వానాకాలం పంటల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన అధికారులు
•జిల్లాలో 3.76 లక్షల ఎకరాల్లో సాగు అంచనా
జనగామ:
వానాకాలం పంటల ప్రణాళిక ఖరారైంది. జిల్లాలో 2023-24 ఖరీ్‌ఫకు సంబంధించిన పంటల అంచనా సాగు విస్తీర్ణం, అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో నేల స్వభావాన్ని బట్టి ఏయే పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశం ఉందనే దాన్ని బట్టి మండలాల వారీగా ప్లానింగ్ తయారు చేశారు. జూన్ నెలతో వానాకాలం సీజన్ ప్రారంభం అవుతున్న తరుణంలో యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశారు.
అన్ని రకాల పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 3.76 లక్షల ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ సీజన్ నుంచి వానాకాలం, యాసంగి సీజన్‌లను ముందుకు జరపాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్‌లో వడగండ్ల వాన కురిసి పంటలకు పెద్ద మొత్తంలో నష్టం జరుగుతోంది. ఈ క్రమంలో ముందస్తుగా నాట్లు వేయించి, ముందస్తుగా కోతలు కోయించేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ సీజన్ నుంచే నిర్ణయాన్ని అమలు చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
జూన్ 15లోగా నాట్లు వేసేలా..
యాసంగి సీజన్‌లో వడగండ్ల వల్ల కలిగే నష్టాన్ని తప్పించాలనే ఉద్దేశంతో ప్ర భుత్వం సీజన్లను ముందుకు జరపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలను సైతం జారీ చేసింది. దీంతో గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు రైతులకు ఆ దిశగా అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా ఏటా వానాకాలం సీజన్‌లో వరి నాట్లు జూలై నెలలో ప్రారంభించి సెప్టెంబరు వరకు వేస్తారు. దీంతో వానాకాలం కోతలు ఆలస్యమై యాసంగి నాట్లు కూడా ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయి.
ఈ క్రమంలో యాసంగి కోతలు మే నెల వరకు జరుగుతున్నాయి. దీంతో మార్చి, ఏప్రిల్ నెలలో సరిగ్గా వరి పంట పొట్ట దశలో ఉన్న సమయంలో వడగండ్లు పడి తీవ్ర నష్టం జరుగుతోంది. దీన్ని అధిగమించేందుకు ముందస్తుగా నాట్లు వేయించాలని అధికారులు చూస్తున్నారు. జూన్ 15లోగా నారు పోసుకొని జూలై 15లోగా నాట్లు పూర్తి చేసేలా చూస్తున్నారు. అదే విధంగా యాసంగి సీజన్‌లో నవంబరు 15లోగా నారు పోసుకొని డిసెంబరు 15 లోగా నాట్లు పూర్తి చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
అనుకూల రకాలపై కసరత్తు
సీజన్‌ను ముందుగా ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా నేలల స్వభావాన్ని బట్టి అవసరమయ్యే కొత్త రకాలను తెప్పించే పనిలో అధికారులు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీజన్‌ను ముందుగా ప్రారంభిస్తున్నందున ఏ జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఏయే రకాలు అవసరమవుతాయనే దానిపై రాష్ట్రస్థాయిలో కసరత్తు జరుగుతోంది. ఈ నెలాఖరులోగా దీనిపై స్పష్టత రానున్నట్లు తెలిసింది. దీంతో జనగామ జిల్లాకు సంబంధించి ఏయే రకాలు సాగుకు అనుకూలంగా ఉంటాయన్న దానిపై క్లారిటీ రానుంది. యాసంగి సీజన్‌లో నవంబరులో నారు పోసుకోవడం వల్ల చల్లి తీవ్రత కారణంగా నారు ఎదగదని రైతులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏ రకాలు అయితే అనుకూలంగా ఉంటాయో అవే రకాలను తెప్పించాలని అధికారులు భావిస్తున్నారు....
May 25 2023, 10:49