అదానీ గొప్ప మనసు.. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ భారీ విరాళం ప్రకటించింది. స్కిల్ యూనివర్సిటీకి ఏకంగా రూ.100 కోట్ల విరాళం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన చెక్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు.
దిగ్గజ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ గొప్ప మనసు చాటుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భారీ విరాళం ప్రకటించారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ఫౌండేషన్ ద్వారా రూ.100 కోట్ల విరాళం ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రూ.100 కోట్ల విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం హైదరాబాద్‌లో అందజేశారు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లో శుక్రవారం కలిశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రకటించిన రూ.100 కోట్ల చెక్కును అందజేశారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ గొప్ప ప్రయత్నానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా అదానీ హామీ ఇచ్చారు.' అని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతకుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. ఆయన ఈ పదవిలో ఏడాది పాటు కొనసాగుతారని గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చర్ల, బేగరికంచె ప్రాంతంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం చేపడుతోంది ప్రభుత్వం. మొత్తం 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేట్ సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ప్రతి ఏడాది లక్ష మందికిపైగా శిక్షణ ఇచ్చేలా రానున్న రోజుల్లో ఈ స్కిల్ యూనివర్సిటీని విస్తరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవంతిలో ఈ స్కిల్ యూనివర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
Oct 18 2024, 19:37