తిరుమల లడ్డూ వ్యవహారంలో అనుకోని మలుపు- తెరపై సాధువులు
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. రోజుకో మలుపు తిరుగుతోంది. కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, చేపనూనెలను వాడారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంపై ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తోన్నారు. అప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటూ తేల్చి చెబుతున్నారు. తాము ఎలాంటి తప్పూ చేయలేదని, అలాంటప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తోన్నారు.
అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఏకంగా తిరుమల శ్రీవారి ఆలయం మహాద్వారం వద్ద బహిరంగంగా ప్రమాణం చేశారు. తప్పు చేసివుంటే తాను, తన కుటుంబం సర్వనాశనం కావాలని వేంకటేశ్వరస్వామిని కోరుకున్నారు.
ఈ క్రమంలో మరో డిమాండ్ తెర మీదికి వచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, చేప నూనెను కల్తీ చేసిన వారిపై ఎఫ్ఐఆర్‌ను నమోదు చేయాలంటూ ఏపీ హిందూ సాధు పరిషత్ ఆందోళనకు దిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేపట్టింది
టీటీడీ అడ్మినిస్ట్రేషన్ భవన్ వద్ద ఈ ఉదయం సాధు పరిషత్ ప్రతినిధులు ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు. శంఖనాదం చేశారు. ఈ ఉదంతానికి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని, వారిపై అత్యంత కఠిన చర్యలను తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
Sep 24 2024, 14:11