మళ్ళీ వర్షాల హెచ్చరిక పంపిన వరుణుడు!
ఋతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పలు జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
సెప్టెంబర్ 20వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, కొత్తగూడెం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది.
సెప్టెంబర్ 21న ఈ జిల్లాలలో వర్షాలు
ఆపై సెప్టెంబర్ 21వ తేదీన కూడా వర్షాలు కురుస్తాయని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. సెప్టెంబర్ 21వ తేదీన రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
సెప్టెంబర్ 22వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సెప్టెంబర్ 21వ తేదీన కూడా ఈ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక సెప్టెంబర్ 22వ తేదీ కూడా పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. అయితే సెప్టెంబర్ 22వ తేదీన ఎలాంటి వర్ష హెచ్చరికలు లేవని పేర్కొంది.
ఇక ఈరోజు హైదరాబాద్ లో వాతావరణం చూసినట్లయితే సాయంత్రం వేళలలో కానీ, రాత్రి సమయంలో కానీ నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 15వ తేదీ వరకు నైరుతి రుతుపవనాలు తిరోగమనం అవుతాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అప్పటివరకు రాష్ట్రంలో అనేక చోట్ల అడపా దడపా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Sep 18 2024, 19:20