భావప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి
•'ఫ్యాక్ట్ చెకింగ్' యూనిట్ ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 6 నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు లేఖ
•ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్
సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆన్‌లైన్ కంటెంట్ కట్టడికి ఐటీ నిబంధనల్లో సవరణలు చేస్తూ భావ స్వేచ్ఛపై నిఘా విధిస్తూ 'ఫ్యాక్ట్ చెకింగ్' యూనిట్ ఏర్పాటు చేస్తూ ఏప్రిల్ 6 నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని ఐటీ మంత్రిత్వ శాఖకు వ్రాసిన లేఖలో ఉద్యోగుల, ఆఫీసర్ల, పెన్షనర్ల జాతీయ నేత వి.కృష్ణ మోహన్ అభ్యర్థించారు.
ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు, ఇతర వాస్తవాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకొచ్చే మీడియాను ప్రభుత్వం నయానో, భయానో బెదిరించి కట్టడి చేస్తున్నదని, భారత్‌లోని జర్నలిస్టులకు భద్రత లేదనీ, పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందని పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు సైతం స్పష్టం చేసిన విధానమే ఇందుకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.
విమర్శలను సహించని కేంద్రం, ప్రభుత్వంపై వచ్చే 'ఫేక్ న్యూస్' గుర్తింపు పేరుతో ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి వివిధ చర్యలు తీసుకుంటున్నది. సామాన్య పౌరుడు సైతం తన భావాలను పంచుకోగలిగే సోషల్ మీడియానూ, ఆన్‌లైన్ కంటెంట్‌ను నియంత్రించడానికి, ప్రభుత్వం గురించి వచ్చే 'ఫేక్' వార్తల కట్టడి పేరుతో ఆంక్షలకు దిగుతున్నది. ఆన్‌లైన్‌లో పోస్ట్ అయిన 'తప్పుడు' సమాచారాన్ని గుర్తించేందుకు ''ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్''ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలు, ఇతర మధ్యవర్తులు.. అప్‌లోడ్ చేయబడిన కంటెంట్ ''ఫేక్ లేదా తప్పుదారి పట్టించేదిగా ఉన్నది'' అని ఫ్యాక్ట్ చెకింగ్ టీమ్ గుర్తిస్తే సదరు సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ.. సమాచార సాంకేతిక (ఐటీ) నిబంధనలు, 2021లో జరిగిన సవరణలను గురువారమే నోటిఫై చేసిందని తెలిపారు.
అనేక వార్తల విషయంలో ''ఫేక్ ముద్ర'' వేయడం ద్వారా నకిలీ వార్తలను గుర్తించే విషయంలో కేంద్ర సమాచార విభాగం అనేక సందర్భాల్లో విమర్శలను ఎదుర్కొన్నది. ఆ తర్వాత అధికారులే స్వయంగా ధృవీకరించారు. అలాగే, కేంద్రాన్ని విమర్శిస్తూ వచ్చే వార్తలను తిరస్కరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా విమర్శలను ఎదుర్కొన్నది. అయితే, సదరు వార్తలు అవాస్తవాలు అన్నదానిపై ఎలాంటి నిజ నిర్ధారణ లేకుండానే ఈ విధమైన చర్యలకు దిగడంతో ప్రతిష్టను దిగజార్చుకున్నది. ఇలాంటి తరుణంలో ఏర్పాటయ్యే 'ఫ్యాక్ట్ చెకింగ్' టీం స్వతంత్రంగా పని చేస్తుందనడానికి నమ్మకం ఏమిటని ప్రశ్నించారు. ఇది సోషల్ మీడియాలో స్వతంత్రంగా పని చేసే వ్యక్తులు, సంస్థల గొంతు నొక్కే చర్యగా అభివర్ణించారు.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) లేదా నిజ నిర్ధారణ కోసం ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఇతర ఏ ఏజెన్సీ ద్వారానైనా ''ఫేక్ న్యూస్'' అని గుర్తించబడితే సదరు పోస్టును తొలగించాల్సి ఉంటుందని జనవరిలో సదరు మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ రూల్స్‌లో ప్రచురించింది.
ప్రభుత్వంలోని ఏదైనా యూనిట్‌కు అలాంటి ఏకపక్ష, విస్తృత అధికారాలు కేటాయించడం సహజ న్యాయ సూత్రాలను దాట వేస్తుందని ఈ సవరణలు దేశంలో పత్రికా స్వేచ్ఛకు లోతైన ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసారు. ఇదంతా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమనీ, సెన్సార్‌షిప్‌కు సమానమని వి. కృష్ణ మోహన్ వివరించారు.
పీఐబీ ద్వారా నకిలీ వార్తలుగా భావించే పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కోరడం ప్రమాదకరమైన ఉదాహరణ అని పేర్కొన్నారు. ఈ సవరణలను వెనక్కి తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో సెన్సార్‌షిప్‌నకు చోటు లేదని పేర్కొన్నారు.
వి. కృష్ణ మోహన్
నేషనల్ వైస్ చైర్మన్,
కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)
9440668281
ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ పర్సన్స్ Krishna Mohan
National Vice Chairman,
Confederation of Central Government Gazetted Officers Organisations
(CCGGOO)
9440668281
All Pensioners & Retired Persons Association Reception Committee Dy. General Secretary
Apr 09 2023, 08:41