రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
కేంద్ర మంత్రివర్గం మరో రైల్వే లైన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది.
అమరావతి రైల్వే లైన్‌కి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 57 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించింది. రూ. 2,245 కోట్లతో రైల్వే లైన్ నిర్మాణం చేస్తుంది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు కొత్త లైన్‌ను కేంద్రం శ్రీకారం చుట్టింది. కొత్తగా కృష్ణ నదిపై 3 కిలో మీటర్ల మేర బ్రిడ్జి నిర్మాణం చేపట్టనుంది.
కాగా.. అమరావతి రైలు మార్గానికి తొలి అడుగుపడింది. గత ఐదేళ్లుగా వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని రైలు మార్గానికి కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే నిధులు కేటాయింపు జరిగింది. తొలిసారిగా రూ.50.01 కోట్ల నిధులను కేటాయించడంతో సాధ్యమైనంత త్వరలోనే పనులు ప్రారంభమౌతాయని పలువురు భావిస్తున్నారు. అమరావతి రైలుతో పాటు గుంటూరు రైల్వే డివిజన్‌కి సంబంధించి కొత్త ప్రాజెక్టులు, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం నిధుల కేటాయింపు జరిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.1100 కోట్లకు పైగా నిధులు కేటాయించడంపై రైల్వే వర్గాలతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నెల తర్వాత రైల్వే కేటాయింపులకు సంబంధించిన పింక్‌బుక్ ఎట్టకేలకు రైల్వేపోర్టల్‌లో అందుబాటులోకి రావడంతో ఈ అంశాలు వెలుగుచూశాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలు(డబుల్ ఇంజిన్ సర్కార్) కావడంతో ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లు తేలింది. సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీల ప్రయత్నాలు ఫలించినట్లు అర్థమవుతోంది. ఇంచుమించు ఏడు, ఎనిమిదేళ్ల క్రితం అమరావతి రాజధాని నూతన రైలుమార్గానికి పింక్‌బుక్‌లో చోటు దక్కింది. ఆ తర్వాత తొలిగా ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించి కేంద్రం ఉదారతను చాటుకున్నది. మరికొన్ని ప్రాజెక్టులకు కూడా భారీగానే నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతున్నది.
అమరావతి రాజధానికి రైలుమార్గం ఉంటే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని 2014-19 మధ్యనే టీడీపీ ప్రభుత్వం ఆలోచన చేసింది. అప్పట్లో కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ-1 ప్రభుత్వంతో మాట్లాడి ప్రాజెక్టుని మంజూరు చేయించింది. ఈ రైలుమార్గం మొత్తం పొడవు 106 కిలోమీటర్లు. ఇందులో ఒక సెక్షన్ ఎర్రుపాలెం - నంబూరు మధ్య 55.8 కిలోమీటర్ల పొడవు, రెండోది అమరావతి - పెదకూరపాడు 24.5 కిలోమీటర్లు, మూడోది సత్తెనపల్లి - నరసరావుపేట 25 కిలోమీటర్ల పొడవునా డీపీఆర్ కూడా ఆమోదించారు. మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2679.59 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ రైలుమార్గానికి అవసరమయ్యే భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలి. అయితే ఎన్‌డీఏ-1 చివరలో బీజేపీ, టీడీపీకి మధ్య అభిప్రాయభేదాలతో ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఆ తర్వాత అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం అసలు ఈ ప్రాజెక్టు ప్రస్తావన అనేది ఐదేళ్లలో తీసుకురాలేదు. దాంతో ఏటా కేంద్ర బడ్జెట్‌లో మొక్కుబడిగా రూ.లక్ష మాత్రమే కేటాయిస్తూ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎన్‌డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడటం, అందులో టీడీపీ భాగస్వామ్యం కావడంతో అమరావతి రైలుమార్గానికి మళ్లీ మంచి రోజులొచ్చాయి.
ఇక నిర్మాణంలో ఉన్న నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్ ఫండ్ కింద రూ.250 కోట్లు, కేపిటల్ ఫండ్ కింద రూ.60 కోట్లు కలిపి మొత్తం రూ.310 కోట్లు కేటాయించింది. గుంటూరు - గుంతకల్లు డబ్లింగ్‌లో కీలకమైన నల్లమడ అటవీ ప్రాంతంలో పనులు చేపట్టాల్సి ఉన్నది. ఇందుకు ఖర్చు కూడా ఎక్కువ కానుండటంతో ఏకంగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు కేటాయింపులు జరిపింది. రద్దీ మార్గాల్లో ఒకటిగా మారిన గుంటూరు - బీబీనగర్ డబ్లింగ్ కోసం ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకి రూ.220 కోట్లు కేటాయించింది. విష్ణుపురం బైపాసు రైలుమార్గానికి రూ.20 కోట్లు, మోటుమర్రి - విష్ణుపురం డబ్లింగ్ ప్రాజెక్టుకి రూ.50 కోట్లు కేటాయించింది. 88 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న ఈ రైలుమార్గంలో మోటుమర్రి వద్ద రైల్ ఓవర్ రైలు బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. అలానే గుంటూరు యార్డులో మల్టీ ట్రాకింగ్ కనెక్టివిటీ పనుల నిమిత్తం మరో రూ.50 కోట్లు కేటాయించింది.
Oct 24 2024, 18:56