లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే కేసీఆర్‌తో కేజ్రీవాల్ భేటీ...
హైదరాబాద్: లిక్కర్ స్కాం కేసు గురించి చర్చించడానికే సీఎం కేసీఆర్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ భేటీ అవుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ పక్కనే ఉండే అన్నా హాజరే ఎటు పోయారని ప్రశ్నించారు. 69 ఏళ్ళలో రూ. 71 వేల అప్పు చేస్తే... కేవలం 9 ఏళ్ళలో కేసీఆర్ రూ. 5 లక్షలు అప్పు చేశారని విమర్శించారు. ప్రజల దృష్టిని మరలించడానికి ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజాస్వామ్యంపై మోదీకి విశ్వాసం ఉందా? అని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. బీజేపీ పాలన తమకొద్దంటూ జనం చేతులు ఎత్తి దండం పెడుతున్నారన్నారు. దేశంలో ఆర్డినెన్స్‌ల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు. పార్లమెంట్ భవనం ఏదైనా బీజేపీ అప్రజాస్వామికపాలనలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
నల్లధనం తెస్తామన్నారు. ఏమైంది?
అధికారంలోకి రాగానే నల్లధనం తెస్తామని నరేంద్రమోదీ అన్నారని, అది ఏమైందని పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. పార్లమెంట్‌లో నల్లధనం గురించి చర్చించే దమ్ము బీజేపీకి ఉందా? అని నిలదీశారు.
ఉద్యోగాల గురించి డిబేట్ చేసే ధైర్యం ప్రధాని మోదీకి ఉందా?..అదాని కంపెనీలలో పెట్టుబడుల గురించి మాట్లాడమంటే మోదీ ఎందుకు భయపడుతున్నారన్నారు. పార్లమెంట్‌పై నమ్మకం లేని ప్రధాని లాంటి వ్యక్తికి పార్లమెంట్ కొత్త భవనం అయితే ఏంటి, పాత భవనం అయితే ఏంటి? అంటూ పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు..
May 28 2023, 10:11