కెసిఆర్ ముఖ్యమంత్రి కాదు తాలిబన్లు కు అధ్యక్షుడు : వైయస్ షర్మిల*
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్ తో కలిసి నిన్న ప్రగతి భవన్‌లో సమావేశమైన కేసీఆర్.. కేంద్రంపై చేసిన వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో అని అన్నారు.
‘రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు’ అని విమర్శించారు. ఆయన పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదన్న షర్మిల తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలని, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ హక్కుల కోసం ఉద్యమం చేస్తానంటున్నాయన.. స్వరాష్ట్ర హక్కుల కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా? అని నిలదీశారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీపై కేంద్రాన్ని ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు.
ఢిల్లీ హక్కుల కోసం గల్లీ కేసీఆర్ ఉద్యమం చేస్తాడట.. కేంద్రం మెడలు వంచుతడట. పార్లమెంట్ లో బిల్లును ఓడగొట్టేలా ఉద్యమిస్తడట..! అయ్యా దొర గారు..పక్క రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమాలు చేసే మీరు.. స్వరాష్ట్ర ప్రయోజనం కోసం ఒక్క ఉద్యమమైనా చేసిండ్రా.. కనీసం పార్లమెంట్ లో నైనా కొట్లాడిండ్రా..? బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం ఒక్కనాడైనా మాట్లాడావా? కాజీపేట రైల్వే కోచ్ ఎందుకివ్వరు అని ఉద్యమించినవా..? గిరిజన యూనివర్సిటీ పై ఏనాడైనా ప్రశ్నించినవా..? బీజేపీ ఇస్తానన్న రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటే తెలంగాణ బిడ్డల కోసం ఏ రోజైనా నోరు విప్పినవా? ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని ఏనాడైనా పార్లమెంట్ ను స్తంభింపజేసినవా..? అసెంబ్లీ తీర్మానించిన మైనారిటీ,గిరిజన రిజర్వేషన్లను ఎందుకు పెండింగ్ లో పెట్టారని అడిగినవా..? ఢిల్లీ ప్రజల తరుపున మద్దతు కోసం వచ్చిన కేజ్రీవాల్ లెక్క మీరు ఎవరినైనా కలిశారా..?’ అని షర్మిల పలు ప్రశ్నలు సంధించారు.
మూడో కూటమి, ఫెడరల్ కూటమి అంటూ ప్రజల సొమ్ముతో రాజకీయం చేయడం తప్ప రాష్ట్ర ప్రయోజనం కోసం ఏనాడు మద్దతు అడిగింది లేదని, ఉభయ సభల్లో ఉద్యమించింది లేదని విమర్శించారు. ‘నిధులు ఇస్తలేరు అని ప్రగతి భవన్ లో దొంగ ఏడుపులు తప్ప..స్వయంగా ప్రధానినే రాష్ట్రానికొస్తే ఎదుటపడి అడిగింది లేదు. కేసీఅర్ మాటలు కోటలు దాటుతయ్.. చేతలు గడీ గడప దాటయ్ అనే దానికే నిదర్శనం.
సుప్రీం కోర్టు తీర్పునే లెక్క చేయరా అంటూ దొంగ మాటలు చెప్పే దొర గారు... రాష్ట్రంలో జర్నలిస్టుల స్థలాల కోసం ఇచ్చిన సుప్రీం తీర్పును మీరెక్కడ లెక్క చేశారో సమాధానం చెప్పాలి. ఎమర్జెన్సీ పెట్టాల్సింది దేశంలో కాదు..ముందు తెలంగాణలో.. రాష్ట్రంలో నడుస్తుంది ప్రజాస్వామ్యం కాదు..తాలిబన్ల పాలన. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. తాలిబన్లకు అధ్యక్షుడు. రాష్ట్రంలో దొర అరాచకాలు, ఆగడాలకు అంతే లేదు. ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, జైల్లో పెట్టి చావ బాదడాలు. పట్టపగలే నడి రోడ్డుపై హత్యలు. శాంతిభద్రతలు అదుపులో లేవు. రాష్ట్రంలో ప్రజలను బ్రతనివ్వరు. ప్రతిపక్షాలను ఉండనివ్వరు. దొర నియంత పాలనలో ఎన్నికలు కూడా సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదు. అందుకే తెలంగాణలో ఎమర్జెన్సీ విధించాలి. రాష్ట్రపతి పాలన పెట్టాలి’ అని షర్మిల ట్వీట్ చేశారు...
May 28 2023, 20:13