కొడుకును చూసి గర్వపడుతున్నా : మంత్రి హరీష్ రావు
ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో మాత్రమే కాక.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. రాజకీయాలు మాత్రమే కాక.. అన్ని విషయాల గురించి రియాక్ట్ అవుతారు.
ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉన్నప్పటికి.. తన పర్సనల్ విషయాల గురించి మాత్రం షేర్ చేయరు. ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఈ క్రమంలో తాజాగా హరీష్ రావు.. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన కుమారుడికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన హరీష్ రావు.. పుత్రోత్సాహంతో పొంగిపోతున్నట్లు వెల్లడించారు.
హరీష్ రావు కుమారుడు అర్చిష్మాన్ అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసి.. పట్టా అందుకున్నాడు. ఈ మేరకు యూనివర్సిటీ స్నాతకోత్సవం అమెరికాలోని కొలరాడో కౌంటీ బౌల్డర్‌లో జరగింది.
హరీష్ రావు ఈ వేడుకలో పాల్గొనడం కోసం అమెరికా వెళ్లాడు. ఇక ఈ స్నాతకోత్సవ కార్యక్రమంలో అర్చిష్మాన్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పట్టాతో పాటు గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు హరీష్ రావు.
ఈవేడుకకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘మా అబ్బాయి ఆర్చిష్మాన్ సాధించిన ఈ అద్భుతమైన ఘనత పట్ల గర్వించకుండా ఎలా ఉంటాను. ఇది నీలోని పట్టుదలకు, మార్పు తీసుకురావాలన్న నీ ఆకాంక్షకు నిదర్శనం. తనలోని ఈ నైపుణ్యం ద్వారా ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని చూపడానికి అర్చిష్మాన్ సిద్ధంగా ఉన్నాడు. అచ్చూ.. ఈ ఘనమైన మైలురాయిని అందుకున్న సందర్భంగా నీకు అభినందనలు. నిన్ను చూసి గర్వంగా ఫీలవుతున్నాను’’ అంటూ తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకొచ్చారు హరీశ్ రావు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
May 13 2023, 11:47