TS: భారమైన హృదయంతో పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన కోమటిరెడ్డి
తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటూ రాజీనామా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు.భువనగిరి ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు, అభివృద్ధి పనులు, 5 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలో తనకు సహకరించిన అందరినీ తలుచుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
చింతపల్లి ఎస్ఐ పై సస్పెండ్ వేటు
నల్లగొండ జిల్లా, దేవరకొండ డివిజన్,
చింతపల్లి పీఎస్ పరిధి లోని పాలెం తండాకు చెందిన సూర్య నాయక్ అనే వ్యక్తిని, భూ సంబంధిత వ్యవహారంలో చింతపల్లి ఎస్సై సతీష్ రెడ్డి జోక్యం చేసుకొని చావబాదినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు.
ఎస్సై దాడితో సూర్య నాయక్ అక్కడిక్కడే మృతి చెందగా హడావిడిగా పోలీస్ వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, పోస్టుమార్టం ను అడ్డుకొని మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన నిన్న జరగగా, నేడు ఎస్సై సతీష్ రెడ్డి పై సస్పెండ్ వేటు పడింది.
భూ వివాదంలో తలదూర్చి అతి ఉత్సాహం చూపించిన ఎస్సై ని ఐ.జి.పి ఆదేశాల మేరకు సస్పెండ్ ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ వివాదాలు, సివిల్ విషయాలలో పోలీసులు జోక్యం చేసుకోవద్దని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని అన్నారు.
NLG: ఎం.జి యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గా బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎంపిక
నల్లగొండ: ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఫుట్బాల్ పోటీలలో పాల్గొనే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ టీం కెప్టెన్ గా.. నల్గొండ పట్టణంలోని చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు బొమ్మపాల సాయి చంద్ర సిద్ధార్థ ఎన్నికయ్యాడని, ఎం.జి.యూ ఫిజికల్ డైరెక్టర్ మురళి మరియు శ్రీనివాసరెడ్డి లకు క్లబ్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని హెడ్ కోచ్ మద్ది కరుణాకర్ తెలిపాడు.
సాయి చంద్ర సిద్ధార్థ గతంలో ఒకసారి జూనియర్ నేషనల్స్, మరియు SGF U/19 నేషనల్స్ పోటీలలో పాల్గొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుట్బాల్ అకాడమీ కు సెలెక్ట్ కావడం జరిగిందని, కర్నూల్ అకాడమి కోచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి, గతంలో 3సార్లు 2020, 2021, 2022 సంవత్సరాలలో కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడని మద్ది కరుణాకర్ తెలిపారు.
ఈ సందర్భంగా చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు మరియు సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారులు సాయి చంద్ర సిద్దార్ధ ను ప్రత్యేకంగా అభినందించారు.
TS: తెలంగాణలో 54 కార్పొరేషన్ల ఛైర్మన్ ల నియామకాలు రద్దు
హైదరాబాద్: రాష్ట్రంలో పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
డిసెంబరు 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమించిన కార్పొరేషన్ ఛైర్మన్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
TS: ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచే!
తెలంగాణలో ఇంటర్ పరీక్షలను ఈ ఏడాది కాస్త ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ పరీక్షలను మార్చి 1 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
పార్లమెంట్ ఎన్నికలు, ఇంటర్ తర్వాత 10వ తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండడంతో పాటు పలు కారణాలతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రి ఆమోదం తర్వాత షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే చాన్స్ ఉంది.
TS: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని సచివాలయంలో తన ఛాంబర్ లో పూజలు నిర్వహించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీ తో కోమటిరెడ్డి విజయం సాధించిన విషయం విధితమే. ఈరోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకాలు చేపట్టే ప్రక్రియ మొదలుపెట్టారు.
TS: కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన సీఎం రేవంత్
కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ శనివారం చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని మార్చిన రేవంత్.. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసిన వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జిఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
TS: ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.
ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీఎస్ శాంతికుమారి, టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీ లను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీ లను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు'' అని తెలిపారు..
Dec 12 2023, 15:00