TS: మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాదులోని సచివాలయంలో తన ఛాంబర్ లో పూజలు నిర్వహించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ ఎమ్మెల్యేగా ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీ తో కోమటిరెడ్డి విజయం సాధించిన విషయం విధితమే. ఈరోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ముఖ్యమైన ఫైళ్ల మీద సంతకాలు చేపట్టే ప్రక్రియ మొదలుపెట్టారు.

TS: కేసీఆర్ ప్రభుత్వంలోని సలహాదారులను తొలగించిన సీఎం రేవంత్

కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్న ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ శనివారం చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వేటు వేస్తున్నారు. ఇప్పటికే పలువుర్ని మార్చిన రేవంత్.. తాజాగా కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులుగా పనిచేసిన వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడుగురు ప్రభుత్వ సలహాదారులను తొలగిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో సోమేశ్ కుమార్, శోభ, జిఆర్ రెడ్డి, చెన్నమనేని రమేశ్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్ ఉన్నారు. వీరి స్థానంలో కొత్త సలహాదారులను నియమించనున్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

TS: ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీ లను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచి మరో పథకాన్ని సీఎం ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు.

ఆరోగ్యశ్రీ లోగో, పోస్టర్‌లను ఆవిష్కరించి, తెలంగాణ ప్రభుత్వం తరఫున బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్కును అందజేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ, మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతికుమారి, టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ.. ఇవాళ తెలంగాణ ప్రజలకు పండగ రోజు. 2009, డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. ఇక్కడి ప్రజల కోసమే సోనియమ్మ ఆరు గ్యారంటీ లను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీ లను అమలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు'' అని తెలిపారు..

TS: మునుగోడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికలలో మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘన విజయం సాధించి, ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. రాజగోపాల్ రెడ్డి గతంలో 2009 - 2014 వరకు భువనగిరి ఎంపీగా, 2016-2018 వరకు శాసనమండలి సభ్యుడిగా, 2018 - 2022 ఆగస్టు 2 వరకు మునుగోడు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

మర్రిగూడెం: బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండలం కమ్మగూడ గ్రామ పంచాయితీ పరిధిలోని భీమ్ల తండ లో, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రమావత్ బాలు కూతురు అనారోగ్యంతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, బాధిత కుటుంబ సభ్యులకు కార్యకర్తల ద్వారా రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మార్నేని ప్రశాంత్, ఉప సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, వార్డు మెంబర్ శ్రీను నాయక్ మర్రిగూడ మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు అశోక్, నాగరాజు, బిక్షం, రమేష్ పాల్గొన్నారు.

చౌటుప్పల్: ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు

మునుగోడు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని రత్నా నగర్ బుడగ జంగాల కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు శంకుస్థాపన చేశారు. స్థానిక కౌన్సిలర్ కామిశెట్టి శైలజ భాస్కర్, కొయ్యడ సైదులు, సంధగల్ల సతీష్, నాయకులు సుర్వి నరసింహ గౌడ్, బొబ్బిళ్ళ మురళి, జొర్రీగల జ్ఞానేశ్వర్, వర్గాల వెంకటేష్ కుమార్, కాలనీ నాయకులు తూర్పాటి శంకర్, నరసింహ, పస్తం రాంబాబు, యాదయ్య, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.

TS: కోదాడ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పద్మావతి రెడ్డి

ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, కోదాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నలమాద పద్మావతి రెడ్డి విజయం సాధించిన విషయం విధితమే కాగా, ఈరోజు హైదరాబాద్ లో రాష్ట్ర అసెంబ్లీలో ఆమె ప్రమాణస్వీకారం చేశారు. నలమాద పద్మావతి రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2014 నుండి 2018 వరకు కోదాడ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించింది. ప్రస్తుతం ఆమె కోదాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

TS: నేటి నుంచి అమల్లోకి మహాలక్ష్మి పథకం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా మహాలక్ష్మి పథకంను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. నేడు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను అమల్లోకి తీసుకురానుంది. అయితే వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క మహిళలకు, బాలికలకు టిఎస్ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.. అదేవిధంగా ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టి.ఎస్.ఆర్.టి.సి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, బస్సులలో, పట్టణ పరిధిలోని సిటీ బస్సులకు సంబంధించిన ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఉచిత ప్రయాణం కోసం మహిళలు తమ వెంట ఆధార్ కార్డు కానీ, ప్రభుత్వ వారిచే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డును ప్రయాణాలలో తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే లగ్జరీ, డీలక్స్, ప్రైవేట్ బస్సులలో ప్రయాణాలకు డబ్బులు చెల్లించాల్సిందే. రాష్ట్ర పరిధి దాటిన టిఎస్ఆర్టిసి బస్సులలో డబ్బులు చెల్లించాల్సిందే. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయినా టిక్కెట్టు రుసుము లేకుండా ఫ్రీ ప్రయాణం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం పథకం పట్ల పలువురు మహిళలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

TS: సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉద్యమ సమయంలో 2009 డిసెంబర్ 12 నుండి 2014 జూన్ 2 వరకు వివిధ కేసుల్లో అరెస్టయి, జైలుకెళ్లిన ఉద్యమకారుల వివరాలను ఇవ్వాలని తెలంగాణ డిజిపి మరియు వివిధ జిల్లాల ఎస్పీ లను ఆదేశించారు. ఆ వివరాలను బట్టి ప్రభుత్వం త్వరలో ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయనుంది.

NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని కోమల ను అభినందించిన కళాశాలల జాయింట్ డైరెక్టర్

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బి. కోమల ద్వితీయ సంవత్సర విద్యార్థిని, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో భాగంగా.. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నుండి యోగాలో ఎంపికై అన్నా యూనివర్సిటీ, చెన్నై లో పాల్గొని తిరిగి రావడం జరిగింది. ఈ సందర్భంగా Collegiate of Education జాయింట్ డైరెక్టర్ డాక్టర్ యాదగిరి ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కడ ఆమె విజయం సాధించకపోయినప్పటికీ ఎం.జి యూనివర్సిటీ తరఫున ఎంపిక కాబడి పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్.రాజారామ్, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, నరేష్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.