సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటక స్థలాన్ని సందర్శించిన: సి పి రెమా రాజేశ్వరి

పెద్దపెల్లి జిల్లా లోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బితం వాటర్ ఫాల్స్ పర్యాటక స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి శనివారం రోజు సందర్శించారు.

ప్రమాదాల నియంత్రణకు చేపట్టిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.చనిపోయిన మానుపాటి వెంకటేష్ ప్రమాదం గల కారణాలు అదికారులను అడిగి తెలుసుకొన్నారు. వెంకటేష్ బాడీ బయటకు తీయడానికి సహకరించిన మాదాసు శ్రీనివాస్, ఆకుల గట్టయ్య లను ఆమె అభినందించారు.

వారిని సత్కారించి అభినందించాలని అధికారులను ఆదేశించారు. రెమా రాజేశ్వరి ఆ ప్రాంత స్థానికులతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ ప్రాంత యువకులు,

ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆమె కోరారు. వాటర్ ఫాల్స్ వద్ద నీటి ప్రవాహం ఉధృతంగా ఉందని, ప్రజలను సందర్శనకు అనుమతి ఇవ్వడం లేదని ఆహ్లాదం కోసం వచ్చి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.

సీపీ వెంట పెద్దపెల్లి డిసిపి వైభవ్ గైక్వాడ్ ఐపిఎస్., పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ ,గోదావరిఖని ఏసిపి తులా శ్రీనివాసరావు, పెద్దపల్లి సీఐ అనిల్ కుమార్, మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ సతీష్, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, బసంత్ నగర్ ఎస్సై వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు......

కరీంనగర్‌ జిల్లాలో ఈటల పర్యటన.. బీఆర్‌ఎస్ సర్కార్‌పై నిప్పులు

కరీంనగర్ జిల్లా :జులై 29

జిల్లాలోని జమ్మికుంట, ఇల్లంతకుంట, మండలాల్లో శనివారం రోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు.

వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టులను ఈటల పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, అంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగిన బాధితులను పరమార్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ...

ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువని విమర్శించారు.

బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని.. పరిహారానికి మాత్రం దిక్కు లేదన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25 వేలు ఆందజేయాలని డిమాండ్ చేశారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలన్నారు.

చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయన్నారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని.. కానీ చేతల్లో మాత్రం ఏమీ చెయ్యరని ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈనెల 31న క్యాబినెట్‌ సమావేశం

రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించనున్నారు.

రాష్ట్ర క్యాబినెట్‌లో దాదాపు 40 నుంచి 50 అంశాలపై చర్చించనున్నారు. అందులో భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు,

ప్రభుత్వ చర్యలపై, వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ, అనుసరించాల్సి ప్రత్యామ్నాయ విధానాలపై సమీక్షిస్తారు. ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టంపై అంచనాలను సిద్ధంచేసి,

యుద్ధప్రాతిపదికన రోడ్లను పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై ప్రణాళికలను రూపొందించనున్నారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై క్యాబినెట్‌లో చర్చించి తగిన నిర్ణయం తీసుకోనున్నారు.

దీంతోపాటు ఆగస్టు 3 నుంచి జరగనున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, అందులో చర్చించాల్సిన అంశాలను క్యాబినెట్‌లో నిర్ణయించనున్నారు...

Manipur: మణిపుర్‌లో 'ఇండియా' బృందం.. శాంతిని నెలకొల్పడానికేనంటూ వ్యాఖ్య

ఇంఫాల్‌: కల్లోలిత మణిపుర్‌(Manipur)లో ప్రతిపక్షాల కూటమి 'ఇండియా'(opposition alliance INDIA)కు చెందిన ఎంపీలు పర్యటిస్తున్నారు. అక్కడి క్షేత్రస్థాయి స్థితిగతులను పరిశీలించనున్నారు..

అలాగే కొద్దికాలంగా పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతోన్న మైతేయ్‌, కుకీ వర్గాలకు చెందిన ప్రజలతో మాట్లాడనున్నారు. శాంతియుత పరిష్కారం కనుగొనేందుకే తాము ఇక్కడకు వచ్చినట్లు కాంగ్రెస్ నేత అధిర్‌ రంజన్‌ చౌధరీ అన్నారు.

21 మంది సభ్యులతో కూడిన ఆ బృందం దిల్లీ నుంచి విమానంలో ఇంఫాల్‌(IMPHAL)కు చేరుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా వారంతా హెలికాప్టర్‌లో చురాచాంద్‌పుర్‌కు వెళ్తారు.

ఒకటే హెలికాప్టర్ అందుబాటులో ఉండటంతో రెండు బృందాలుగా ఏర్పడి అక్కడకు చేరుకోనున్నారు. అక్కడి పునరావాస కేంద్రాల్లోని కుకీ వర్గ ప్రజలతో మాట్లాడనున్నారు. అలాగే బిష్ణుపుర్‌ జిల్లాలోని మైతేయ్‌లున్న పునరావాస కేంద్రానికి రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు..

ఆదివారం వారు మణిపుర్(Manipur) గవర్నర్ అనుసూయ ఉకియ్‌తో భేటీ కానున్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సాధ్యమైనంత త్వరగా శాంతి పునరుద్ధరించేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఆమెతో చర్చించనున్నారు. ఇంతకుముందు గవర్నర్ కూడా చురాచాంద్‌పుర్‌ పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఆ సందర్భంగా కొందరు మహిళలు గవర్నర్‌ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ క్రమంలో వారు కన్నీటిపర్యంతమయ్యారు. వారి బాధ విని గవర్నర్ చలించిపోయారు. వారిని దగ్గరికి తీసుకొని ఓదార్చారు. ఈ ఘర్షణల్లో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు..

Tomato: మదనపల్లె మార్కెట్‌లో టమాటా రికార్డు మోత.. కిలో రూ.196

మదనపల్లె : అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. శనివారం కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది..

దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.

మదనపల్లె మార్కెట్‌కు శనివారం కేవలం 253 టన్నుల సరకు మాత్రమే వచ్చింది. బయట ప్రాంతాల్లో దిగుబడి లేకపోవడం,

మదనపల్లె ప్రాంతంలో సీజన్‌ చివరి దశ కావడం వంటి కారణాలతో ధరలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయని వ్యాపారులు, అధికారులు చెబుతున్నారు.

మదనపల్లె మార్కెట్‌లో మొదటి రకం కిలో టమాటా రూ. 160 - రూ. 196, రెండవ రకం రూ.120 - రూ.156 వరకు పలికింది. 25 కేజీల బుట్ట ధర రూ.4500 - రూ 4900తో వ్యాపారులు కొనుగోలు చేశారు..

Bandi Sanjay: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్‌

దిల్లీ: భాజపా జాతీయ కార్యవర్గాన్ని ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి చోటుదక్కింది.

తెలంగాణ భాజపా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)ను కొత్తగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది..

జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ ప్రధాన కార్యదర్శులుగా తరుణ్‌ చుగ్‌, సునీల్‌ బన్సల్‌, కార్యదర్శిగా సత్యకుమార్‌ (ఏపీ)ను కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

అలాగే, పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్‌ సంతోష్‌, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు..

Rottela Panduga: నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తులు

నెల్లూరు..

మతసామరస్యానికి ప్రతీకగా నిలచే రొట్టెల పండుగ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది.. నెల్లూరులోని స్వర్ణాల చెరువు, బారాషహీద్‌ దర్గా వద్ద ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు..

నేటి నుంచి ఐదు రోజులపాటు ఈ రొట్టెల పండుగ జరగనుంది. పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ,

ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. కోరిన కోర్కెలు తీర్చే పండుగగా రొట్టెల పండుగ ప్రసిద్ధి..

కోరికలను కోరుకోవడం.. అవి నెరవేరితే.. మరుసటి ఏడాది రొట్టెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె.. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు.

వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేయడం భక్తుల నమ్మకంగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి ఈ పండుగలో పాల్గొంటారు..

Bhadrachalam : మహోగ్ర రూపం దాల్చిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

భద్రాద్రి కొత్తగూడెం : గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. గోదావరి నీటిమట్టం 54.4 అడుగులు దాటేసింది..

భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్లకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఎటపాక మండలం రాయన్న పేట వద్ద.. నేషనల్ హైవే పై వరద నీరు పోటెత్తింది.

భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా ఛత్తీస్ గడ్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.

ఇక ములుగులో కూడా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది..

తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ

తిరుపతి :జులై 29

వీకెండ్ వచ్చేసింది. నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.కాగా

శుక్రవారం 69,378 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,371 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

వాటర్ ఫాల్స్,పర్యాటక ప్రాంతాలకు అనుమతి లేదు : కమీషనర్ రెమా రాజేశ్వరి

పెద్దపల్లి జిల్లా :జులై 28

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్ట్ లు, డ్యామ్స్ చెరువులు, నాలలు, వాగులు నిండుగా ఉన్నాయి. అట్టి పర్యాటక ప్రాంతాలకు ప్రజలు ఎవ్వరు వెళ్లకూడదని రామగుండం సిపి రెమా రాజేశ్వరి వెల్లడించారు.

పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలియజేసారు.

ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే, స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి పోలీసు వారి సహాయం పొందగలరని తెలిపారు.

ప్రస్తుతం వర్షం కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కమిషనరేట్ పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, నాళాలు, వాగులు నిండుగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు కొంతమంది పోలీస్ వారి హెచ్చరికలు, సూచనలు చేసిన పట్టించుకోకుండా వాహనాలతో వరద నీటి నుండి దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు అట్టి సాహసాలు చేయకూడదని ఆమె కోరారు.

శనివారం,ఆదివారం సెలవులు ఉన్నందున చాలా మంది పర్యాటకులు ఇతర ప్రాంతాల ప్రజలే కాకుండా, స్థానిక ప్రజలు కుడా వాటర్ పాల్స్, ప్రాజెక్ట్, పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తగా

ప్రజల భద్రత మరియు ప్రాణా రక్షణ ను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్ట్, డ్యామ్స్ పరిసరాల వద్దకు పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేయడం జరిగిందని, ఆమె అన్నారు.

సాధారణ పరిస్థితి వచ్చే వరకు పర్యాటక ప్రాంతాలకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు పోలీస్ వారికి సహకరించగలరని సీపీ రేమా రాజేశ్వరి కోరారు.