ఖరీఫ్ రైతులకు ప్రభుత్వం చేదువార్త
పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
ఖరీఫ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం చేదు వార్త వినిపించింది. ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వబోమని తెలిపింది. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తెలిపారు. రైతు భరోసాకు బదులుగా ప్రతీ సన్న ధాన్యం పండించిన రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తామని తుమ్మల ప్రకటించారు. పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయన తెలిపారు. వ్యవసాయం చేయని వారికి రైతు భరోసా ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
’ఈ ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేము. మార్పులకు అనుగుణంగా రైతులను మారుస్తాం. ఆర్థిక వెసులుబాటు లేకపోయినా ముఖ్యమంత్రి రుణమాఫీ అంశాన్ని తన భుజాన వేసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో 70 వేల కోట్ల రుణమాఫీ చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాం. 42 బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేసాం. రాష్ట్రంలో 42 లక్షల లబ్ధిదారులకు, 25 లక్షల కుటుంబాలకు 31 వేల కోట్లు అవసరం. 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15నే చేశాం. 20 లక్షల మందికి ఇంకా రుణమాఫీ చేయాల్సి ఉంది. 2 లక్షల పైన ఉన్న డబ్బులు కడితే రుణమాఫీ అవుతుంది. తెల్ల రేషన్ కార్డు లేని 3 లక్షల మందికి డిసెంబర్ లో కుటుంబ నిర్ధారణ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తాం. 2500కోట్ల రూపాయలు వేస్తాం. రుణ విముక్తి కావాలంటే కొత్త రుణాలు రావు‘‘ అని తుమ్మల వ్యాఖ్యానించారు.
2 లక్షల పైన ఉన్న రుణాల వారి అంశం క్యాబినెట్ లో చర్చిస్తామని తెలిపారు. పంటల బీమా గతంలో లేకపోయినప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రతీ రైతు పంటకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని, రాష్ట్రంలో పండే అన్ని పంటలను ఎంఎస్పీ ప్రకారమే కొనుగోలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన అన్ని పంటలను కేంద్రం కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు 20% కేంద్రం కొనుగోలు చేస్తుందని తుమ్మల అన్నారు.
ఈ సందర్భంగా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు 2 లక్షల రైతు రుణమాఫీ ఎక్కడా చేయలేదని ఆ ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు. వ్యవసాయ రంగం, రైతుల విషయంలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలు అమలు చేసితీరుతామన్నారు. రాష్ట్రంలో కొత్త శకం స్టార్టైంది. రాబోయే రెండేళ్లలో అనేక మార్పులు తీసుకు వస్తామని కోదండరెడ్డి తెలిపారు.
Oct 20 2024, 14:49