చరిత్రపుటల్లో ఓ కమ్యూనిస్టు యోధుడు
బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు...
బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో పన్నుల నిరాకరణోద్యమానికి కేంద్రమైన గుంటూరు జిల్లా పెదనందిపాడులో 1910లో ధనిక భూస్వామ్య కుటుంబంలో జన్మించారు కొల్లా వెంకయ్య. కృష్ణయ్య, రత్నమ్మ దంపతులకు ఆరుగురు సంతానంలో కొల్లా వెంకయ్య పెద్ద కుమారుడు. 1921–22లో పర్వతనేని వీరయ్య నాయకత్వంలో జరిగిన పన్నుల నిరాకరణోద్యమ ప్రభావంతో జాతీయోద్యమంలోకి ఆకర్షితులయ్యారు. పన్నెండేళ్ల వయస్సులో వెంకయ్య పెదనాన్న కొడుకు గోవిందు, ఆయన కుమారుడు పాపయ్య శాంతి సేనలో చేరారు. పెదనందిపాడు గ్రామంలో ఆజానుబాహుడు దాసరి సుబ్బయ్యశెట్టి, లావు వెంకటసుబ్బయ్యలు శాంతి సేనకు ముందు నిలిచేవారు. 1921లో శాంతి సేన ఆధ్వర్యంలో పుసులూరులో పెదనందిపాడు పరిసర ప్రాంత గ్రామ అధికారులు సభ జరిపి తమ పదవులకు రాజీనామా చేశారు. పెదనందిపాడు గ్రామ కరణం సరికా సీతారామయ్య రాజీనామా చేయగా, గ్రామస్తులు ఆయనను పల్లకీలో ఊరేగించారు. ఆ సభకు వెంకయ్య వెళ్లారు. పెదనందిపాడు ఫిర్కా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను గ్రామస్తులు సాంఘిక బహిష్కరణ చేశారు. ఈ ఉద్యమ సమయంలో రైతులే మాల, మాదిగలను ప్రోత్సహించి చెరువులో నీరు ముంచుకునేటట్లు చేశారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మార్పు కొనసాగింది. గ్రామం చివరలో ఉన్న సారా దుకాణాన్ని మూయించారు. వారు మహాత్మాగాంధీ ప్రబోధించిన అంటరానితనానికి, మద్యపానానికి వ్యతిరేకంగా, హిందూ–ముస్లిం ఐక్యత కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
1948–51 వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి మైదాన ప్రాంతం నుంచి ఆ ఉద్యమానికి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పడిన కమిటీకి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లాలో చివుకుల శేషశాస్త్రి, దండా నారాయణస్వామి, కొనికి లక్ష్మీనారాయణ వంటి రైతు నాయకులను కాల్చి చంపుతున్న రోజులవి. ఆ కాలమంతా కొల్లా వెంకయ్య అజ్ఞాత జీవితం గడిపారు. అప్పటికే ఆయన జిల్లాలో గుర్తింపు పొందిన నాయకుడు. రహస్య జీవితమంతా చాలా గడ్డుగా నడిచింది. రాత్రిపూట రైతుల కొట్టాల్లోనూ, పగలు పొలాల్లోనూ గడిపారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టులకు రక్షణ ఇవ్వటం ప్రాణసంకటంగా ఉండేది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం వెంకయ్య గ్రామగ్రామాన కాలినడకన నడిచి ఉద్యమాన్ని నిర్మించారు.
కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర నాయకుడుగా కొల్లా వెంకయ్య వివిధ హోదాలలో పనిచేశారు. సీపీఐ నుంచి సీపీఐ(ఎం) వైపు వచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ మూడు నాలుగు జాతీయ కాంగ్రెస్‌లలో ఆయన కేంద్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) నుంచి తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులతో కలిసి సీపీఐ(ఎం)కి వ్యతిరేకంగా పాలకొల్లు లోనూ, బర్ద్వాన్‌లోనూ సిద్ధాంత పోరాటం నిర్వహించారు. కొంతకాలం చారు మజుందార్ నాయకత్వంలోని సీపీఐ(ఎంఎల్)లో కొనసాగారు. పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి ఏడు సంవత్సరాలకు పైగా జైలు జీవితం అనుభవించారు. నక్సల్బరి, శ్రీకాకుళ పోరాటాలు గాడి తప్పాయని చైనావారు సలహాలు ఇచ్చారు. అది దళ చర్యల ద్వారా సాగించే వ్యక్తిగత సంహారమని జైలు నుంచి కొల్లా వెంకయ్య, కాను సన్యాల్, చౌదరి తేజేశ్వరరావు, భువనమోహన్ పట్నాయక్, నాగభూషణ పట్నాయక్, సౌరీన్ బోస్ తదితరులు చారు మజుందార్‌కు లేఖ ద్వారా తెలియజేశారు. ఆరుగురు కామ్రేడ్స్ లేఖగా అది ప్రసిద్ధి చెందింది. మార్క్సిజం–లెనినిజం, మావో ఆలోచన విధానం మా మౌలిక సిద్ధాంతం అని ఆయన పార్వతీపురం కుట్ర కేసులో వాదించారు. జిల్లా కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధంచగా, హైకోర్టు కొట్టివేసింది.
1952లో పొన్నూరు నుంచి శాసనసభకు, 1957లో శాసనమండలికి, 1962లో తెనాలి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1962లో భారత–చైనా సరిహద్దు ఘర్షణ సమయంలో నిర్బంధానికి గురయ్యారు. 1975లో అత్యవసర పరిస్థితిలో జైల్లో నిర్బంధించబడ్డారు. ఆయన అనేక సిద్ధాంత రచనలు చేశారు. సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉన్నది. వెంకయ్య నిరంతర అధ్యయనశీలి. కుల సమస్య పట్ల ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కుల సమస్య వర్గ సమస్యతో ముడిపడి ఉన్నదనేది ఆయన నిశ్చితాభిప్రాయం. 1955 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలో ఆయన ఒక ‘కీ’ నోటు పెట్టారు.
1977లో జైలు నుంచి విడుదలైన తరువాత, నల్లమడ ముంపు నివారణ కోసం గొప్ప ఉద్యమం నిర్మించారు. 1973 భూగరిష్ఠ పరిమితి చట్టం అమలుకు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1980లో గ్రామీణ పేదల సంఘాన్ని స్థాపించి భూ సంస్కరణల కోసం పోరాడారు. 1986లో భూ సంస్కరణల చట్టం అమలు కోసం సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. 1991లో తీర్పు రాగా, దాని అమలు కోసం జీవిత పర్యంతం పోరాడారు.
ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ రెండు విషయాల్లో తప్పు చేసిందనేది ఆయన నిశ్చితాభిప్రాయం. ఒకటి– ఎన్నికల్లో భూస్వామ్య పార్టీలతో పొత్తు కట్టటం, రెండు– సాయుధపోరాటం కొరకు పంథాను రూపొందించడం, అమలుపరచటంలోనూ! భారతదేశం అర్ధ వలస, భూస్వామ్య దేశం అని పార్లమెంటరీ పంథాను ఆయన తిరస్కరించారు. ఈ దేశంలో సోషలిజం స్థాపన జరగాలంటే కమ్యూనిస్టు ఉద్యమం సూత్రబద్ధంగా ఐక్యం కావాలని అందుకోసం ఆయన సుదీర్ఘ కృషి చేశారు. కడదాకా పేదరిక నిర్మూలన కోసం, సమసమాజం కోసం, ఎన్నో ఆటుపోట్లను, నిర్బంధాలను తట్టుకొని దోపిడీ రహిత సమాజం కోసం పోరాడిన కొల్లా వెంకయ్య నేటి తరానికి ఆదర్శప్రాయుడు. ఆయన చనిపోయి నేటితో 26 సంవత్సరాలు పూర్తి అయింది.
Sep 18 2024, 19:09