రేపే ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి
బెంగళూరు:
కర్ణాటక ఎన్నికల్లో గెలుపోటములపై అన్ని పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్నారు. విజయం మాదంటే మాదేనంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి. ఓటర్లు ఎవరికి పట్టం కడతారో శనివారం మధ్యాహ్నానికి తేలిపోతుంది. ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని, ఓటింగ్ సరళి కూడా కాంగ్రెస్ వైపు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. మరోవైపు, మిశ్రమ ఫలితాలు వస్తే ఏమి చేయాలనే దానిపై అన్ని పార్టీలు చర్చిస్తున్నాయి. మరోసారి జేడీఎస్ కింగ్ మేకర్‌గా అవతరిస్తుందా? అనేది రేపటికల్లా తెలిపోనుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ
హంగ్ వస్తుందని అంచనా వేసిన పలు సర్వేలు
సింగ్‌పూర్‌లో బీజేపీ నేతలతో కుమారస్వామి భేటీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాదని, హాంగ్ ఏర్పడే సూచనలు ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో జేడీ (ఎస్)కు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. పోలింగ్ ముగిసిన వెంటనే కుమారస్వామి తన కుటుంబంతో కలిసి బుధవారం రాత్రి సింగ్‌పూర్ వెళ్లారు. ఏ పార్టీతో కలిసి వెళ్లానే నిర్ణయం ఇప్పటికే తీసుకున్నామని జేడీఎస్‌కు చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. బీజేపీకి చెందిన కొందరు నేతలు జేడీఎస్‌తో ఇప్పటికే ముందస్తు చర్చలు చేపట్టారని సమాచారం.
దీనికి అనుగుణంగా కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లడంతో అక్కడ ప్రధాని మోదీకి సంబంధించిన ప్రతినిధులతోనూ సమావేశమవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ..
ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం.. సరైన సమయంలో దానిని ప్రకటిస్తాం’ అని అన్నారు. అయితే, జేడీఎస్‌ను సంప్రదించినట్టు జరుగుతోన్న ప్రచారాన్ని బీజేపీ కొట్టిపారేసింది. స్పష్టమైన మెజార్టీతో తాము అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.
బీజేపీ నేత శోభా కరంద్లాజే మాట్లాడుతూ.. ‘సంకీర్ణం ప్రశ్నే లేదు.. జేడీఎస్‌ను మేము సంప్రదించలేదు.. పోలింగ్ ముగిసిన తర్వాత కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయిలో అందిన నివేదికలు, సమాచారం ప్రకారం మాకు 120 సీట్లు పక్కాగా వస్తాయి’ అని వ్యాఖ్యానించారు. దీనిపై జేడీఎస్ నేత తన్వీర్‌ను ప్రశ్నించగా.. ప్రభుత్వ ఏర్పాటుపై మాతో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారని పునరుద్ఘాటించారు.
ఇరు పార్టీలు (కాంగ్రెస్, బీజేపీ) మమ్మల్ని సంప్రదించాయి.. ప్రస్తుతం పార్టీలు మా దగ్గరకు వెళ్లాలనుకునే పరిస్థితిలో జేడీఎస్ ఉంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని కర్ణాటక ప్రజలు కోరుకుంటున్నారు.. ఒక ప్రాంతీయ పార్టీ కర్ణాటక అభివృద్ధికి పని చేయకపోవడానికి కారణం లేదని నేను అనుకోను’ అని చెప్పారు.
ఏ పార్టీతో వెళ్తారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. కర్ణాటక, కన్నడిగుల అభ్యున్నతి కోసం కృషి చేసే పార్టీతో కలిసి నడుస్తామని వివరించారు. మీ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో స్పష్టతకు వచ్చారా అని అడిగితే.. ‘మేము లేకుండా ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు.. ఇది మంచి సంఖ్య అని నేను అనుకుంటున్నాన. డబ్బు, బలం, బలగం పరంగా జాతీయ పార్టీల వనరులతో సరిపోలలేం.. మేము బలహీనులం. కానీ మేము ప్రభుత్వంలో భాగం అయ్యేంత పని చేశామని మాకు తెలుసు’ అని పేర్కొన్నారు
May 12 2023, 12:03