బతుకమ్మకుంటను బతికిస్తాం...
అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు.
అంబర్‌పేట బతుకమ్మకుంటను చెరబట్టిన వారిని వదిలేది లేదని, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) తెలిపారు. బతుకమ్మకుంట స్థలాన్ని రక్షించాలని మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ జ్ఞానేశ్వర్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కమిషనర్ బుధవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు. చెరువు లేఅవుట్, చుట్టుపక్కల కాలనీలు తదితరాంశాలను తెలుసుకున్నారు. బతుకమ్మకుంట చెరువు, రికార్డులు, కోర్టు కేసులను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే చర్యలు చేపడతామని కమిషనర్ వివరించారు.
త్వరలో వచ్చే బతుకమ్మ పండుగ లేదా వచ్చే ఏడాది నాటికి బతుకమ్మకుంట చెరువును ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అలాగే, గోల్నాక డివిజన్ హుస్సేన్‌సాగర్ నాలా బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, పార్టీ నేతలు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అనుమతి లేకుండా అదనపు అంతస్తులు నిర్మిస్తున్న భవనాలను టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. నార్సింగి మున్సిపల్ పరిధిలోని విజయనగర్ కాలనీలో ఓ నిర్మాణదారుడు నాలుగు అంతస్తులకు అనుమతి తీసుకొని ఆరు అంతస్తులు నిర్మించాడు. సమాచారం అందుకున్న అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అలాగే మణికొండ మున్సిపాలిటీ చిత్రపురి కాలనీలో రెండోరోజు కూల్చివేతలు కొనసాగాయి. మంగళవారం పాక్షికంగా కూల్చిన భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతోపాటు మరోమూడు విల్లాలను బుధవారం కూల్చివేశారు.
Aug 22 2024, 12:50