ChandraBabu: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ.. చేసిన అభివృద్ధి శాశ్వతం: చంద్రబాబు
హైదరాబాద్: ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ, తాను చేసిన అభివృద్ధి శాశ్వతమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ గీతం యూనివర్సిటీలో కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 25ఏళ్ల క్రితం విజన్ 2020 ప్రకటించినప్పుడు కొందరు విజన్ 420 అని అవహేళన చేశారన్నారు. కానీ, ప్రస్తుతం తన విజన్ హైదరాబాద్ అభివృద్ధిలో కనిపిస్తోందని తెలిపారు. ఇప్పుడు విజన్ 2047 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 2047కు దేశానికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు అవుతుందన్నారు..
టెలికమ్యూనికేషన్ల విషయంలోనూ ఎన్నో సంస్కరణలు తెచ్చామని, వాటి ఫలితాలు ఇప్పుడు అంతా అనుభవిస్తున్నారని తెలిపారు. భవిష్యత్‌లో భారత్‌కు సాటి వచ్చే దేశాలు లేవన్నారు. 75ఏళ్ల క్రితం వరకు బ్రిటిషర్లు ఇండియాను పాలించారు.. కానీ, ఇప్పుడు ఓ ఇండియన్ బ్రిటన్‌ను పాలిస్తున్నారని తెలిపారు. దేశంలో మధ్య తరగతి ప్రజల సంఖ్య బాగా పెరుగుతోందన్నారు.
''1978లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మాకు జీపు ఇచ్చేవారు. అప్పటి రోడ్లలో జీపులు నడిపేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు న్యూ ఇండియా చూస్తున్నారు. దేశ ప్రగతిని సంస్కరణలకు ముందు.. తర్వాత అని చెప్పుకోవాలి. 2047కు మన తలసరి ఆదాయం 26వేల డాలర్లుగా ఉండాలి. ప్రస్తుతం మనది ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరో పాతికేళ్లలో మనది ప్రపంచంలోనే మూడో ఆర్థిక వ్యవస్థ అవుతుంది.
2047నాటికి ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావాలి. యువత తలచుకుంటే 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడం సాధ్యమే. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చాలా మంది హెచ్చరించారు. విద్యుత్ సంస్కరణల కారణంగా నేను అధికారం కూడా కోల్పోయాను. దేశంలో విద్యుత్ సంస్కరణల రూపకల్పనలో నాది కీలకపాత్ర. దేశంలోనే మొదటి హరిత విమానాశ్రయం శంషాబాద్‌లో నిర్మించాం. శంషాబాద్ విమానాశ్రయం కోసం 20 ఎయిర్‌పోర్టులను స్వయంగా పరిశీలించా. ఐటీ, బీటీ, ఫార్మా వంటి రంగాల్లో ఎంతో ప్రగతి సాధించాం'' అని చంద్రబాబు వివరించారు..
May 15 2023, 11:55