*సైబర్‌ నేరాలను అరికట్టాలి : హోంమంత్రి*

సైబర్‌ నేరాలను అరికట్టాలని హోంమంత్రి మహమూద్‌ అలీ పోలీసు అధికారులకు సూచించారు. డీజీపీ, మూడు కమిషనరేట్ల సీపీలతో హోంమంత్రి మహమూద్‌ అలీ బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు.

సాంకేతిక వినియోగం, నేరాల నియంత్రణపై చర్చించారు. పోలీసుల పనితీరును ఈ సందర్భంగా అభినందించారు. మరింత కృషి చేస్తూ నేరాలను అరికట్టాలని సూచించారు.

సీసీఐటీవీ కెమెరాల ఏర్పాటు, నిఘాలో దేశంలోనే అగ్రస్థానంలోనే ఉన్నామన్నారు. కాలనీ, బస్తీలు, కూడళ్లలో మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని, కొత్త ఠాణాలు, జోన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

సైబర్‌ నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అరికట్టాలని, సైబర్‌ నేరాలపై అవగాహన పెంచాలని సూచించారు........

ఈ నెల 9 న ప్రజాకవి కాళోజీ కళాక్షేత్రం ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్*

ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ఈ నెల 9న వరంగల్‌ నగరానికి రానున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలిపారు.

ఈ మేరకు బుధవారం కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పురపాలక శాఖ ముఖ్య స్పెషల్‌ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్‌, అరూరి రమేశ్‌, ఎమ్మెల్సీ బస్వరాజ్‌ సారయ్య, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌తో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ..

వరంగల్‌ నగరంలో నిర్మించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ఈ నెల 9న ఆయన జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారని తెలిపారు. ఇప్పటికే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రారంభానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ పాల్గొంటారని, కవులు, కళాకారులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

నగరంలో మధ్య తరగతి వర్గాల కోసం కుడా ఆధ్వర్యంలో అపార్ట్‌మెంట్లను నిర్మిస్తామని, కాస్ట్‌ టు కాస్ట్‌ పద్ధ్దతిలో మధ్య తరగతి వర్గాలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు కోనుగోలు చేసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. వరంగల్‌లో కార్మికుల కోసం కార్మిక భవన్‌ నిర్మిస్తున్నామని, 6 మాడల్‌ లేబర్‌ అడ్డాలకు షెల్టర్లను నిర్మించనున్నామని, సమ్మయ్యనగర్‌ నాలా పక్కనున్న వరద భాదితులకు 9 అంతస్తులతో అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఫ్లాట్లు అందజేస్తామని పేర్కొన్నారు.

పెద్దమ్మగడ్డ రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికి ఆ గృహ సముదాయంలో ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. చారిత్రక వరంగల్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టిసారిస్తున్నారని వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. హైదరాబాద్‌ తర్వాత రెండో నగరంగా ఉన్న వరంగల్‌ అభివృద్ధి కోసం తొమ్మిదేండ్లలో రూ.4,500 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు.

నగరంలో రూ.3 కోట్లతో చేపట్టిన 19 జంక్షన్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, వరదల వల్ల జరిగిన నష్టానికి మంత్రి కేటీఆర్‌ రూ.250 కోట్లు మంజూరు చేశారని చీఫ్‌ విప్‌ తెలిపారు. నగరానికి విచ్చేసిన ఎంఏయూడీ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రం పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు.......

*మనీషా, శివానీల మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలి, వారి కుటుంబాలను ఆదుకోవాలి.*

 AISF, PDSU,TSU,PYL సంఘాల డిమాండ్

నల్లగొండ నడిబొడ్డులో నిన్న సాయంత్రం ఉమెన్స్ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థినిలు మనీషా, శివానిలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది, ఇప్పటికీ 24 గంటలు గడుస్తున్న పోలీసులు సమగ్ర విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. వెంటనే వారి మృతిపై తగిన విచారణ చేపట్టి కారణాలను వెలికి తీయాలని ఏఐఎస్ఎఫ్, పి డి ఎస్ యు, టి ఎస్ యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

  స్థానిక మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలతో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా పిడిఎస్ యూ జిల్లా ఇన్చార్జి ఇందూరు సాగర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిగొండ మురళి కృష్ణ, టి ఎస్ యు జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఇలాంటి క్రమంలో ధైర్యంతో ఉండాలని సూచించారు. విద్యార్థులపై అసాంఘిక శక్తులు ప్రేమ పేరుతో వేధించినా, కాలేజీలో, హాస్టల్లో ఇబ్బందులు జరిగిన పోలీసులకు, విద్యార్థి సంఘ నాయకులకు, మహిళా సంఘాల నాయకులకు సమాచారం ఇవ్వాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు. నల్లగొండలో నిన్న విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమని, ఆత్మహత్యలు సరైన విధానం కాదని వారు తెలిపారు. మనిషా, శివానీల ఆత్మహత్యపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, దోషులను శిక్షించాలని వారు డిమాండ్ చేశారు, రాష్ట్రంలో విద్యార్థులకు రక్షణగా ఎన్ని చట్టాలు వచ్చినా, "షీ"టీం, నిర్భయ చట్టాలాంటి వచ్చినప్పటికీ మహిళలకు, విద్యార్థులకు భరోసా కల్పించలేకపోయారని, రక్షణ కల్పించలేకపోయారని వారు అన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినిల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.సోషల్ మీడియాపై విద్యార్థులకు ప్రభుత్వం అవగాహన కల్పించాలని అన్నారు.సోషల్ మీడియాలలో చెడును గ్రహించి విద్యార్థులు దూరంగా ఉండాలని అన్నారు.

  ఈ కార్యక్రమంలో పిడిఎస్ యూ జిల్లా కార్యదర్శి పోలే పవన్, ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు ఎర్ర వినయ్, పి వై ఎల్ జిల్లా కార్యదర్శి బీవీ చారి, విద్యార్థినిలు రేణుక, స్వప్న, పల్లవి ,భార్గవి, లలిత ,స్నేహ సునీత, స్పందన ,మల్లేశ్వరి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.

ఫొటోలు అశ్లీలంగా మార్చి ఇన్‌స్టాలో పోస్టు.. ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం

నల్గొండ : వాట్సప్‌ అకౌంట్‌కు డీపీగా పెట్టుకున్న ఫొటోలు ఇద్దరు యువతుల ప్రాణాల మీదకు తెచ్చాయి. గుర్తుతెలియని ఆకతాయిలు వాటిని అశ్లీలంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నల్గొండలో సంచలనమైంది..

పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు(19) జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహంలో ఉంటూ డిగ్రీ చదువుతున్నారు. వీరు ఇంటర్మీడియెట్‌ కలిసి చదువుకున్నప్పటి నుంచే స్నేహితులు. ఇటీవల పరీక్షలు రాసిన అనంతరం సెలవులు రావడంతో 20 రోజులుగా ఇంటి వద్దే ఉంటున్నారు.

మంగళవారం కళాశాలలో ల్యాబ్‌ పరీక్షలు ఉన్నాయని చెప్పి ఉదయం 9 గంటలకు నల్గొండకు చేరుకున్నారు. ఎన్జీ కళాశాల వెనుక భాగంలోని రాజీవ్‌ పార్కుకు వెళ్లారు. అక్కడే గంటకుపైగా ఉన్న తర్వాత వెంట తెచ్చుకున్న పురుగు మందును కూల్‌డ్రింక్‌లో కలుపుకొని తాగేశారు. ఈ విషయాన్ని వసతిగృహంలో ఉన్న తమ స్నేహితురాలికి సమాచారం అందించారు.

అనంతరం గేటు బయట చెట్టు కిందకు వచ్చి పడిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకొని నల్గొండ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మార్ఫింగ్‌ చేసిన తమ చిత్రాలను ఇన్‌స్టాగ్రాంలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతుండటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు న్యాయమూర్తికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు సమాచారం. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నల్గొండ టూ టౌన్‌ ఎస్సై నాగరాజు తెలిపారు.

*మూసీ నదిలో మహిళ మృతదేహం లభ్యం

గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతదేహం మూసీనదిలో కొట్టుకొచ్చింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రోజు ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు.

లక్ష్మి ఆచూకీ తెలియటం లేదని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మి మృతదేహన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.....

Yuvagalam : బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి..

ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు..

అర్ధరాత్రి మూడు వ్యానుల్లో యువగళం క్యాంప్ సైట్ కి చేరుకున్న పోలీసులు.. వలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందితో సహా మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి క్యాంప్ లోకి వచ్చి విచక్షణారహితంగా వలంటీర్లపై దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్ర కి అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసిపి కార్యకర్తలు కవ్వింపు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. 

రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను, కవ్వింపు చర్యలకు స్కెచ్ వేసిన రౌడీ షీటర్ ఎన్ సుధని అరెస్ట్ చెయ్యకుండా యువగళం వలంటీర్లను అరెస్ట్ చెయ్యడం దారుణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు..

మహిళా విద్యార్థుల ఆత్మహత్యయత్నం పై సమగ్రమైన విచారణ జరిపించాలి

కెవిపిఎస్,విద్యావంతులవేదిక

నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ, ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థినిలు పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం స్థానిక నల్లగొండ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించడం జరిగింది. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా అడిగి కారాణాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అమ్మాయిలు అపస్మారక స్థితిలో ఉన్నందున నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. సమగ్రమైన విచారణ జరిపించి అమ్మాయిలు ఆత్మహత్యలకు కారణమైనటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది..

సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది..

Nara Lokesh: జగన్‌ పాలనలో పూర్తిగా సంక్షోభంలోకి ఆక్వా రంగం: నారా లోకేశ్‌

ఉంగుటూరు: తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామని చెప్పారు..

ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్‌ సైట్‌ నుంచి 'యువగళం' 203వ రోజు పాదయాత్రను లోకేశ్‌ ప్రారంభించారు. 

స్థానిక ఆక్వా రైతులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. 15 ఏళ్లుగా చేపల సాగు చేస్తున్నానని.. గత మూడేళ్లుగా సరైన ధర లేక సుమారు రూ.3లక్షల నష్టం వస్తోందని అప్పారావు అనే రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించి.. అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు..

అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని విమర్శించారు. తెదేపా హయాంలో విద్యుత్‌, ఆక్వా సాగులో వాడే పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు అందించామని తెలిపారు. ఆక్వా రంగానికి రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తామని చెప్పి రైతులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఉన్న అన్ని సబ్సిడీలను రద్దు చేశారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగాన్ని ఆదుకుంటామని.. తక్కువ ధరకే విద్యుత్‌, ఆక్వా పరికరాలను అందిస్తామని హామీ ఇచ్చారు..