బీఆర్ఎస్ అధినేత పార్లమెంట్ ఎన్నికల్లో నాందేడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారా ❓️
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. రానున్న జనరల్ ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
పార్టీ అధినేత స్వయంగా అక్కడి నుంచి పోటీచేసి గెలిస్తే దాని ప్రభావం మొత్తం రాష్ట్రం మీద ఉంటుందని అక్కడి నేతలు అభిప్రాయపడుతున్నారు. నాందేడ్ సెగ్మెంట్ మీద ఫోకస్ పెట్టినా ప్రత్యామ్నాయంగా ఔరంగాబాద్‌నూ పరిశీలిస్తున్నట్టు తెలిసింది.
మరికొంత విస్తృత అధ్యయనం తర్వాత ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దానిపై కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉన్నది. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత కేవలం మహారాష్ట్రపై మాత్రమే ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఎక్కువగా తెలంగాణకు సరిహద్దుగా ఉన్న నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాల మీదనే దృష్టి సారించారు.
ఆ జిల్లాలకు చెందిన నేతలనే పార్టీలో చేర్చుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు వివిధ పార్టీలకు చెందిన నేతలను వందల సంఖ్యలో బీఆర్ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఎన్సీపీ, శివసేన పార్టీలకు చెందిన నేతలు కూడా వీరిలో ఉన్నారు.
ఇప్పటికే రెండుసార్లు నాందేడ్ జిల్లాలో పబ్లిక్ మీటింగ్స్ పెట్టిన బీఆర్ఎస్.. త్వరలో పొరుగున ఉన్న చంద్రాపూర్ జిల్లాలోనూ బహిరంగ సభను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నది. ఇటీవల జరిగిన బోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఇకపైన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని గులాబీ బాస్ భావిస్తున్నారు.
జాతీయ పార్టీగా గుర్తింపు కోసం..
జాతీయ పార్టీగా బీఆర్ఎస్‌ను తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని మహారాష్ట్ర నుంచే స్టార్ట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తొలుత కర్ణాటక నుంచి బోణీ కొట్టాలని భావించి జేడీఎస్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించినా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరంగానే ఉన్నది. జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం చేయనున్నట్టు ఆ పార్టీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించినా అది మాటలకే పరిమితమైంది. నాందేడ్ నుంచి బీఆర్ఎస్‌కు విస్తృతమైన మద్దతు లభిస్తూ ఉన్నదనే భావనలో గులాబీ బాస్ ఉన్నారు..
May 10 2023, 11:18