ముంబై ని ఒంటి చేత్తో గెలిపించాడు : ఎవరి ఆకాష్
ప్లే ఆఫ్స్ లో ముంబయి ఇండియన్స్. లక్నో జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్. దీంతో చాలామంది ముంబయి గెలుస్తుందని అనుకున్నారు. అనుహ్యంగా టాపార్డర్ సాధారణ స్కోర్లకే పరిమితమైంది. నవీన్ ఉల్ హక్ ఏకంగా 4 వికెట్లు తీశాడు. అయినాసరే ముంబయి ఎలాగోలా 182/8 స్కోరు చేసింది. ఒక్కసారి కుదురుకుంటే లక్నోకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాదని అందరూ అనుకున్నారు. సరిగా ఇలాంటి టైంలో ఓ కుర్రాడు మాయ చేశాడు. రోహిత్, సూర్య, తిలక్ వర్మ కాదు.. తానున్నానంటూ బులెట్ లాంటి బంతులేశాడు. సింగిల్ హ్యాండ్ తో మ్యాచ్ ని గెలిపించాడు. ముంబయి క్వాలిఫయర్-2కి వెళ్లేలా చేశాడు. అసలు ఎవరీ కుర్రాడు? ఇతడికి రిషభ్ పంత్, బుమ్రాతో సంబంధమేంటి?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా బాగానే ఉన్నా బౌలింగ్ మాత్రం తేలిపోయింది. బుమ్రా లేడు. ఆర్చర్ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. అతడి స్థానంలో వచ్చిన జోర్డాన్ కూడా పరుగులిచ్చేస్తున్నాడు. దీంతో ఎలిమినేటర్ మ్యాచ్ లోనూ బౌలింగ్ కష్టమే అనుకున్నారు. ఇలాంటి టైంలో ఆకాష్ మద్వాల్ తన సత్తా చాటాడు. రెండేళ్లుగా జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒక్క ఇన్నింగ్స్ తో నిలబెట్టాడు. అసలు ఎవరీ కుర్రాడు అనుకోవచ్చు. చెప్పాలంటే ఈ సీజన్ లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే పంజాబ్ ని ఆ జట్టు సొంతగడ్డపై కట్టడి చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్ లోనూ సేమ్ ఇలానే అడ్డుకున్నాడు. ఈ రెండింటిలోనూ ముంబయి బ్యాటర్లు ఛేజ్ చేసి గెలవడంతో ఆకాష్ కి పెద్దగా పేరు రాలేదు. లక్నో మ్యాచ్ లో మాత్రం అలా జరగలేదు.
ఈ మ్యాచ్ లో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసింది. నామమాత్ర స్కోరు చేసింది. దీంతో బౌలర్లపై భారం పడింది. దీంతో ఆకాష్ ఆ బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా లేని లోటుని పూడ్చేశాడు. లక్నో జట్టులో ఫామ్ లో ఉన్న ఆయుష్ బదోని, నికోలస్ పూరన్ ని వరస బంతుల్లో ఔట్ చేశాడు. ఓవరాల్ గా 3.3 ఓవర్లలో కేవలం 5 పరుగులే ఇచ్చి, 5 వికెట్లు తీసి ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు.
అసలు మ్యాటర్ చెప్పలేదు.. పాయింట్ కి రా అని మీరు అనుకోవచ్చు. అక్కడికే వచ్చేస్తున్నాం. టెన్నిస్ బాల్ క్రికెట్ తో ఆకట్టుకున్న ఆకాష్ ని.. మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ తొలుత గుర్తించాడు. సరైన కోచింగ్ ఇచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని సరిగా యూజ్ చేసుకున్న ఇతడు.. పేస్ బౌలర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కెరీర్ పరంగా క్రికెటర్ అయినప్పటికీ.. ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ పక్కింట్లోనే ఆకాష్ ఉండేది. వీళ్లిద్దరూ అవతార్ సింగ్ అనే వ్యక్తి దగ్గర క్రికెట్ కోచింగ్ తీసుకున్నారు. పంత్ దిల్లీకి మారిపోతే.. ఆకాష్ మాత్రం ఉత్తరాఖండ్ లోనే ఉండిపోయాడు. ఈ రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఆడిన తొలి క్రికెటర్ ఆకాష్ కావడం మరో విశేషం. 2021లో ఆర్సీబీలో నెట్ బౌలర్ గా ఉన్న ఆకాష్ ని ఆ జట్టు గుర్తించలేకపోయింది. దీంతో 2022 వేలంలో ఇతడిని ఎవరూ తీసుకోలేదు. సూర్యకుమార్ గాయపడటంతో అతడి స్థానంలో ఆకాష్ మద్వాల్ ని జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్ లోనూ రూ.20 లక్షల బేస్ ప్రైజ్ కి అతడిని అట్టిపెట్టుకుంది. అలా పెట్టుకున్న నమ్మకాన్ని ఏ మాత్రం మర్చిపోకుండా ఆకాష్.. ఇప్పుడు తన జట్టుకు సహాయపడ్డాడు. నెక్స్ట్ బుమ్రాగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. సో అదనమాట విషయం...
May 25 2023, 10:47