మెదక్‌ జిల్లాలో ఘోర ప్రమాదం.. కారు, ఆటో ఢీకొని నలుగురు దుర్మరణం

మెదక్‌ జిల్లా :

మెదక్‌ జిల్లాలోని నార్సింగ్‌ మండలం మల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మల్లూరు వద్ద జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన కారును అదుపుతప్పి ఆటోను ఢీకొట్టింది.

దీంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు పంపించారు.

మృతులను తండ్రీ కొడుకులైన శేఖర్‌, యశ్వంత్‌ (9), దంపతులు బాలనర్సయ్య, మణెమ్మగా, గాయపడినవారిని కవిత, అవినాశ్‌గా గుర్తించారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందినవారిగా గుర్తించారు.

కామారెడ్డి నుంచి చేగుంటవైపు వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

SB NEWS

రేపు మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..?

భువనేశ్వర్‌:

రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్‌ ఆదివారం భువనేశ్వర్‌కు తిరిగి రానున్నారు.

దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్‌కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.

కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్‌ విక్రమ కేశరి అరూఖ్‌ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్‌ రంజన్‌ దాస్‌, శ్రీకాంత్‌ సాహు ఉన్నారు.

స్పీకర్‌ పదవికి రాజీనామా చేసిన విక్రమ్‌ కేశరి అరుఖ్‌కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ప్రీతి చెల్లి కీ ప్రభుత్వ ఉద్యోగం ఉత్తర్వులు జారీ

వరంగల్‌ జిల్లా :

కాకతీయ మెడికల్‌ కళాశాలలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మెడికో ప్రీతి చెల్లి పూజకు ప్రభుత్వ ఉద్యోగం లభించింది.

హైదరాబాద్‌ HMDA లో ఉద్యోగం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూజకు ఐటీ సెల్ లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు ఉత్తర్వుల్లో HMDA పేర్కొంది.

మెడికో ప్రీతి కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రీతి మరణించిన తర్వాత ఆమె కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందచేసింది.

అదే సమయంలో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మంత్రి కేటీఆర్ తన శాఖ పరిధిలోని HMDA లో ప్రీతి చెల్లి పూజకు ఉద్యోగం ఇస్తానని చెప్పారు.

ఈ మేరకు మే 20వ తేదీ శనివారం పూజను HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ పద్దతిలో సపోర్ట్ అసోసియేట్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు గాను ప్రీతి కుటుంబ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు...

తిరుమలలో పోటెత్తిన భక్తజనం

తిరుపతిజిల్లా:

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్‌ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది.

జూన్‌ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. ఆదివారం మే 21న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.

శుక్ర, శని వారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా కానుంది. ఇక గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు.

శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీంతో రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల మొత్తం మీద 4 నుంచి 8 గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు...

కర్ణాటకలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

•ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం..

•బెంగళూరుః కర్ణాటకలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది..

గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక,రాహుల్ గాంధీ హాజరు అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సీఎం సుఖ్వీందర్ సింగ్, భూపేష్ బఘేల్ పాల్గొన్నారు..

యూపీఏ భాగస్వామ్య పక్షాల తరఫున బిహార్, జార్ఖండ్, ఢిల్లీ, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు వచ్చారు. బెంగాల్ సీఎం మమత బెనర్జీకి ఆహ్వానం ఉన్నప్పటికీ.. రాలేదు. పార్టీ తరఫున సీనియర్ నాయకుడు కకోలి ఘోష్ దస్తిదార్ హాజరు అయ్యారు..

మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే కూడా ఉన్నారు.

చాలామంది గతంలో మంత్రులుగా పని చేసిన వారే ఉన్నారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేస్తూ.. మంత్రివర్గంలో చోటు కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం..

తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దొంగలు..

కడప: తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు రెచ్చిపోయారు. మార్గమధ్యలో దోపిడీకి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది..

వివరాలు.. తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్ రాత్రి 7:30 గంటల సమయంలో తిరుపతి నుంచి బయలుదేరాల్సి ఉంది. కానీ దాదాపు గంట ఆలస్యంగా అక్కడి నుంచి రైలు కదిలింది. అయితే కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత రైలు ఆగింది.

అప్పుడు 20 నుంచి 25 మంది దొంగలు ట్రైన్‌లో ఎక్కినట్టుగా చెబుతున్నారు.. ఎస్‌1 నుంచి ఎస్‌6 వరకు ఉన్న బోగీల్లో పలువురు ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేశారు.

అయితే దోపిడీని ప్రతిఘటించేందుకు యత్నించినవారిపై దాడికి కూడా పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. రాత్రిపూట రైళ్లలో భద్రత పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Pakistani drones: పంజాబ్ సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్లు...నేలకూల్చిన బీఎస్ఎఫ్ దళాలు

అమృత్‌సర్‌(పంజాబ్): పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శుక్రవారం ఎగురుతున్న రెండు పాకిస్థాన్ డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ కూల్చివేసింది.

(Pakistani drones)పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద(International border in Punjab) భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్‌కు చెందిన రెండు డ్రోన్‌లను బీఎస్‌ఎఫ్ దళాలు నేలకూల్చాయి.

(shot down by BSF) డ్రోన్‌లలో ఒకదాంట్లో అనుమానాస్పద మత్తుపదార్థాలు ఉన్న బ్యాగ్‌ని కూడా బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.

అమృత్‌సర్ జిల్లాలోని ఉధర్ ధరివాల్ గ్రామం నుంచి డ్రోన్లను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.అమృత్‌సర్ జిల్లాలోని రత్తన్ ఖుర్ద్ గ్రామం నుంచి రాత్రి 9:30 గంటలకు బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రతినిధి పేర్కొన్నారు.

రెండవ డ్రోన్‌కు 2.6 కిలోల రెండు హెరాయిన్‌ ప్యాకెట్లను జోడించగా వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ప్రతినిధి తెలిపారు.

అవినాష్ రెడ్డికి మళ్లీ నోటీసులు..ఈసారి సీబీఐ ప్లాన్ మార్చుతుందా?

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి CBI మళ్లీ నోటీసులు జారీ చేసింది..

ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా మొదట ఈనెల 16న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy)కి సీబీఐ నోటీసులు ఇచ్చింది.

అయితే ముందే ఫిక్స్ అయిన షెడ్యూల్ కారణంగా విచారణకు హాజరు కాలేనని..4 రోజుల సమయం ఇవ్వాలని సీబీఐకి లేఖ రాశారు. దీనితో ఈనెల 19న విచారణకు రావాలని సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది..

అయితే తన తల్లికి అనారోగ్య కారణంగా విచారణకు రాలేనని రెండోసారి కూడా అవినాష్ (Ys Avinash Reddy) సీబీఐ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో సీబీఐ మూడోసారి నోటీసులు జారీ చేసింది.

అయితే మొదటి రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన అవినాష్ (Ys Avinash Reddy) ఈసారైనా విచారణకు వస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ విచారణకు రాకపోతే సీబీఐ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? తప్పనిసరైతే అరెస్ట్ చేస్తారా? లేక కోర్టును ఆశ్రయిస్తారా? సీబీఐ ప్లాన్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే..

Nellore: నేను ప్రతీకారం మొదలెడితే ఊహకు కూడా అందదు!: నెల్లూరు డిప్యూటీ మేయర్‌

నెల్లూరు: నెల్లూరు డిప్యూటీ మేయర్‌ రూప్ కుమార్ యాదవ్ అనుచరుడు, వైకాపా విద్యార్థి నేత హాజీపై శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు..

ప్రస్తుతం హాజీ నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హాజీని ఇవాళ రూప్‌కుమార్ యాదవ్‌ పరామర్శించారు. తన అనుచరుడిపై జరిగిన దాడిపై రూప్ కుమార్ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రూప్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ''వైకాపా ఆవిర్భావం నుంచి హాజీ పార్టీలో ఉన్నారు. హాజీపై కత్తులతో హత్యాయత్నం చేశారు. కేవలం నాతో ఉన్నాడనే కక్షతోనే దాడి జరిగింది. బాధితుడు చెబుతున్నట్టు ఈ దాడి వెనుక స్థానిక ఎమ్మెల్యే అనిల్‌ కుమార్ యాదవ్‌ ఉన్నారు. ఇలాంటి దాడులు చేయడం మంచిది కాదు. గతంలోనూ నా అనుచరులపై దాడులు చేశారు.

ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ మరోసారి దాడి జరిగి ఉండేది కాదు. ఇకపై మా కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు. నేను ప్రతీకారం మొదలుపెడితే ఊహకు కూడా అందదు. ఈ ఘటనను సీఎం జగన్‌, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తా. నెల్లూరులో వైకాపాను సర్వనాశనం చేస్తున్నారు'' అని రూప్‌కుమార్ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ తీరుపై ఆయన బాబాయ్‌ (డిప్యూటీ మేయర్) రూప్ కుమార్ యాదవ్ పద్యం రూపంలో విమర్శలు గుప్పించారు. వేమన పద్యాన్ని ఉదహరిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు హాజరుకావడం లేదు : జూనియర్ ఎన్టీఆర్..

హైదరాబాద్‌లో ఇవాళ సాయంత్రం ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నగరంలోని కూకట్‌పల్లి ఖైతాలపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..

ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు.. జూనియర్ ఎన్టీఆర్ వస్తారని భావించగా.. ఈ కార్యక్రమానికి తాను హాజరుకావట్లేదని తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. తన పుట్టినరోజు కార్యక్రమాలు, టూర్‌ దృష్ట్యా హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు..

SB NEWS

SB NEWS

SB NEWS