ఇదేం ఘోరం గోవిందా!
శ్రీవారి లడ్డూ ప్రసాదమంటే ఎంతో ప్రీతిపాత్రంగా భావిస్తుంటారు. హిందూ భక్తులకు అది అత్యంత ఇష్ట ప్రసాదం. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో ఎద్దు, పంది తదితర జంతువుల కొవ్వు పదార్థాలతో కల్తీ అయిన నెయ్యిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వినియోగించారని తేలడం శ్రీవారి భక్తకోటిని దిగ్ర్భాంతికి గురి చేస్తోంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం రుచి తగ్గిందన్న విమర్శలు, ఆరోపణలు మొదలయ్యాయి. తర్వాత ఇతర అన్న ప్రసాదాల విషయంలోనూ అవే తరహా ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
అదే సమయంలో ఎంతోకాలంగా నాణ్యమైన నెయ్యి సరఫరా చేస్తున్న తమను టీటీడీ అధికారులు కావాలని పక్కన పెట్టారని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఆరోపించడం దీనికి బలం చేకూర్చింది. అప్పట్లో టీటీడీ యంత్రాంగం మొండిగా ముందుకెళ్లడంతో భక్తులు, హిందూ ధర్మ ప్రచారకులు, ప్రతిపక్ష నేతలూ సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం మినహా మరేమీ చేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం నెయ్యి నాణ్యతను పరీక్షించడంతో కల్తీ గుట్టు రట్టయింది. అభ్యంతరకర పదార్థాలు ఉన్నాయని రిపోర్టుతోసహా టీడీపీ ముఖ్యనేత ఆనం వెంకట్రమణారెడ్డి బహిర్గతం చేయడంతో శ్రీవారి భక్తుల్లో అలజడి రేగుతోంది.
2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడగా, 2020 ఫిబ్రవరి దాకా శ్రీవారి లడ్డూల నాణ్యత గురించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. కొవిడ్ తర్వాత 2020 డిసెంబరు నుంచీ భక్తుల్లో అసంతృప్తి కనిపిస్తూ వచ్చింది. లడ్డూల్లో మునుపటి రుచి గానీ, సువాసన గానీ, నాణ్యత గానీ లేదన్న ఆరోపణలు మొదలయ్యాయి. హిందూ ధర్మ ప్రచారకుడు రాధా మనోహర్ దాస్ తొలిసారి సామాజిక మాధ్యమాల్లో లడ్డూ నాణ్యతను ప్రశ్నించారు. అప్పట్లో ఈ అంశానికి దేశవ్యాప్తంగా ప్రచారం లభించింది. అప్పటి నుంచీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో పలువురు భక్తులు లడ్డూ నాణ్యతపైన, అలాగే అన్న ప్రసాదాలపైన కూడా ఫిర్యాదులు చేయడం ఎక్కువైంది. లడ్డూ రుచికరంగా లేకపోవడంతో పాటు రెండు రోజులకే పాడవుతోందన్న ఫిర్యాదులు పెరిగాయి. ఇక అన్న ప్రసాదాల విషయంలో అయితే అన్న ప్రసాద సత్రంలో భోజనం చేసిన సుమారు 20 మంది భక్తుల బృందం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తింటుంటే గడ్డి తింటున్నట్టు ఉంది. మేము భక్తులమా లేక పశువులమా?’’ అని సిబ్బందిపై విరుచుకుపడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా అప్పట్లో వైరల్ అయింది. అయినా అప్పటి టీటీడీ పాలకమండలి దీన్ని కొట్టి పారేసింది. కానీ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీ నుంచే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా భక్తులనుంచి తీవ్ర విమర్శలు వస్తున్న లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతపై కొత్త ఈవో శ్యామలరావు దృష్టి పెట్టారు. అప్పటికి ఐదేళ్లుగా తమిళనాడుకు చెందిన కంపెనీ సహా ఐదు సంస్థలు తిరుమలకు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి.
ఈవో శ్యామలరావు నెలపాటు పోటు కార్మికులు, అన్న ప్రసాదాల తయారీ విభాగం కార్మికులు, అధికారులతో తరచూ సమావేశమై సమీక్షించారు. ఏయే వస్తువులు వాడుతున్నారు? ఎంత పరిమాణంలో? ఎక్కడి నుంచీ సేకరిస్తున్నారు? వాటి నాణ్యత ఎలా వుంది? పాటించాల్సిన నాణ్యతా ప్రమాణాలు ఏమిటి? అని ఆరా తీశారు. లడ్డూ సహా అన్నప్రసాదాల నాణ్యత తగ్గడానికి ప్రధాన కారణం నాణ్యత లేని నెయ్యి అని ఆయన దృష్టికి వచ్చినట్టు తెలిసింది. దీన్ని నిర్థారించుకోవడానికి ఈ కంపెనీలు సరఫరా చేస్తున్న నెయ్యి శాంపిల్‌ను పరీక్షల నిమిత్తం గుజరాత్‌లోని ఎన్‌డీడీబీకి చెందిన అనుబంధ ల్యాబ్‌కు పంపించారు. జూలై 8న పంపగా వాటి రిపోర్టు అదే నెల 16వ తేదీన వచ్చింది. అందులో.. తమిళనాడుకు చెందిన కంపెనీ అందిస్తున్న నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్టు నివేదిక తేల్చింది. దీంతో తమిళనాడుకు చెందిన సంస్థ నుంచి నెయ్యి సరఫరాను నిలిపివేశారు. మిగతా సంస్థలను నాణ్యతను పాటించాలని హెచ్చరించారు. నందినీ నెయ్యి సరఫరాను పునరుద్ధరించారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో చంద్రబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలకు ఆదేశించారు.
శ్రీవారి అన్న ప్రసాదాల తయారీకి ప్రకృతి వ్యవసాయ దిగుబడులను వాడుతున్నామని, ఆ కారణంగా రుచిలో తేడా వచ్చింది తప్ప నాణ్యత దెబ్బతినలేదని అప్పట్లో టీటీడీ అధికారులు చెప్పిన వివరణ కూడా భక్తులకు సంతృప్తి కలిగించలేదు. అవసరమైన పరీక్షలు నిర్వహించి రుచి, సువాసన, నాణ్యతలో తేడా లేకుండా చర్యలు తీసుకున్నాకే ప్రవేశపెట్టాలి. కానీ, ఆలోచన వచ్చిందే తడవుగా కోట్లాది మంది పవిత్రంగా భావించే ప్రసాదాల తయారీని ఎలా మారుస్తారన్న ప్రశ్నకు టీటీడీ నుంచి అప్పట్లో సమాధానం లేకపోయింది.
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఛైర్మన్ చేసిన ఆరోపణలు, శ్రీవారి ప్రసాదాల నాణ్యత తగ్గిందని వచ్చిన ఫిర్యాదులపై అప్పట్లో టీటీడీ చేసిన వాదన చాలా పేలవంగా అనిపించింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్.. టీటీడీ అవసరాలకు తగిన మేరకు సకాలంలో, తగిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేయలేకపోయిందని టీటీడీ అధికారులు వివరణ ఇచ్చారు. ఒకే సమయంలో కనీసం రెండు మూడు సంస్థల నుంచి టీటీడీ వేర్వేరు పరిమాణాల్లో నెయ్యి సేకరిస్తూ వస్తోంది. 2014 నుంచీ టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న కేఎంఎఫ్ ఎప్పుడూ టీటీడీ నిర్దేశించిన పరిమాణంలో నెయ్యి సరఫరా చేస్తూ వచ్చింది. దీంతో గత ప్రభుత్వంలో అధికారులు చేసిన వాదన నిలవలేదు.దేశంలో గుజరాత్ ఆనంద్ డెయిరీ తర్వాత అంతటి పేరు ప్రతిష్ఠలున్న సంస్థ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్ నందినీ బ్రాండ్ పేరిట నెయ్యిని సుదీర్ఘ కాలం టీటీడీకి సరఫరా చేసింది. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యతాపరంగా పేరు మోసింది. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కూడా కొంతకాలం కేఎంఎ్‌ఫయే టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. అయితే 2023లో హఠాత్తుగా నిందినీ నెయ్యి సరఫరాను నిలిపివేశారు. దీనిపై స్పందించిన టీటీడీ ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టిందని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ అప్పట్లో ఆరోపించారు.తమను టెండర్లలో పాల్గొననివ్వడం లేదని కూడా తెలిపారు. కేఎంఎఫ్ సరఫరా చేసే నెయ్యి నాణ్యత బాగుండడంతో తక్కువ ధరకు టీటీడీకి సరఫరా చేసే పరిస్థితి లేకపోయిందని, తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేయడమంటే నాణ్యత విషయంలో రాజీ పడినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ అధికారులు అప్పట్లో రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకు నెయ్యి సేకరించాలని నిర్ణయించారు. కేఎంఎఫ్ వంటి సంస్థలను పక్కన పెట్టడంతో అనివార్యంగా నాసిరకం నెయ్యిని లడ్డూ తయారీకి వినియోగించాల్సి వచ్చిందన్న ఆరోపణలు వచ్చాయి.
Sep 20 2024, 10:32