ఆల్ సో మేష్ కుమార్
అంతా ఆయనొక్కడే
మూడు నెలల విరామంతో సీఎస్ సోమేశ్ కుమార్ మళ్లీ ప్రభుత్వంలోకి ఎంట్రీ అయ్యారు. సీఎస్‌గా పని చేస్తున్న సమయంలో జనవరి రెండోవారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏపీకి వెళ్లారు. అక్కడ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో వీఆర్ఎస్ తీసుకున్నారు.
కాగా, సోమేశ్ కుమార్ మొదటి నుంచే సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడ్డారు. దీంతోనే కేడర్ విషయంలో న్యాయస్థానాల్లో కేసులున్నా, వాటన్నింటిని పక్కన పెట్టి సీఎం ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించారని చర్చ ఉన్నది. ఇప్పుడు ఏదైనా కీలక పోస్టు ఇస్తారనే హామీతోనే సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ తీసుకున్నారని ప్రచారం జరిగింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్ వేదికపై సోమేశ్ ప్రత్యక్షం కావడంతో త్వరలో ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇస్తారని టాక్ నడిచింది.
కీలకం కానున్న సోమేశ్
సీఎం ముఖ్య సలహాదారుడిగా అపాయింట్ కావడంతో సర్కారులో మళ్లీ సోమేశ్ శకం వస్తుందనే ప్రచారం జరుగుతున్నది. ఆయన సీఎస్‌గా పనిచేసినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన కనసన్నల్లోనే జరిగేది. ఆయనకు తెలియకుండా ఏ సెక్రటరీ సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఇప్పుడు సీఎం చీఫ్ అడ్వయిజర్‌గా అపాయింట్ కావడంతో సీఎస్ ఆఫీసు, సీఎంఓ సెక్రటరీల పనితీరుపై ఎఫెక్ట్ పడుతుందేమోనని చర్చ జరుగుతున్నది.
అనధికారిక ప్రొటోకాల్ ప్రకారం సీఎస్ శాంతికుమారి, సీఎంఓ సెక్రటరీలు అందరూ ఇప్పటి నుంచే ఆయన గైడెన్స్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఫైల్‌ను సోమేశ్ కుమార్ పరిశీలించాకే, సీఎం సంతకం కోసం వెళ్లేవిధంగా ఏర్పాట్లు చేస్తారేమోనని టాక్ వినిపిస్తున్నది.
భిన్నాభిప్రాయాలు
సోమేశ్ నియామకంపై అధికారులు, మంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు తీర్పుతో సోమేశ్ ఏపీకి వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న కొందరు అధికారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. అయితే ఆయన నియామకాన్ని స్వాగతించే ఆఫీసర్లు, మంత్రులు కూడా ఉన్నారు. సోమేశ్ హయాంలో సీఎస్ ఆఫీసుకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆయన సీఎస్‌గా ఉండి ఉంటే, సెక్రటేరియట్ ప్రారంభోత్సవంలో ఎంప్లాయీస్‌కు అవమానాలు జరిగేవి కావని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతటి కష్టమైన పనినైనా, ఎంతో దీక్షతో పూర్తి చేసేవారిని మంత్రులు కితాబిస్తున్నారు.
May 10 2023, 11:23