*మూసీ నదిలో మహిళ మృతదేహం లభ్యం

గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతదేహం మూసీనదిలో కొట్టుకొచ్చింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఈ రోజు ఉదయం మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు.

లక్ష్మి ఆచూకీ తెలియటం లేదని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మి మృతదేహన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.....

Yuvagalam : బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసుల దాడి..

ఏలూరు : ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు..

అర్ధరాత్రి మూడు వ్యానుల్లో యువగళం క్యాంప్ సైట్ కి చేరుకున్న పోలీసులు.. వలంటీర్లు, కిచెన్ సిబ్బంది, క్యాంప్ ఏర్పాటు చేసే సిబ్బందితో సహా మొత్తం 50 మందిని అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి క్యాంప్ లోకి వచ్చి విచక్షణారహితంగా వలంటీర్లపై దాడి చేసి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువగళం పాదయాత్ర కి అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసిపి కార్యకర్తలు కవ్వింపు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. 

రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలను, కవ్వింపు చర్యలకు స్కెచ్ వేసిన రౌడీ షీటర్ ఎన్ సుధని అరెస్ట్ చెయ్యకుండా యువగళం వలంటీర్లను అరెస్ట్ చెయ్యడం దారుణమని టీడీపీ నేతలు మండిపడుతున్నారు..

మహిళా విద్యార్థుల ఆత్మహత్యయత్నం పై సమగ్రమైన విచారణ జరిపించాలి

కెవిపిఎస్,విద్యావంతులవేదిక

నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతూ, ఎస్సీ హాస్టల్లో ఉంటున్న ఇద్దరు విద్యార్థినిలు పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నం చేయడం జరిగింది. ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్,జిల్లా ఎస్పీ సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు.

మంగళవారం స్థానిక నల్లగొండ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ వైద్యశాలలో పురుగుల మందు తాగి చికిత్స పొందుతున్న విద్యార్థినిలను పరామర్శించడం జరిగింది. అమ్మాయిల తల్లిదండ్రులను కూడా అడిగి కారాణాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అమ్మాయిలు అపస్మారక స్థితిలో ఉన్నందున నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. సమగ్రమైన విచారణ జరిపించి అమ్మాయిలు ఆత్మహత్యలకు కారణమైనటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది..

సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది..

Nara Lokesh: జగన్‌ పాలనలో పూర్తిగా సంక్షోభంలోకి ఆక్వా రంగం: నారా లోకేశ్‌

ఉంగుటూరు: తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామని చెప్పారు..

ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్‌ సైట్‌ నుంచి 'యువగళం' 203వ రోజు పాదయాత్రను లోకేశ్‌ ప్రారంభించారు. 

స్థానిక ఆక్వా రైతులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. 15 ఏళ్లుగా చేపల సాగు చేస్తున్నానని.. గత మూడేళ్లుగా సరైన ధర లేక సుమారు రూ.3లక్షల నష్టం వస్తోందని అప్పారావు అనే రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించి.. అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు..

అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని విమర్శించారు. తెదేపా హయాంలో విద్యుత్‌, ఆక్వా సాగులో వాడే పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు అందించామని తెలిపారు. ఆక్వా రంగానికి రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తామని చెప్పి రైతులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఉన్న అన్ని సబ్సిడీలను రద్దు చేశారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగాన్ని ఆదుకుంటామని.. తక్కువ ధరకే విద్యుత్‌, ఆక్వా పరికరాలను అందిస్తామని హామీ ఇచ్చారు..