మట్టే బంగారమాయెనే..
అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం, మంచాల్, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్ అండ్ జియాలజీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
అబ్దుల్లాపూర్‌మెట్, యాచారం, మంచాల్, ఇబ్రహీంపట్నం మండలాలలో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని రంగారెడ్డి జిల్లా మైన్ అండ్ జియాలజీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఎం. నర్సిరెడ్డి రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మట్టికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి కోహెడ గ్రామంలో మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయంటూ పలువురు ఆగస్టులో జిల్లా మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మైనింగ్ ఆపాలని సెప్టెంబర్ 9వ తేదీన అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగినా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్ చేయాలని అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాల తహసీల్దార్‌లను ఆదేశించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మట్టి తవ్వకాలు నిలిపి వేయడంతో లారీల యజమానులు ఇతర ప్రాంతాల నుంచి మట్టిని నగరానికి తరలిస్తున్నారు. అయితే దాదాపు రెట్టింపు ధర తీసుకుంటున్నారు. ప్రధానంగా మహేశ్వరం నియోజకవర్గం, యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి, తూఫ్రాన్‌పేట్, సరళ మైసమ్మ, రాచకొండ గుట్టలు, మల్కాపురం, మునుగోడు, దేవరకొండ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకొస్తున్నారు.
మైనింగ్ శాఖ మట్టి తవ్వకాలను ఆపివేయడంతో కొరత ఏర్పడడంతో ధర పెరిగింది. గతంలో 300 ఫీట్ల లారీ మట్టికి రూ. 3,500 తీసుకునే వారు, ప్రస్తుతం రూ. 6,500 వరకు తీసుకుంటున్నారు. 600 ఫీట్ల లారీకి రూ. 6,500 తీసుకుంటుండగా ఇప్పుడు రూ. 10 వేలు తీసుకుంటున్నారు. 12 టైర్ల లారీ మట్టికి రూ. 10 వేలకుగాను ప్రస్తుతం రూ. 15 వేలు తీసుకుంటున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి మట్టి తరలిస్తున్న లారీలను పోలీసులు టార్గెట్‌గా చేసుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు లారీల యజమానులు ఆరోపిస్తున్నారు. లారీకి సుమారు రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. ప్రశ్నిస్తే.. వే బిల్లు చూపించమంటున్నారని వాపోయారు. కంకర లారీలను వే బిల్లులు అడగడం లేదంటున్నారు. తమకు వచ్చే లాభం పోలీసుల పరం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Oct 17 2024, 15:43