాన్ - ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు లోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. సోమవారం మండలం లోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బెల్టు షాపులను మూసివేయాలని ప్రజలకు సూచించారు. తాను ప్రచారం చేస్తున్న సందర్భంలో ఎంతో మంది మహిళలు గ్రామాలలో విచ్చలవిడిగా ఉన్న బెల్టు షాప్ ల వల్ల సంసారాలు ఆగమవుతున్నాయని, తమ దృష్టికి తీసుకొచ్చారని, ఎన్నికల ప్రచారంలో బెల్ట్ షాపులు మూసేస్తామని హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా బెల్ట్ షాపు ల మూసివేతకు కార్యాచరణ ప్రకటించారు. బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటానని,

తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యపానానికి వ్యతిరేకం కాదు, కానీ బెల్ట్ షాపులు.. ఎక్కడబడితే అక్కడ ఉండడం వల్ల యువత చెడిపోతుందన్నారు.

చట్ట ప్రకారం బెల్ట్ షాపులు నిర్వహించడానికి వీలులేదని, గ్రామాలలో నాయకులు అందరూ ఏకమై బెల్టు షాపు లు లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బెల్ట్ షాపుల్ని బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉందని, ఈ అంశం రాజకీయాలతో సంబంధంలేదని ముఖ్య నాయకులకు సూచించారు. 

బెల్ట్ షాపు ల విషయంలో రాజి పడేది లేదని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే తరాలకు ఈ విచ్చల విడి తాగుడు వల్ల మనం ఏం సందేశం ఇస్తున్నామని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు మూసి వేయడం అనేది గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని సూచించారు. బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో తనతో నడిచిన వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తానని, నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకోసం కాదు సమాజం కోసం, ప్రజల కోసం అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు.

2014 ముందు గ్రామాలలో బెల్ట్ షాపులు లేవని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బెల్ట్ షాపులు లేవని టిఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు వచ్చి ఎంతోమంది యువకులు చనిపోయారని వీటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మనందరి మీద ఉందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త ఆషామాషీగా తీసుకోవద్దు.. 'బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలి' అని పిలుపునిచ్చారు. ఒక ఉద్యమం లాగా ఇది రావాలి.. బెల్ట్ షాపులు మూసివేయాలని.. ప్రతి గ్రామంలో దండోరా వేయించాలని కార్యకర్తలకు సూచించారు.

ప్రతి గ్రామంలో 10 మందితో ఒక కమిటీ వేయాలని ఈ 10 మందిలో నలుగురు మహిళలు ఉండేలా చూసుకోవాలని.. ఊరి పొలిమేర లోపల గంజాయి గానీ, తాగుడు గానీ లేకుండా చేయడం ఈ కమిటీ యొక్క విధి అని సూచించారు.

ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి.

గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి గ్రామంలో ఒక విలేజ్ డెవలప్మెంట్ కమిటి ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సూచించారు. ఈ అభివృద్ధి కమిటీ ద్వారానే గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయాలనే దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని.. దానికి సంబంధించిన నిధుల సమకూర్చడం విషయాలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పనితీరుని పరిశీలించడానికి ఆర్మూరు నియోజకవర్గానికి  త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా 10 బస్సులలో వివిధ గ్రామాలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు తాను కూడా వచ్చి పరిశీలిస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు.