నీట మునగాల్సిందేనా❓️
భూపాలపల్లి జిల్లా గోదావరి ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు కష్టాలు తీరటం లేదు. వానాకాలం వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. గత ఏడాది జూలైలో భారీ వరదలతో గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. వేలాది కుటుంబాల పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. గోదావరి కరకట్టలు కోతకు గురికావటం వల్లే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని గుర్తించినప్పటికీ వాటి మరమ్మతుల ఊసెత్తటం లేదు. స్వయంగా సీఎం కేసీఆర్ కరకట్టల పునరుద్ధరణకు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవటం లేదు. వానాకాలం సమీపిస్తుండటంతో మళ్లీ తమకు ఇబ్బందులు తప్పవేమోనని లోతట్టు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఏటా గోదావరి తీరం కోత..
గోదావరి పరీహవాక ప్రాంతాలకు వానాకాలం భయం వెం టాడుతోంది. జూలైలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద బీభత్సం సృష్టించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వందలాది గ్రామాలు, వేలాది ఎకరాల పంట లు ముంపునకు గురయ్యాయి. వరద నీరు గోదావరి తీరం పక్కన ఉన్న గ్రామాల్లో ప్రజలను ఊళ్లు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
వేలాది మంది ప్రజలు కట్టుబట్టలతో నీట మునిగిన ఇళ్లను వదిలేసి, పునరావాస కేంద్రా ల్లో తల దాచుకున్నారు. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సాగు భూములు గోదావరిలో కలిసి పోవటంతోపాటు ఇసుక మేటలు వేయటంతో రైతన్నలకు కన్నీరే మిగిలింది. ప్రతి ఏటా గోదావరి తీరం వెంట కరకట్టలు కోతకు గురవుతండటంతో పంటపొలాలతో పాటు లోతట్టు ప్రాంతాల్లోని ఊళ్ల కు ఊళ్లే నీట మునుగుతున్నాయి. కరకరట్టలకు మరమ్మతులు లేకపోవటంతో ఏటేటా మరింత ఎక్కువ కోతకు గురై నష్టం భారీగా పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు ప్రమాదపుటంచున బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
రూ.88 కోట్లతో ప్రతిపాదనలు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో లక్ష్మీపురం, గంగారం గ్రామాల మధ్య కరకట్ట కోతకు గురవుతున్నాయి. లక్ష్మీపురం వద్ద గోదావరిలో మానేరు నది కలుస్తుంది. రెండు నదులు కలిసే చోటు కావటంతో పాటు గోదావరిలోకి వచ్చే వరద వెనక్కి మానేరులోకి వస్తుండటంతో మానేరు, గోదావరి తీరాలు కోతకు గురవుతున్నాయి.
జూలైలో దామెరకుంట గ్రామం మొత్తం గోదావరి వరదలో మునిగిపోయింది. వానాకాలం వచ్చిందటే దామెరకుంట, గంగారం, లక్ష్మీపురం, గుండ్రాజుపల్లి, విలసాగర్ తదితర గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో లక్ష్మీపురం నుంచి గంగారం వరకు తొమ్మిది కిలో మీటర్ల మేర కరకట్ట నిర్మాణం చేపట్టడానికి రూ.88కోట్ల అంచనాలతో అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందించారు. మూడు నెలల్లో పనులు చేపట్టాలని ఆదేశించిన ప్రభుత్వం పైసా నిధులు ఇప్పటి వరకు కేటాయించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుతోనే ముంపు తీవ్రత పెరిగిందని స్థానికులు పేర్కొంటున్నారు....
May 28 2023, 10:15