Medaram Jatara: మేడారంలో ఎక్కడ చూసినా జనసంద్రం.. దారులన్నీ అటువైపు
మేడారం కిక్కిరిసింది.. జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు తలపిస్తున్నాయి. నేడు మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క-సారలమ్మల భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు..
దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.
కాగా మేడారం మహాజాతరకు సర్వం సన్నద్ధమైంది. నేడు (బుధవారం) సారలమ్మర రాకతో నాలుగు రోజుల జాతర షురూ అయ్యింది. ఈ మేరకు ఈ రోజు తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఇక ఈ రోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారలమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారలమ్మను (సారయ్య రూపంలో) ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు.
ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మహాజాతర మొదలవనున్న వేళ మేడారం ఇప్పటికే జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ అటువైపే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది.
Feb 21 2024, 17:42