తిరుమలలో పోటెత్తిన భక్తజనం
తిరుపతిజిల్లా:
తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వేసవి సెలవులు రావడం, కోవిడ్ -19 ముప్పు పూర్తిగా తొలగిపోవడంతో.. కళియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
దీంతో తిరుమల కొండపై రద్దీ బాగా పెరిగింది. దీంతో సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. ఇక వారాంతాల్లో శుక్ర, శని, ఆది వారాల్లో ఈ సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిని నియంత్రించేందుకు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పలు నిర్ణయాలు తీసుకుంది.
జూన్ 30వ తేదీ వరకు స్వామివారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో మార్పులు చేస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆదివారం మే 21న ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు వారాంతాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోమని వెల్లడించారు.
శుక్ర, శని వారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటా రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా 20 నిమిషాల సమయం ఆదా కానుంది. ఇక గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహిస్తారని, దీంతో 30 నిమిషాల సమయం ఆదా అవుతుందని తెలిపారు.
శుక్ర, శని, ఆది వారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని టీటీడీ స్పష్టం చేసింది. స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని తెలిపారు. దీంతో రోజూ 3 గంటల సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాల వల్ల మొత్తం మీద 4 నుంచి 8 గంటల సమయం ఆదా అవుతుందని అధికారులు చెబుతున్నారు...
May 21 2023, 11:14