Disqualified MPs - MLAs | జైలుశిక్ష పడి.. చట్టసభల సభ్యత్వం కోల్పోయిన నేతలు వీరే!
దిల్లీ: మోదీ ఇంటి పేరును కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) జైలుశిక్ష పడిన నేపథ్యంలో ఆయన పార్లమెంట్ సభ్యత్వం (MP)పై అనర్హత వేటు పడింది..
అయితే, అప్పీలుకు వెళ్లేందుకు రాహుల్‌కు 30రోజులు గడువు ఉండటంపై కోర్టు నిర్ణయానికి అనుగుణంగా మళ్లీ ఆయన అర్హత పొందే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.
ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 8(3) ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలి, రెండేళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడిన చట్టసభ సభ్యులు (MP/MLAs) తమ సభ్యత్వాన్ని కోల్పోతారు. ఇలా గతంలో తమ లోక్‌సభ, శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన నేతలను ఓ సారి పరిశీలిస్తే..
మొహమ్మద్ ఫైజల్:ఓ హత్యాయత్నం కేసులో లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్(Mohammed Faizal)ను అక్కడి సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. దీంతో ఈ ఏడాది జనవరిలో తన పార్లమెంట్ సభ్యత్వాన్ని (MP) కోల్పోయారు. అయితే, అనంతరం కేరళ హైకోర్టు స్టే విధించడంతో మళ్లీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించాలని న్యాయశాఖ సిఫార్సు చేసింది.
లాలూ ప్రసాద్ యాదవ్: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కూడా తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. కుంభకోణానికి సంబంధించి 2013లో వచ్చిన తీర్పుతో పార్లమెంటుకు దూరమయ్యారు. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు.
ఆజాం ఖాన్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్ మాజీ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజాంఖాన్‌ను (Azam Khan).. 2019లో చేసిన ద్వేషపూరిత ప్రసంగం కేసులో న్యాయస్థానం దోషిగా తేల్చింది. రాంపుర్ కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం యూపీ అసెంబ్లీ ఆయన్ను అనర్హుడిగా ప్రకటించింది. అంతకుముందు ఎంపీగా ఉన్న ఆయన ఇటీవల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు..
జయలలిత: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత (Jayalalitha) కూడా జైలు శిక్ష కారణంగా అనర్హతకు గురయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా కూడా పడింది. దీంతో అనర్హతకు గురైన ఆమె.. సీఎం పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అనంతరం 2015లో కర్ణాటక హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెడుతూ నిర్దోషిగా ప్రకటించించడంతో.. మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. చివరకు ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది..
Mar 25 2023, 09:23