UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
దిల్లీ: యూపీఎస్సీ ఫలితాల్లో తమకు ర్యాంకు వచ్చిందంటూ మధ్యప్రదేశ్, హరియాణాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు చేసిన ప్రకటనలు మోసపూరితమని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) స్పష్టంచేసింది..
వారిద్దరూ తమలాంటి పేర్లతో ఉన్న వేరే అభ్యర్థుల నంబర్లను చూపించి తమకే ర్యాంకులు వచ్చినట్లు తప్పుదోవపట్టించారంది. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు శుక్రవారం ఒక ప్రటకనలో పేర్కొంది. మధ్యప్రదేశ్‌కు చెందిన అయేషా మక్రానీ, అయేషా ఫాతిమాల్లో తొలి వ్యక్తి అబద్ధాలు చెప్పారని, రెండో వ్యక్తి నిజమైన అభ్యర్థి అని, ఆమెకు 184వ ర్యాంకు వచ్చినట్లు స్పష్టంచేసింది. ''అయేషా మక్రానీ (తండ్రి సలీముద్దీన్ మక్రానీ) తనకు ర్యాంకు వచ్చినట్లు డాక్యుమెంట్లను ఫోర్జ్ చేసింది..
ఆమె రోల్ నంబరు 7805064తో... 2022 జూన్ 5న జరిగిన ప్రిలిమ్స్‌ను రాయగా జనరల్ స్టడీస్ పేపర్-1లో 22.22, పేపర్-2లో 21.09 మార్కులు వచ్చాయి. ఈమె తదుపరి దశకు వెళ్లలేదు. మరోవైపు రోల్ నంబరు 7811744తో పరీక్ష రాసిన అయేషా ఫాతిమా (తండ్రి నిజాముద్దీన్) నిజమైన అభ్యర్థి.
ఆమె 2022 సివిల్స్‌లో 184వ ర్యాంకు పొందారు. అలాగే... హరియాణాలోని రేవారీ ప్రాంతానికి చెందిన తుషార్‌దీ అబద్ధపు కథే. ఇతను 2022లో రోల్ నంబరు 2208860తో ప్రిలిమ్స్ రాశాడు.
అతనికి జనరల్ స్టడీస్ పేపర్-1లో మైనస్ 22.89, పేపర్-2లో 44.73 మార్కులు వచ్చాయి. ఇతను కూడా ప్రిలిమ్స్ స్థాయిలోనే ఫెయిల్ అయ్యాడు. మరోవైపు రోల్ నంబరు 1521306తో పరీక్ష రాసిన బిహార్‌కు చెందిన తుషార్ కుమార్ నిజమైన అభ్యర్థి. అతనికి 44వ ర్యాంకు వచ్చింది'' అని యూపీఎస్‌సీ పేర్కొంది.
May 28 2023, 09:37