భారాస బాహుబలి బడ్జెట్ ఇదేనా !
పి,డి,ఎస్,యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్
Street Buzz news తెలంగాణ రాష్ట్రం:
దేశ భవిష్యత్తు నిర్మితం అయ్యేది తరగతి గదుల్లోనే అనే మాటలు తరచుగా వింటుంటాం.ఈ మాటలను సమాజ అభివృద్ధిని కాంక్షించే వారే కాదు ,అభివృద్ధి నిరోధకులు కూడా అంటుంటారు.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కోవలోకి వస్తున్నారు.
ఒక ఇంజనీర్ తప్పు వల్ల నిర్మాణం కూలిపోతుంది.ఒక డాక్టర్ తప్పు చేస్తే రోగి ప్రాణాలు పోతాయి.అలాగే విద్యకు సరైన బడ్జెట్ కేటాయించకుండా ,తగిన తోడ్పాటును అందించకపోతే వ్యవస్థే తారుమారు అవుతుందనేది జగమెరిగిన సత్యమే.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సరిగ్గా ఈ పరిస్థితులే కళ్ళెదుట కనపడుతున్నాయనే దానికి మొన్న బడ్జెట్ లో విద్యారంగానికి నిర్ణయించిన కేటాయింపులే నిదర్శనం .
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో విద్య రంగానికి 11% పైగా నిధులను కేటాయిస్తే అసెంబ్లీ సమావేశాల్లో గగ్గోలు పెట్టి, తెలంగాణ ప్రాంతములో ప్రభుత్వ విద్య వ్యవస్థను ఉన్నతీకరించాలనీ అరిచిన అసెంబ్లీ టైగర్లు నేడు తెలంగాణ స్వరాష్ట్రంలో అతి తక్కువగా 6% నిధులను కేటాయించి చేతులు దులుపుకుంటున్నారు.సమైక్యాంధ్ర పరిపాలనలో నష్ట పోయిన ప్రతి విషయాన్ని నేడు వడ్డీతో సహా అభివృద్ధి చేసుకునే సదవకాశం తెలంగాణలో ఉన్నదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక మీటింగ్స్ లో ప్రకటించి దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు.ప్రభుత్వ విద్య రంగాన్ని పట్టించుకునే బాధ్యత నుండి రాష్ట్ర ప్రభుత్వం క్రమ క్రమంగా పక్కకు తప్పుకుంటుది.ఇందులో భాగంగానే మొన్నటి రాష్ట్ర బడ్జెట్ లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాన రూ/2,90,396 కోట్లు కేటాయించి దీనిలో విద్యకు రూ/ 19,093 కోట్లు (6.57%) కేటాయించింది.మన పక్క రాష్ట్రాలైన ఢిల్లీలో విద్య రంగానికి 23% ,బీహార్ లో 18%,రాజస్థాన్ లో 17%,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 14% నిధులు కేటాయించారు.కానీ తెలంగాణ లో మాత్రం 6.7% కేటాయించి దీనిలో పాఠశాల విద్యకు రూ/16092 కోట్లు కోట్లు, ఉన్నత విద్యకు రూ/ 3001 కోట్లు కేటాయించి, ఇప్పటికే వెంటిలేషన్ పై ఉన్న విశ్వవిద్యాలయాల అభివృద్ది కొరకనీ రూ/500 కోట్లను కేటాయించారు.ఇవి విశ్వ విద్యాలయాలలో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఏ మాత్రం సరిపోవు అని వాళ్లు నియమించిన వివిధ విశ్వ విద్యాలయాల వైస్ ఛాన్సలర్లే తెలుపుతున్నారు.ఒక్క ఉస్మానియ విశ్వ విద్యాలయాన్ని ప్రక్షాళన చేసేందుకే సుమారు రూ/300 కోట్లు అవసరం అవుతాయని విద్యవేత్తలు సూచిస్తున్నారు.తెలంగాణ ,పాలమూరు,మహాత్మా గాంధీ,కాకతీయ,శాతవాహన లాంటి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మరింత ఖర్చు అవుతుంది .
రాష్ట్రంలో 1,002 ప్రభుత్వ గురుకులాల ఉన్నాయని వాటిలో ఐదున్నర లక్షల 59 వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారని అసెంబ్లీలో తెలిపిన ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు గారికి వాటిలో ఎన్ని గురుకులాలకు సొంత భవనాలు ఉన్నాయో,వాటిలో చదువుతున్న విద్యార్థులు ఏ విధమైన సమస్యలను ఎదుర్కుంటున్నారో, వాటి అభివృద్ధికి ఎంత నిధులు కేటాయించాలో తెలియదా? అనే విషయాన్ని గమనించాలి.
సంక్షేమానికి పెద్దపీట వేసామని ప్రకటించుకున్న భారాస నాయకులు రాష్ట్రంలో ఉన్న సంక్షేమ వసతి గృహాల మాటే మరిచారు.ఎన్నికల్లో గెలిచిన రెండేండ్లకే ముఖ్యమంత్రి,మంత్రుల, స్పీకర్ల,మండలి చైర్మన్ జీత భత్యాలను రూ/ రెండు లక్షల 80 వేలకు అలాగే ఎమ్మెల్యే,ఎమ్మెల్సీల జీతభత్యాలను తొంబై ఐదు వేల నుండి రెండు లక్షల 30 వేలకు పెంచుకున్న నాయకులు, పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్,కాస్మొటిక్ చార్జీలను పెంచలేదు.ప్రస్తుతం మూడవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు రూ/ 951 ,ఎనిమిదవ తరగతి నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ/ 1050 చెల్లిస్తున్నారు.పోస్ట్ మెట్రిక్ సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు రూ/ 1500 అందిస్తున్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఈ మెస్ చార్జీలతో చికెన్,కోడి గుడ్డు,నిత్యావసర సరుకుల కొనలేక వార్డెన్లు అప్పులు చేసి హాస్టళ్లను నెట్టుకు వస్తున్నారు.ఫలితంగా సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులు పౌష్ఠిక ఆహారం మరియు సరైన మౌలిక సదుపాయాలు అందుకోలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.అనేక హాస్టళ్లు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి,కొన్నింటికిసొంత భవనాలు ఉన్నప్పటికీని శిధిలావస్థ దశకు చేరుకున్నాయి.ఫలితంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళన నడమ హాస్టళ్లు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో సంక్షేమ హాస్టళ్ల అభివృద్ది గురించి ప్రస్తావనే లేదు. బడ్జెట్ లో విద్యకు తీవ్ర కోతలు విధించి కొండగట్టు దేవస్థాన అభివృద్ది నిమిత్తం రూ/ 100 కోట్లను కేటాయించారు.గత బడ్జెట్ లో యాదాద్రి దేవస్థాన అభివృద్ధికి రూ/ 780 కోట్లు కేటాయించి సనాతన,వైదిక ధర్మ పరిరక్షకుడిగా హిందువుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు శక్తియుక్తులను ఉపయోగించారు.సమాజ అభివృద్ధికి దోహదపడే విద్య,వైద్య,వ్యవసాయ రంగాలను మినహాయించి పెట్టుబడులు తెచ్చే విషయాలన్నింటికీ అసెంబ్లీ బడ్జెట్ లో సింహా భాగాన్ని కేటాయించారు.ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన ఉపకార వేతనాలు,బోధన రుసుములు మాత్రం కోట్లల్లో పెండింగ్ లో ఉంచారు. భారాస ప్రవేశపెట్టిన సుమారు 3 లక్షల కోట్ల బాహుబలి బడ్జెట్ లో ప్రభుత్వ విద్య సంస్థలలో కనీస అవసరాలు అయిన టాయిలెట్లు ,మరుగుదొడ్లు,మంచినీటి సౌకర్యాల కల్పన ,విద్యార్థులకు సరిపడా ఫాకల్టీ కేటాయింపులు,ప్రయోగ శాలలు తదితర అంశాల ఊసే ఎత్తలేదు.మొన్నటికి మొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకర్గము సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్స్ సౌకర్యం లేక విద్యార్థినిలు రోడ్డెక్కారు.ఎక్కడ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తోందో అని విద్యార్థులు మాత్రలు వేసుకొని తరగతులు వింటున్న దయనీయమైన స్థితి రాష్ట్రంలో దాపురించింది.
ఇవేవీ పాలకులకు పట్టవు.ఎంతసేపు ప్రభుత్వ ఖజానా నిపుకునే ధ్యాసలోనే ప్రభుత్వాలు ఉంటున్నాయి.
ఈ విధమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు.?
విద్యార్థి అమరవీరుల ఆత్మ బలిదానాల పై అందలమెక్కిన పాలకులు వారి త్యాగాలను, ఆకాంక్షలను మరిచి పూర్తి భిన్నంగా వ్యహరిస్తున్నారు.విద్యారంగానికి సంబంధించి కొఠారి కమిషన్ తో పాటు అనేక ఇతర కమిషన్లు రాష్ట్రాల వార్షిక బడ్జెట్ లో 30% కి తగ్గకుండా నిధులను కేటాయించాలని సిఫార్సులు చేశాయి. వీటి దిశగా ప్రభుత్వము ఆలోచించాల్సిన తక్షణ బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది.పాలకులు చెప్తున్న బంగారు తెలంగాణలో విద్యార్థులు కూడా భాగమే అని గుర్తించి ,విద్యకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
వ్యాసకర్త
-ఎస్.వి.శ్రీకాంత్ (M.A,LLB)
PDSU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సెల్:7330889605
Feb 12 2023, 15:52