సీఎం సిద్ధరామయ్యకు అరెస్ట్ తప్పదా.. కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశం?
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అరెస్ట్ కానున్నారా. ఇటీవలి కాలంలో వివిధ కేసుల్లో జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరెస్ట్ అయిన నేపథ్యంలో సిద్ధరామయ్య కూడా అరెస్ట్ అవుతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముడా కుంభకోణంలో సీఎంపై, సీఎం కుటుంబసభ్యులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి చట్టం కింద సీఎంపై విచారణకు.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో కర్ణాటక రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఏం జరుగుతోందని ఆసక్తి నెలకొంది.
కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ముడా భూముల కేటాయింపు వ్యవహారం ప్రస్తుతం.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చులా బిగుసుకుంటుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో సీఎంపై విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేయడంతో.. సిద్ధరామయ్యను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం సిద్ధరామయ్య.. కర్ణాటక కేబినెట్‌ను అత్యవసరంగా భేటీకి పిలవడం ప్రస్తుతం మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే ముడా కుంభకోణం వ్యవహారంలో సీఎంపై విచారణకు అనుమతించడంతో తదుపరి ఏం చర్యలు తీసుకోవాలి అనే దానిపై కర్ణాటక మంత్రివర్గం సమాలోచనలు చేయనుంది.
అయితే కర్ణాటకలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ మొత్తం సిద్ధరామయ్యకు మద్దతుగా నిలుస్తోంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కేటాయింపు వ్యవహారం.. ఇప్పుడు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అనుమతి మంజూరు చేయడంతో కర్ణాటకలో తీవ్ర చర్చకు దారి తీసింది. భారత్ నాగరిక్ సురక్ష సంహితలోని అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 కింద ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరు చేశారు.
ఇక తాజా పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని.. హస్తం పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ఇదే వ్యవహారంపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. ఇక ఇదే వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై సిద్ధరామయ్యతో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు తనపై గవర్నర్ అనుమతిని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించే ఆలోచనలో సీఎం సిద్ధరామయ్య ఉన్నట్లు సమాచారం.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ భూముల కుంభకోణం విషయంలో.. ముగ్గురు వ్యక్తులు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులను స్వీకరించిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. సీఎంపై విచారణకు అనుమతి మంజూరు చేసినట్లు రాజ్‌భవన్ ఒక లేఖను విడుదల చేసింది. కాగా ముడాకు సంబంధించి 14 ఇళ్ల స్థలాలను సీఎం సిద్ధరామయ్య తన భార్యకు కేటాయించారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించి ఈ రోజు సాయంత్రం కర్ణాటక కేబినెట్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటకలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.
Aug 17 2024, 20:49