మగవాళ్లే టార్గెట్
నగరంలో చైన్ స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. సరికొత్త మార్గాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేస్తూ.. మగవారి మెడలోని బంగారు గొలుసులను తస్కరిస్తున్నారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్ నగరంలో ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువయ్యాయి. నగరంలో తిష్ట వేసిన అంతరాష్ట్ర ముఠాలు పగలు రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇక చైన్ స్నాచర్లు కూడా రెచ్చిపోతున్నారు. ఉదయం వేళలో ఇంటి ముందు మగ్గులు వేసే ఆడవారు, వాకింగ్‌కి వెళ్లేవాళ్లను లక్ష్యంగా చేసుకొని స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
తాజాగా.. స్నాచర్లు సరికొత్త పద్దతుల్లో దొంగతనాలకు తెరతీశారు. రద్దీగా ఉన్న బస్సులను టార్గెట్ చేశారు. అందులోనూ మగవారే వారి లక్ష్యం. ముఠాగా ఏర్పడిన పలువురు స్నాచర్లు రద్దీ బస్సులను టార్గె్ట్ చేసి స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. మగవారి మెడలోని బంగారు గొలుసు, బ్రాస్లెట్‌లు స్నాచింగ్ చేస్తు్న్నారు. ఇటీవల కాలంలో నగర వ్యాప్తంగా బాధితులు పోలీసులను ఆశ్రయించటంతో స్నాచింగ్ ముఠా గుట్టు వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని కొందరు పాత నేరస్థులు కాంబ్లే లక్ష్మణ్ నేతృత్వంలో ఒక ముఠాగా ఏర్పాడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ చైన్ స్నాచర్లు కేవలం రష్‌గా ఉన్న బస్సులను మాత్రమే టార్గెట్‌గా చేసుకొని చోరీలకు పాల్పడుతున్నారు. అందులోనూ ఆడవారి జోలికి వెళ్లకుండా బస్సుల్లో ప్రయాణించే మగవారి మెడలో ఉన్న బంగారు గొలుసులు, చేతులకు ఉండే బ్రాస్లెట్‌లను దోచుకుంటున్నారు. రష్‌గా ఉన్న బస్సులో ముందుగా ప్రయాణికుల మాదిరిగా ఎక్కుతారు. కొందరు బస్సు మధ్యలో మరికొందరు ఫుట్‌బోర్డుల్లో ప్రయాణిస్తారు.
బస్సు మధ్యలో ఉన్న వారు అటూ ఇటూ తిరుగుతూ.. ఎవరి మెడలో బంగారం ఉందనే దానిపై రెక్కీ నిర్వహిస్తారు. అనంతరం మెల్లిగా వారి మెడలోంచి బంగారు ఆభరణాలు స్నాచింగ్ చేస్తారు. అనంతరం వాటిని ఫుట్‌బోర్డులో ఉండేవారికి అందిస్తారు. వారు మధ్యలోనే దిగి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. ఒకవేళ గోల్డ్ చైన్ పోయిందని ఎవరైనా గుర్తించినా.. వారికి అనుమానం రాకుండా జాగ్రత్తలు పడతారు. గత కొంత కాలంగా నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, హుమాయున్ నగర్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి.
May 12 2023, 09:38