ఆరోగ్యానికి ఎండదెబ్బ
42 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు
రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం
పిల్లలు, వృద్ధులు, ఎండలో పనిచేసే వారిపై తీవ్ర ప్రభావం
జాగ్రత్తలు అవసరమంటున్న నిపుణులు
హైదరాబాద్: మే నెల రాకముందే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. హనుమకొండ, కర్నూలు, ఆదిలాబాద్, మెదక్, రామగుండంలలో గరిష్ఠంగా 42.5-43.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటలకే ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది. సాయంత్రం 4 గంటలు దాటినా ఎండ తీవ్రత తగ్గడం లేదు. రాత్రి వేళల్లోనూ వేడి సెగలు ఇబ్బంది పెడుతున్నాయి. పగటిపూట ఇంట్లో ఉన్నా వేడి గాలుల ప్రభావం ఉంటోంది. ఇలాంటి వాతావరణంలో అనారోగ్య సమస్యలు వెంటాడే ముప్పు అధికంగా ఉంది.ఎక్కువమంది వడదెబ్బ బారిన పడుతుంటారు. గతేడాది పలువురు మృత్యువాత పడ్డారు. పనులపై బయటకు వెళ్లే వారు... ఎండలో పనిచేసే కార్మికులు, పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారే ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తీవ్ర ఎండ బారిన పడితే...
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే కొంతసేపటికి నీరసంగా అనిపిస్తుంది. శరీరం నుంచి చెమట రూపంలో నీరు బయటకు పోతుంది. దాంతోపాటు ఖనిజలవణాలు వెళ్లిపోతాయి. దీంతో నిస్సత్తువ ఆవహిస్తుంది. దీనినే డీహైడ్రేషన్ అని పిలుస్తారు. ఇదే వడదెబ్బకు దారి తీస్తుంది. అలాంటప్పుడు శరీరం కోల్పోయిన ఖనిజ లవణాలను భర్తీ చేయాలి. లేదంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శరీరానికి ఉండే సహజ గుణం వల్ల అవసరానికి తగ్గట్లుగా ఒక పరిమితి వరకు ఉష్ణోగ్రతలను నియంత్రించుకోగలదు. ఎండ తగిలినప్పుడు చెమట పట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది. అయితే తీవ్రమైన ఎండకు గురైతే ఇలాంటి వ్యవస్థ దెబ్బతింటుంది. శరీరంలోని వేడిని చెమట రూపంలో బయటకు పంపించే మార్గాలు మూసుకుపోతాయి. ఫలితంగా శరీరంలో వేడి పెరిగిపోయి వడదెబ్బ బారిన పడతారు. ఇలాంటి సమయంలో అత్యవసరంగా రోగికి చికిత్స అందించాలి. లేదంటే ఒక్కొక్కటిగా అన్ని అవయవాలు దెబ్బతిని మృత్యువు బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే...
వెంటనే నీడ ప్రాంతానికి తరలించాలి.
బాధితుడి ఒంటిపై దుస్తులు తొలగించి గాలి తగిలేలా చూడాలి. చల్లని నీళ్లతో తుడవాలి.
వెంటనే ఆసుపత్రికి తరలించాలి.
జ్వరం తగ్గించే పారాసిటమాల్, నొప్పి నివారణ మాత్రలు ఇవ్వకూడదు.
ఈ జాగ్రత్తలు అవసరం...
◾ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా ప్రతి గంటకూ ఓ గ్లాసు నీళ్లు తాగుతుండాలి. మజ్జిగ, ఉప్పు కలిపిన నిమ్మరసం, ఓఆర్‌ఎస్ మరింత మేలు చేస్తాయి. మూత్రం ముదురు పచ్చరంగులో వస్తుంటే శరీరంలో నీరు తగ్గుతోందని గుర్తించాలి. వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
◾వేసవిలో వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి
◾ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది.
◾ఉదయం 7 గంటలలోపే నడక, ఇతర వ్యాయామాలు ముగించాలి.
◾అత్యవసరమై ఎండలోకి వెళ్తే గొడుగు, టోపీ, హెల్మెట్ లాంటివి ధరించాలి
◾ఎండలో పిల్లలను ఆడనీయకూడదు..ఇండోర్ ఆటలే మేలు. ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు చాపలు, దుప్పట్లు లాంటివి కట్టి నీళ్లు పోస్తూ ఉండాలి
◾శీతల పానీయాల వల్ల దాహం తగ్గకపోగా...మరింత పెరుగుతుంది.
◾పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఫిల్టర్లు లాంటివిలేకపోతే కాచిచల్లార్చి వడబోసి తాగాలి.
ఎప్పుడు ప్రమాదమంటే..
జ్వరం 101 డిగ్రీల కంటే ఎక్కువైనప్పుడు..
అయిదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోతే..
చర్మం పొడిబారి వదులుగా మారినప్పుడు
బాగా నీరసం, నిస్సత్తువ ఉన్నప్పుడు..
నాలుక తడారిపోయినప్పుడు.
అధిక రక్తపోటు, మధుమేహ రోగులూ.. తస్మాత్ జాగ్రత్త
వడదెబ్బ విషయంలో అధిక రక్తపోటు, మధుమేహ రోగులు మరింత జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బీపీ మాత్రల్లో శరీరంలోని నీటిని తగ్గించే గుణం ఉంటుంది. దీనివల్ల రక్తంలో నీరు, సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. నియంత్రణ లేని మధుమేహం వల్ల శరీరం ద్వారా నీరు బయటకు పోతుంది. ఇలాంటి వారికి వడదెబ్బ ముప్పు ఎక్కువే. అందుకే వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవాలి. మానసిక సమస్యలు, పార్కిన్‌సన్స్ (వణుకుడు వ్యాధి)కు మందులు తీసుకునే వారిలో చెమట తగ్గుతుంది. దీంతో శరీరంలో వేడి పెరిగి వడదెబ్బకు గురవుతారు. ఇలాంటి వారు, వైద్యులను సంప్రదించి మందుల మోతాదులను మార్చుకోవాలి. వడదెబ్బ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
డాక్టర్ ఎంవీ రావు, జనరల్ ఫిజీషియన్
నవజాత శిశువులు, గర్భిణులకు డీహైడ్రేషన్ ముప్పు
నవజాత శిశువులు అధిక చలి, వేడిని తట్టుకోలేరు. వేడి వాతావరణంలో డీహైడ్రేషన్ సమస్య ఎదురై ఫిట్స్, కిడ్నీ వైఫల్యం లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. శరీరంపై వేడికి పొక్కులు వస్తాయి. వేసవిలో చంటి పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎండలో ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ కాలంలో పిల్లల్లో ఎక్కువగా డయేరియా వచ్చే అవకాశం ఉంది. తాగే నీళ్లు, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చంటి పిల్లలు డీహైడ్రేట్ కాకుండా తల్లి పాలను అందించాలి. పెద్ద పిల్లలకు నీళ్లు, నిమ్మరసం, ఓఆర్‌ఎస్, కొబ్బరి నీళ్లు అందిస్తూ ఉండాలి. ఎండలో ఆడనీయకూడదు. గర్భిణులు ఆసుపత్రి, ఇతర పనులు ఉంటే ఉదయం.. లేదంటే సాయంత్రం 5 గంటల తర్వాత చూసుకోవాలి.
డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి
తాజా ఆహారమే తీసుకోవాలి...
వేసవిలో వేడి తీవ్రతకు ఆహారం త్వరగా పాడవుతుంది. ఎప్పటికప్పుడు వండుకొని తాజాగా తినడమే మేలు. నీళ్ల శాతం ఎక్కువగా ఉండే బీర, సొరకాయ, దోసకాయ లాంటివాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. నూనె, మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. పుదీనా, అల్లం వేసిన మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, టమాటా, ఉల్లిపాయలతో చేసిన సలాడ్లు, విటమిన్ సి ఉండే పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు మజ్జిగ, తక్కువ షుగర్ ఉండే పండ్లు, గ్రీన్ టీ, లెమన్‌టీ, మొలకలు, బీరకాయ, సొరకాయతో చేసిన కూరలు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి వడదెబ్బ బారిన పడే ప్రమాదం లేకపోలేదు.
సుజాత స్టీఫెన్, పోషకాహార నిపుణులు
Apr 22 2023, 09:24