ఇంట గెలిచి రచ్చ గెలువు
బీఆర్‌ఎస్ జాతీయ దుకాణం కొన్నాళ్లు సైలెంట్!
కర్ణాటక దెబ్బతో రాష్ట్ర అధికారపక్షం నేలచూపులు
తెలంగాణలో అదే పరిస్థితి అని సర్వేల్లో వెల్లడి
ఢిల్లీ రాజకీయాలపై దృష్టి తగ్గించాలని నిర్ణయం
మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో పోటీ డౌటే?
తెలంగాణ అధికారపక్షం బీఆర్‌ఎస్ నేల మీదకు దిగొచ్చింది. జాతీయ రాజకీయాల ఆశలను కాసేపు పక్కనబెట్టి ఇల్లు చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది. ఆర్నెల్ల క్రితమే పేరు మార్చుకొని జాతీయ పార్టీగా అవతారమెత్తిన బీఆర్‌ఎస్ ఢిల్లీ పీఠమే లక్ష్యంగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నట్లు ప్రచారం చేసుకుంది. చుట్టుపక్కల రాష్ట్రాల్లో పార్టీని విస్తరించడమే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్నట్లు చెప్పుకుంది. ఏపీ, మహారాష్ట్రల్లో పార్టీ శాఖలను తెరవడమే కాకుండా చేరికలను ముమ్మరం చేసింది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీకీసన్నద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మారిపోయిందని, బీజేపీకి అధికారంలోకి వచ్చేంత సీన్ లేదని లెక్కలు వేసుకొని, ఇల్లు వదిలి రచ్చ గెలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంచనాలను కర్ణాటక ఎన్నికలు పటాపంచలు చేశాయి.
డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నా కర్ణాటకలో అధికారపక్షం బీజేపీ చిత్తయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభంజనంలా మారి కాంగ్రెస్‌కు గత 40 ఏళ్లలో రానన్ని సీట్లను సంపాదించి పెట్టింది. వరుస ఓటములతో తిరోగమనంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా కొత్త ఉత్సాహాన్ని సంతరించుకుంది. కర్ణాటక గెలుపుతో తెలంగాణ కాంగ్రెస్ వాడవాడనా సంబరాలు చేసుకుంది. మారిన పరిస్థితి చూసి బీఆర్‌ఎస్ అప్రమత్తమైంది. కర్ణాటక తరహాలోనే తెలంగాణలో నూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. సరైన ప్రత్యామ్నాయం ఇస్తామని కాస్తంగా భరోసా ఇచ్చినా కర్ణాటకలాగే ఇక్కడా ప్రతిపక్షానికి ఓట్లు పోటెత్తుతాయని అనుమానం మొదలైంది. కర్ణాటకలో బీజేపీ ప్ర భుత్వ వ్యతిరేకతకు విరుగుడుగా భారీ ఎత్తున కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. అయినా ఫలించలేదు.
ఇక్కడేమో సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ అంతర్గత సమావేశాల్లో ఇప్పటికే కమిటయ్యారు. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ కూడా తుపాను అవుతుందేమోనన్న భయం మొదలైంది. అందుకే, కేసీఆర్ ప్రజాదరణ పూర్తిగా కోల్పోయిన పలువురు నేతలకు ఈసారి టికెట్లు ఇవ్వకపోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కొన్నా ళ్ల పాటు జాతీయ రాజకీయాల విషయంలో చప్పుడు చేయకుండా ఉండాలని గులాబీ బాస్ భావిన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమకు 50% ఓటు బ్యాంకు ఉందని, 60లక్షల సభ్యత్వాలున్న అతిపెద్ద ప్రాంతీయ పార్టీ తమదని, రాబోయే ఎన్నికల్లో తిరిగి అధికారం చేపడతామని బయటకు చెబుతున్నా..లోపల మాత్రం బీఆర్‌ఎస్‌కు గుబులు మొదలైందని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.
ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను సరి చేసుకోవడంపై దృష్టి పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ఎక్కడైనా ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందని, ఇకపై జాతీయ రాజకీయాలపై దృష్టి తగ్గించి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విజయంపైనే పూర్తి శక్తి యుక్తులు కేటాయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చినపుడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతోనే జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని కేసీఆర్ ప్రకటించారు. జేడీఎస్ చీఫ్ కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీయే చేయలేదు. అసలా ఊసే ఎత్తలేదు. గత అసెంబ్లీలో 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ ఈసారి 19 సీట్లకే పరిమితమైంది. కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణలో ఉంటుందా అన్న విషయం కన్నా ప్రభుత్వ వ్యతిరేకత అన్న విషయంపైనే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలిసింది. ఆయన చే యించుకున్న సొంత సర్వేల్లో తెలంగాణలోనూ ప్రభుత్వంపై వ్యతిరేకత గట్టిగానే ఉన్నట్లు తేలింది. దాన్ని ఎలా అధిగమించాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ‘‘ఇక జాతీయ రాజకీయాలు కాదు.. ముందు తెలంగాణలో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం. తర్వాత.. జాతీయ రాజకీయాలపై దృష్టి పెడదాం’’ అని నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయానికి అనుకూలించిన అంశాలు, అక్కడి ప్రజల్లో అధికార బీజేపీపై వ్యతిరేకతకు కారణాలు, ప్రజల మెప్పు పొందడానికి కాంగ్రెస్ అనుసరించిన వ్యూహం వంటిని బీఆర్‌ఎస్ విశ్లేషించుకుంటోంది. ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, నియోజకవర్గాల వారీ గా పార్టీ పరిస్థితులు, వాటిని అధిగమించడం కోసం ఏం చేయాలి? వంటి విషయాలపై గులాబీ బాస్ దృష్టి సారించారు. బీజేపీ ఓటమి సంతోషం కలిగించినా.... కర్ణాటకలో కాంగ్రెస్ ఓట్లశాతం భారీగా పెరగడం, అత్యధిక సీట్లు దక్కించుకోవడం ఆందోళన కలిగిస్తోందని బీఆర్‌ఎస్ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.
May 16 2023, 12:05