ప్రియాంక గాంధీ తెలంగాణలో పోటీ చేయనున్నారా ❓️
తెలంగాణలో గులాబీ పార్టీ హ్యాట్రిక్ కొట్టకూడదు.. ఎట్టి పరిస్థితుల్లో, ఏం చేసైనా సరే కేసీఆర్‌ను గద్దె దించాల్సిందే.. బీఆర్ఎస్ కారుకు బ్రేక్‌లు వేసి చావు దెబ్బ రుచి చూపించాలి.. ఇదే కాంగ్రెస్, బీజేపీ పార్టీల ముందున్న ముందున్న ఏకైక లక్ష్యం. ఇందుకు ఇరు పార్టీలు శక్తికి మించి మరీ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఢిల్లీ పెద్దలు మోదీ, అమిత్ షా డైరెక్షన్‌లో కమలనాథులు.. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్, గాంధీ కుటుంబం చరీష్మాతో పూర్వవైభవం తీసుకొచ్చి అధికారంలోకి రావాలని నేతలు తహతహలాడుతున్నారు. సరిగ్గా ఇదే టైమ్‌లో తెలంగాణ నుంచే ప్రియాంక గాంధీని పోటీ చేయించాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు.. సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు చెవిన వేసినట్లు తెలుస్తోంది. ఎక్కడ్నుంచి పోటీ చేయించవచ్చు..? ఎంపీ అయితే బాగుంటుందా..? ఎమ్మెల్యే అయితే బాగుంటుందా..? అని సమాలోచనలు కూడా చేశారట.
ఇందుకు రెండు నియోజకవర్గాలను ఎంపిక చేశామని.. ఎంపీగా అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని వివరించారట. మహబూబ్‌నగర్ లేదా మెదక్ నుంచి పోటీ చేయించాలని ఏఐసీసీ భావిస్తున్నట్లు ఇటు తెలంగాణలో.. అటు ఢిల్లీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ప్రియాంకను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకురావడం వల్ల ఇక్కడ రాజకీయ సమీకరణలు మార్చవచ్చన్నది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లానట. ఒక్కమాటలో చెప్పాలంటే.. ప్రియాంకను ‘ఫేస్ ఆఫ్ ది తెలంగాణ కాంగ్రెస్’ అని రాష్ట్ర నేతలు భావిస్తున్నారట.
అటు నుంచి ఇటు..!
కర్ణాటకలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు ఉన్నాయని అగ్రనేతలు గట్టిగా నమ్ముతున్నారు. మరోవైపు బీజేపీ కూడా కచ్చితంగా కాషాయ జెండా ఎగరేస్తామని కమలనాథులు ధీమాగా చెబుతున్నారు. ఇక్కడ ఎన్నికలు పూర్తవ్వగానే ఈ రెండు పార్టీలకు టార్గెట్ తెలంగాణ మాత్రమే. అక్కడ.. ఇక్కడ తాడేపేడో తేల్చుకోవాలని జాతీయ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే జాతీయ స్థాయి నేతలు తెలంగాణ నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నారట. ఇప్పటికే ప్రధాని మోదీ మహబూబ్‌నగర్ నుంచి పోటీచేస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సోనియాగాంధీ కూడా మల్కాజిగిరి నుంచి పోటీచేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏకంగా ప్రియాంక గాంధీ గురించి వార్తలు గుప్పుమంటున్నాయి. మెదక్ లేదా మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న ఇందిరాగాంధీ 1980లో మెదక్ నుంచి ఎంపీగా పోటీచేసి విజయకేతనం ఎగురవేశారు. అప్పటికే అత్యవసర పరిస్థితితో విమర్శలపాలైన ఇందిరమ్మను మెదక్ ప్రజలు అక్కున చేర్చుకోవడంతో ఈ విజయం పెను సంచలనమే అయ్యింది. అందుకే నాన్నమ్మ బాటలో.. ఇక్కడ్నుంచే ప్రియాంకను పోటీ చేయిస్తే కాంగ్రెస్‌కు కలిసొస్తుందని ఏఐసీసీ ప్లాన్ చేస్తోందట. బీజేపీని ఢీ కొట్టలేక చతికిలపడుతున్న కాంగ్రెస్‌కు ప్రియాంక రూపంలో ఊపిరిపోయాలని హైకమాండ్ అనుకుంటోందట.
అంతా ముందస్తుగానే..!
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటించడం పక్కా వ్యూహమేనట. రానున్న రోజుల్లో తెలంగాణ ఇంచార్జ్‌గా నియమించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదట. సరూర్‌నగర్ పర్యటన జస్ట్ శాంపిల్ మాత్రమేనని.. మున్ముందు ఇక నెలలో రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించేలా హైకమాండ్ ప్లాన్ చేస్తోందట. ఇప్పుడు యువత, నిరుద్యోగులు.. రానున్న రోజుల్లో రైతులు, ఆ తర్వాత ఉద్యమకారుల ఇలా ఒక్కో పర్యటనలో ఒక్క వర్గానికి సంబంధించి సభ ఉండబోతోందట. అయితే.. ఇటు ఇంచార్జ్.. అటు తెలంగాణ నుంచి పోటీ ఇవన్నీ ఒక్కసారిగా వార్తలు రావడంతో అసలు ఇందులో ఏది నిజమో తెలియక కార్యకర్తలు, వీరాభిమానులు తికమకపడుతున్నారు. వాస్తవానికి ప్రియాంక ఇదిగో ఫలానా చోటు నుంచి పోటీచేస్తారని వార్తలు ప్రతిసారి వస్తున్నాయే తప్పితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె ఎప్పుడూ బరిలోకి దిగలేదు. బాధ్యతలు మాత్రం పెద్దవే ఉన్నప్పటికీ పోటీ మాత్రమే ఎక్కడా చేయలేదు. ఇప్పుడు యువనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన తర్వాత కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఆప్షన్ ప్రియాంకేనని కార్యకర్తలు, వీరాభిమానులు చెప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో అది కూడా వయనాడ్ నుంచి ప్రియాంక పోటీచేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఆ ఊసేలేదు. ఒకవేళ పోటీచేయాల్సి వస్తే వయనాడ్, తెలంగాణ నుంచి ఒక స్థానంలో.. రెండుచోట్లా పోటీచేయించాలనేది హైకమాండ్ ప్లానట. ఆడబిడ్డ పైగా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా.. ఇందిరమ్మను ఇందిరమ్మ
ప్రియాంక రూపంలో చూసుకుని జనాలు గెలిపిస్తారని రాష్ట్ర పెద్దలు ధీమాతోనే ఉన్నారట.
May 11 2023, 10:34