ట్విస్ట్ ఇచ్చిన ఆమ్రపాలి సహా ఆ ఇద్దరు.. క్యాట్‌లో పిటిషన్.. సీఎం రేవంత్ రంగంలోకి దిగుతారా..?
తెలంగాణలో కొనసాగుతోన్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం.. ఉత్తర్వులు జారీ చేయగా.. కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీలో రిపోర్ట్ చేసేందుకు మరో రెండు రోజులే ఉండగా.. తాము మాత్రం తెలంగాణలోనే ఉంటామంటూ క్యాట్‌ను ఆశ్రయించారు. తమకు ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలంటూ క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ఆమ్రపాలి సహా ఇద్దరు ఐఏఎస్‌లు పిటిషన్లు దాఖలు చేయగా.. రేపు విచారణ జరగనుంది.
తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు ఐఏఎస్‌లు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT)ను ఆశ్రయించారు. ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, సృజన, వాణి ప్రసాద్ వేర్వేరుగా క్యాట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలని డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి.. తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమ్రపాలితో పాటు వాకాటి కరుణ, వాణి ప్రసాద్ క్యాట్‌కు విజ్ఞప్తి చేశారు. ఇక.. తనను ఏపీలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఐఏఎస్ సృజన కూడా క్యాట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్‌లు వేసిన పిటిషన్లపై రేపు (అక్టోబర్ 15న) క్యాట్ విచారణ చేపట్టనుంది.
అయితే.. తమను తెలంగాణ కేడర్‌లోనే కొనసాగించాలంటూ 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. 11 మంది అధికారులు వెంటనే సొంత రాష్ట్రంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. తనకు తెలంగాణ కేడర్ కావాలని ఆమ్రపాలి కేంద్రానికి విజ్ఞప్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె విజ్ఞప్తిపై సమీక్షించిన డీఓపీటీ.. తెలంగాణ కేడర్‌ను కేటాయించే ప్రసక్తే లేదంటూ తేల్చి చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే క్రమంలోనే.. తెలంగాణ విద్యుత్ శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్‌కు కూడా ఇవే ఆదేశాలు ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జోక్యంతో కేంద్రాన్ని ఒప్పించేందుకు ఐఏఎస్‌లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కూడా స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో.. ఆమ్రపాలి కోసం సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతారా అన్న ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.
2014 ఏపీ విభజన తర్వాత.. తెలంగాణ కేడర్ కావాలని కేంద్రాన్ని 11 మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కేంద్రాన్ని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో ఆలిండియా సర్వీసెస్ అధికారుల మార్పులను చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడిచిన 10 సంవత్సరాలలో డీఓపీటీకి సంబంధించి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటేషన్ మీద పని చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో పని చేస్తున్న 11 మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు తక్షణమై రిలీవ్ అయి తమ కేడర్ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఇటీవల ఢిల్లీలో జరిగిన డీఓపీటీ సమావేశానికి ఈ అధికారులంతా హాజరుకాగా.. సొంత రాష్ట్రాలకు వెళ్లలేమని పిటిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో.. ఆ పిటిషన్ క్యాన్సిల్ అయింది. కానీ.. కేంద్రం మాత్రం సొంత రాష్ట్రాలకు వెళ్లాల్సిందే అంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారు ప్రస్తుతం కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
Oct 14 2024, 20:37