ఇదేం సర్వే.. ఇదేం పద్ధతి
రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమగ్ర కులగణన సర్వే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 6వ తేదీ నుంచి నిర్వహించ తలపెట్టిన సమగ్ర కులగణన సర్వే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు, రాజకీయ విశ్లేషకులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. చివరకు పలువురు బీసీ మంత్రు లు, స్వపక్షంలోని ఎమ్మెల్యేలు కూడా అసహనంతో ఉన్నారనే చర్చ జరుగుతున్నది. సర్వే కోసం రూపొందించిన ప్రశ్నావళిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోలను ముద్రించడాన్ని తప్పుబడుతున్నారు. సర్వే అనేది సంక్షేమ కార్యక్రమం కాదని, ఫొటోలు ముద్రించుకోవడం తగదని హితువు చెప్తున్నారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ ద్వారా సేకరించే సమాచారానికి గోప్యత ఉంటుందనే భరోసాను కల్పించకుండా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఇప్పటికే బీహార్, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ర్టాలు సమగ్ర కులగణన సర్వేలను నిర్వహించాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సర్వేలకు సంబంధించిన ప్రశ్నావళి, ట్రైనింగ్ బ్రోచర్లపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలను ముద్రించలేదని సామాజికవేత్తలు చెప్తున్నారు. ఆయా రాష్ర్టాలు డాటా సేకరణ పత్రాలపై కేవలం రాష్ట్ర చిహ్నాన్ని మాత్రమే ముద్రించాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. కానీ, రాష్ట్రంలో మాత్రం సర్వే ప్రశ్నావళిపై సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటోలను ముద్రించడాన్ని తప్పుబడుతున్నారు. ఇది డాటా సేకరణను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. విభిన్న రాజకీయ అభిప్రాయాలు ఉన్నవాళ్లు ఉంటారని, ఫొటోలతో ప్రభావితమవుతారని చెప్తున్నారు. కచ్చితమైన వివరాలను ఇచ్చేందుకు అయిష్టత చూపేవారు కూడా ఉంటారని, దీంతో అసమగ్రంగానే వివరాలు అందుబాటులోకి వచ్చి సర్వే లక్ష్యమే దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఏకపక్షంగా కొనసాగే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్‌ను వ్యతిరేకించేవారు వివరాల నమోదుకు ముందుకు రాకపోవచ్చని వివరిస్తున్నారు.
సర్వే విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కూడా సామాజికవేత్తలు, బీసీ సంఘాల నేతలు విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. సేకరించే సమాచారానికి గోప్యత ఉంటుందన్న భరోసా లేకుండా పోతున్నదనే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సర్వే ఎందుకు, ఏ లక్ష్యం కోసం చేస్తున్నారు? ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? అనే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సమగ్ర సర్వే నిర్వహణకు ప్రామాణిక పద్ధతులు, నిబంధనలు ఉన్నాయని గుర్తుచేస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫ్ ఎంక్వయిరీస్ చట్టం-1952 ప్రకారం.. స్వయం ప్రతిపత్తి కలిగిన కమిషన్‌తోపాటు గణాంకాల సేకరణకు ఒక ప్రభుత్వ శాఖను నోడల్ డిపార్ట్‌మెంట్‌గా ఏర్పాటుచేయాలని, నోడల్ ఏజెన్సీకి నోడల్ అధికారిని, కమిషన్‌కు కార్యదర్శిని నియమించాల్సి ఉంటుందని వివరిస్తున్నారు.
కులగణన సర్వే తీరుపై స్వపక్షంలోని కొందరు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామం టూ సీఎం, డిప్యూటీ సీఎంలే క్రెడిట్ కొట్టేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అసహ నం వ్యక్తంచేస్తున్నారని సమాచారం. సర్వే సమీక్షలు, సమావేశాలపై సమాచారం ఇవ్వడం లేదని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏకంగా ప్రశ్నావళి పత్రాలపై కూడా ఆ ఇద్దరి ఫొ టోలను ముద్రించడంపై లోలోన రగిలిపోతున్నారని కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటున్నారు.
Nov 02 2024, 12:20