భూపాలపల్లి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ పరిస్థితి ఏంటి?
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వింత రాజకీయం నడుస్తోంది. పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాలు, భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాలను కలుపుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా ఏర్పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్‌దే హవా. జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో జక్కు శ్రీహర్షిణి ఆ పదవి చేపట్టారు. ఎంతో హుషారుగా ఆ పదవిలో కూర్చున్నా.. జిల్లాలోని రాజకీయ పరిస్థితులు ఆమె ఉత్సహాన్ని ఆవిరి చేస్తున్నట్టు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజకీయ ఎత్తుగడల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట జడ్పీ ఛైర్‌పర్సన్.
భూపాలపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జడ్పీ ఛైర్‌పర్సన్ శ్రీహర్షణిని పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. దీనికి ఎమ్మెల్యే వైఖరే కారణమని చెవులు కొరుక్కుంటున్నారు. గండ్ర జ్యోతి భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షురాలు అయిన తర్వాత శ్రీహర్షణికి పార్టీ పరంగా ఇంకా ఇబ్బందులు పెరిగాయట. గండ్ర జ్యోతి కూడా జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఒక జడ్పీ ఛైర్‌పర్సన్ మరో జడ్పీ ఛైర్‌పర్సన్ విషయంలో చెక్ పెట్టడం రాజకీయంగా కూడా చర్చగా మారుతోంది.
ప్రొటోకాల్ ఇవ్వకపోవడం.. పార్టీ నేతలు కూడా లెక్క చేయకపోవడంతో.. దూకుడు తగ్గించారట శ్రీహర్షణి. కార్యక్రమాలే రావడం లేదట. మాజీ ఎమ్మెల్యేకు లభిస్తున్న గౌరవం కూడా దక్కడం లేదని టాక్. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వడం కూడా ప్రతికూలంగా మారుతోందని.. జడ్పీ ఛైర్‌పర్సన్ పదవి కేవలం అలంకార ప్రాయంగా మారిపోయిందని వాపోతున్నారట. ప్రాధాన్యం ఇస్తే.. రేపటి రోజున నియోజకవర్గంలో పోటీకి వస్తారనే భయంతోనే ఎమ్మెల్యేలు.. పార్టీ నేతలు చెక్ పెడుతున్నట్టు కొందరి అనుమానం.
మంథని నియోజకవర్గంలోని కాటారం, మహాముత్తారం, మల్హర్, మహదేవ్‌పూర్ మండలాల్లో చేపట్టే కార్యక్రమాలకు మాత్రే జడ్పీ ఛైర్మన్ హోదాలో శ్రీహర్షిణి హాజరువుతున్నారట. జిల్లాలో 11 మండలాలు ఉంటే.. కేవలం ఆరు మండలాల్లోనే ఆమె పర్యటించే పరిస్థితి ఉందట. దీనిపై అధికారపార్టీ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటుంటే.. విపక్షాలకు మాత్రం పెద్ద అస్త్రంగా మారిపోతున్నాయి జరుగుతున్న పరిణామాలు. తాజాగా జరిగిన స్థాయి సంఘం సమావేశానికి కూడా ఆమె రాలేదు. ఇక్కడి పరిణామాలపై టీఆర్‌ఎస్ పెద్దలు కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అనుకుంటున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి....
Jul 04 2023, 18:40