కెనడాలో ఇదీ భారతీయం
వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం
వైశాల్యం పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం కెనడా.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్..! ఖలిస్థానీ మద్దతుదారు నిజ్జర్ హత్య నేపథ్యంలో ప్రస్తుతం ఈ రెండింటి మధ్య తీవ్ర స్థాయి దౌత్య యుద్ధం జరుగుతోంది. అయితే, దీన్ని పక్కనపెడితే కెనడాలో భారతీయులది బలమైన సమాజం. పలు రంగాల్లో మనవారు స్థిరపడ్డారు. ఆ వివరాలు గణాంకాల్లో..
20 ఏళ్లలో కెనడాలో భారతీయుల సంఖ్య రెట్టింపును మించింది.
1980 వరకు భారత్‌లో పుట్టి కెనడా వెళ్లినవారు 63,535. 1991-2000 మధ్యన ఈ సంఖ్య 1.45 లక్షలు. 2006-10 నడుమ 1.19 లక్షలు. 2016-21 మధ్య 2.46 లక్షలు.
ఐదేళ్లలో డబుల్: 2019లో కెనడాలోని భారతీయ విద్యార్థుల సంఖ్య 2.18 లక్షలు కాగా, ప్రస్తుతం 4.27 లక్షలు.
పౌరసత్వంలో పైపైకి..: కెనడా పౌరులుగా మారుతున్న భారతీయుల సంఖ్య ఏటా భారీగా పెరుగుతోంది. ఈ శాతం 2017లో 44.3 కాగా.. 2021లో 61.1 శాతం.
అక్కడ మన వారి జాబ్ ప్రొఫైల్ కూడా బాగుంటోంది. మెరుగు పడుతోంది కూడా. ప్రవాసుల్లో 50 శాతం మంది డిగ్రీ హోదాతో కూడిన ఉద్యోగాలు చేస్తున్నారు. మొత్తమ్మీద కార్యనిర్వాహక (మేనేజీరియల్) పోస్టుల్లో 10 శాతం లోపే ఉన్నారు. అయితే, ఇటీవల వెళ్లినవారిలో 19శాతం మంది ఈ పోస్టులు పొందారు.
భారత్‌కు పప్పు ధాన్యాలు అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం కెనడా.
భారత్ నుంచి బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలు, ఫార్మా ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు అధికంగా కెనడాకు ఎగుమతి అవుతుంటాయి.
600 పైనే: భారత్‌లో ఉన్న కెనడాకు చెందిన కంపెనీలు. వీటిలో టిమ్ హర్టన్స్ కాఫీ చైన్, శీతల ఆహార పదార్థాల సంస్థ మెక్ కెయిన్ కూడా ఉన్నాయి. 75 బిలియన్ అమెరికా డాలర్లకు పైగా కెనడియన్ పింఛను నిధులను భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.
27% కెనడాలోని శాశ్వత నివాసితుల్లో భారతీయులు. కెనడా పీఆర్ స్కీంలో మనవారే ప్రధాన లబ్ధిదారులు.
22 %గత ఏడాది కెనడా వెళ్లిన తాత్కాలిక విదేశీ కార్మికుల్లో భారతీయులు. రెండో అత్యధికం వీరే.
45% విదేశీ విద్యార్థుల్లో భారతీయులు. మరే దేశం నుంచి ఈ స్థాయిలో విద్యార్థులు లేరు.
28 లక్షలు: కెనడాలోని భారతీయులు. వీరిలో ప్రవాసులు, భారత సంతతివారూ ఉన్నారు. ప్రపంచంలో భారతీయులు అధికంగా ఉన్న నాలుగో దేశం. ఇందులో 18 లక్షలు భారత సంతతివారు. 10 లక్షల మంది ప్రవాసులు.
8.30 లక్షలు: కెనడాలోని హిందువులు. 7.70 లక్షలు: సిక్కులు
6: వాంకోవర్, టొరంటో, మాంట్రియల్, విన్నీ పెగ్,
ఒట్టావా (ఒంటారియో), కాల్గారి (అల్బెర్టా). ప్రవాసులు అధికంగా నివసించే ప్రాంతాలు.
Oct 18 2024, 12:09